మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Jagityal - May 28, 2020 , 05:08:00

పేదలకు సీఎంఆర్‌ఎఫ్‌ అభయహస్తం

పేదలకు సీఎంఆర్‌ఎఫ్‌ అభయహస్తం

  • ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి ఈశ్వర్‌
  • 186 మంది లబ్ధిదారులకు రూ. 59,19,500 విలువైన చెక్కులు అందజేత

ధర్మపురి/ధర్మారం: ఆపదలో ఉన్న పేదలకు సీఎంఆర్‌ఎఫ్‌ అభయహస్తం లాంటిదని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు. ధర్మపురి నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన 186 మంది లబ్ధిదారులకు రూ.59,19,500 విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను బుధవారం కరీంనగర్‌లోని తన క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడారు. పేదలు అత్యవసర పరిస్థితిలో కార్పొరేట్‌ దవాఖానల్లో వైద్యం చేయించుకుంటే ఆయా చికిత్సలను బట్టి రూ.10వేల నుంచి ఎంతవరకైనా సహాయం అందించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారని తెలిపారు. లివర్‌మార్పిడి, క్యాన్సర్‌ లాంటి వైద్యచికిత్సలకు కూడా ఒక్కో పేషెంట్‌కు రూ.35లక్షల దాకా అందించామని వివరించారు. ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటి దాకా 12వేల మంది రూ.22కోట్లకు పైగా సీఎంఆర్‌ఎఫ్‌ నుంచి లబ్ధిపొందారని తెలిపారు. పేదలను ఆదుకోవడంలో తన వంతు పాత్ర ఉండడం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. సీఎం సహాయనిధి ద్వారా పేదలను ఆదుకోవడంలో ధర్మపురి నియోజకవర్గం రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచిందని వెల్లడించారు. కొందరు దవాఖాన ఖర్చులు చెల్లించుకోలేని వారికి లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌(ఎల్‌వోసీ)అందజేస్తున్నామని చెప్పారు. వీటి మంజూరులో జాప్యం కాకూడదనే సీఎం సచివాలయంలో ప్రత్యేక సెక్షన్‌ ఏర్పాటు చేయించారని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌, మంత్రి ఈశ్వర్‌కు లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


logo