సోమవారం 28 సెప్టెంబర్ 2020
Jagityal - May 29, 2020 , 01:33:34

సన్నరకం పండిస్తం

సన్నరకం పండిస్తం

కేసీఆర్‌ సారు వెంటే నడుస్తం

జగిత్యాల మండలం వెల్దుర్తి, బీర్‌పూర్‌ రైతుల ప్రతిజ్ఞ

 రైతన్న నిర్ణయానికి శతకోటి వందనాలు

ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌

జగిత్యాల రూరల్‌ : ‘సర్కారుచెప్పినట్టే సన్న రకం వరి పంటను పండిస్తం. కేసీఆర్‌ సారు వెంటే నడుస్తం’ అంటూ జగిత్యాల రూరల్‌ మండలంలోని వెల్దుర్తి, బీర్‌పూర్‌ మండల కేంద్ర రైతులు సమష్టిగా ఎమ్మెల్యే, జడ్పీ అధ్యక్షురాలు, కలెక్టర్‌ ఎదుట ప్రతిజ్ఞ చేశారు. వెల్దుర్తి, బీర్‌పూర్‌లో నియంత్రిత పంటల సాగుపై రైతులకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌, జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత, కలెక్టర్‌ గుగులోత్‌ రవి పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, సర్కారు నిర్ణయానికి మద్దతు పలికిన రైతుల నిర్ణయానికి శతకోటి వందనాలు అని అభినందించారు. రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు సీఎం కేసీఆర్‌ నియంత్రిత పంటల సాగు విధానాన్ని రూపొందించారన్నారు. రైతును రాజుగా చేయాలన్నదే ఆయన సంకల్పమన్నారు. అధికారులు సూచించిన పంటలను సాగు చేసి మంచి లాభాలు పొందాలన్నారు. ప్రతిపక్షాలు నియంత్రిత పంటల సాగుపై ప్రజలకు అపోహలు కాకుండా అవగాహన కల్పించాలని, అందరం కలిసికట్టుగా ఆలోచించి నిర్ణయం తీసుకుందామన్నారు. ప్రతి రైతుకు తప్పని సరిగా రైతుబంధు అందుతుందని రైతులు ఆందోళన చెందవద్దన్నారు. జిల్లాలోని 18 మండలాల్లో 13 మండలాలు ఆయిల్‌పాం సాగుకు అనుకూలంగా ఉన్నట్లు సర్వేలో వెల్లడైందని, వీటిలో సారంగాపూర్‌, బీర్‌పూర్‌ మండలాలూ ఉన్నాయని, ఆసక్తి ఉన్న రైతులు వ్యవసాయ అధికారులను సంప్రదించాలని కోరారు. ప్రతి రైతు ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో నియంత్రిత సాగు విధానం ఉద్దేశమని జడ్పీ అధ్యక్షురాలు పేర్కొన్నారు. రైతులు మార్కెట్‌లో డిమాండ్‌ గల పంటలనే సాగు చేయాలని కలెక్టర్‌ గుగులోత్‌ రవి సూచించారు. వెల్దుర్తి గ్రామ రైతులు గత వానకాలంలో 50 శాతం రైతులు సన్నరకం వరి సాగు చేశారన్నారు. ప్రస్తుతం 660 ఎకరాల్లో సన్నరకం ధాన్యం పండిస్తామని తీర్మానం చేయడం అభినందనీయమన్నారు. వ్యవసాయాధికారులు మండలాలు, గ్రామాల వారీగా రైతులతో చర్చించి పంటల నియంత్రిత సాగుపై మైక్రో ప్లాన్‌ను రూపొందించాలన్నారు. జిల్లాలో గత వానకాలం 2.31లక్షల ఎకరాల్లో వరి సాగైందని, ఈసారి 2.88 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయనున్నారన్నారు. ఈ సందర్భంగా వెల్దుర్తిలో సన్న రకం ధాన్యాన్నే పండిస్తామని రైతులు ప్రతిజ్ఞ చేశారు. రోహిణి కార్తెలో సన్నరకం వరి నారు పోసిన గ్రామానికి చెందిన ముద్దమల్ల లక్ష్మీరాజం పొలంలో ఎమ్మెల్యే, కలెక్టర్‌, జడ్పీ అధ్యక్షురాలు మొలకలు చల్లారు. ఈ కార్యక్రమంలో డీఏవో సురేశ్‌ కుమార్‌, ఉద్యానవన అధికారి ప్రతాప్‌సింగ్‌, ఆర్బీఎస్‌ జిల్లా అధ్యక్షుడు చీటి వెంకట్‌రావు, ఎంపీపీలు గాజర్ల గంగారం గౌడ్‌, మసర్తి రమేశ్‌, వైస్‌ ఎంపీపీ లక్ష్మణ్‌రావు, సర్పంచ్‌ బుర్ర ప్రవీణ్‌, కేడీసీసీబీ డైరెక్టర్‌ రాంచందర్‌రావు, ఏఎంసీ చైర్మన్‌ దామోదర్‌రావు, ప్యాక్స్‌ చైర్మన్లు మహిపాల్‌రెడ్డి, నవీన్‌రావు, ఆర్బీఎస్‌ జిల్లా సభ్యుడు రమణ, మండలాల కన్వీనర్లు రవీందర్‌రెడ్డి, శంకర్‌, రాజేశం, కృష్ణారావు, అర్బన్‌ జడ్పీటీసీ సభ్యులు మహేశ్‌, తహసీల్దార్‌ నాగార్జున, ఎంపీడీవో పుల్లయ్య, మండల ప్రత్యేకాధికారి సోమేశ్వర్‌, ఏఈవో హరీశ్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు రమేశ్‌, ప్రజాప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


logo