శనివారం 19 సెప్టెంబర్ 2020
Jagityal - May 28, 2020 , 04:30:57

రికార్డుల ‘శిఖరం’

రికార్డుల ‘శిఖరం’

  • 2019లో కిలిమంజారో, =మౌంట్‌ ఎల్‌బ్రోస్‌ అధిరోహణ
  • ఎవరెస్ట్‌ ఎక్కేందుకు సిద్ధమవుతున్న మహిపాల్‌రెడ్డి

శిక్షణలో భాగంగా నేపాల్‌లోని మనస్లూ పర్వతంపైకి.. పర్వతారోహణ.. ఓ కష్టతరమైన సాహసం. ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకుంటూ పర్వతపు శిఖరాలను చేరడం అతికొద్ది మందికి మాత్రమే సాధ్యం. అలాంటి ట్రెక్కింగ్‌లో రాణిస్తూ, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మౌంట్‌ ఎవరెస్ట్‌నూ అధిరోహించేందుకు     సిద్ధమవుతున్నాడు పెద్దపల్లి జిల్లాకు చెందిన యువకుడు. ఓవైపు వృత్తి ధర్మాన్ని నిబద్ధతతో నిర్వర్తిస్తూనే.. ప్రాణప్రదంగా భావించే ట్రెక్కింగ్‌లోనూ సత్తా చాటుతున్నాడు. ఇప్పటికే కిలిమంజారో, మౌంట్‌ ఎల్‌బ్రోస్‌, మనస్లూ శిఖరాలపై మువ్వన్నెల జెండాలను    ఎగరేసి, పలు  రికార్డులను కొల్లగొట్టాడు.

- కరీంనగర్‌ స్పోర్ట్స్‌

పెద్దపల్లి జిల్లా సెంటినరీకాలనీకి చెందిన లెంకల మహిపాల్‌రెడ్డికి చిన్నతనం నుంచే సాహస క్రీడలపై ఆసక్తి ఎక్కువ. 2012లో ఆర్టీసీలో కానిస్టేబుల్‌గా ఎంపికై, రెండేళ్లపాటు విధులు నిర్వహించాడు. అనంతరం ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగం సాధించి, విధి నిర్వహణలో ఉత్తమ ఉద్యోగిగా ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. మరోవైపు తాను అమితంగా ఇష్టపడే పర్వతారోహణలోనూ సత్తా చాటుతూ, అనేక రికార్డులను కొల్లగొడుతున్నాడు. 

కిలిమంజారో, ఎల్‌బ్రోస్‌ అధిరోహణ..

పర్వతారోహణలో శిక్షణ పొందేందుకు 2019 మే నెలలో అరుణాచల్‌ప్రదేశ్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మౌంటనిరింగ్‌, అలైడ్‌స్పోర్ట్స్‌ నందు బేసిక్‌ మౌంటనిరింగ్‌ శిక్షణను ఏ గ్రేడ్‌లో విజయవంతంగా పూర్తి చేశాడు. ఆఫ్రికా ఖండంలోనే అతిఎత్తైన కిలిమంజారో (టాంజానియాలోని)ను 2019 మేలో అధిరోహించి, పలువురి నుంచి ప్ర శంసలు అందుకున్నాడు. ఈ ట్రెక్కింగ్‌ దేశం నుంచి 12మంది ఎంపికకాగా. ఇందులో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన మహిపాల్‌ ఒకరు కావడం గర్వకారణం.

2020లో మనస్లూను..

ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించేందుకు సిద్ధమవుతున్నాడు మహిపాల్‌ రెడ్డి. ఈ క్రమంలో ప్రాక్టీస్‌లో భాగంగా నేపాల్‌లోని 8100 మీటర్ల ఎత్తుగల మనస్లూ పర్వత శిఖరా న్ని 2020 మార్చి 13న అధిరోహించాడు. ‘సే నో టు డ్రగ్స్‌' కాన్సెప్ట్‌తో మార్చి1న మనస్లూపైకి యా త్రను ప్రారంభించాడు. 13న శిఖరాన్ని అధిరోహించి జాతీయ పతాకం, తెలంగాణ స్టేట్‌ ప్రొహిబిషన్‌ ఎక్సైజ్‌ ఫ్లెక్సీని పర్వతంపై ప్రదర్శించాడు. 

దాతలు, సహోద్యోగుల ప్రోత్సాహంతో..

పర్వతారోహణలో తర్ఫీదు పొందేందుకు విరివిగా ఖర్చు చేయాల్సి వస్తున్నది. నా సొంత డబ్బులతోనే శిక్షణ తీసుకోవడం ఆర్థికంగా ఇబ్బంది కలిగిస్తున్నది. ఇప్పటికే పలు సందర్భాల్లో దాతలు, ఉన్నతాధికారులు ఆదుకున్నారు. ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ తెలంగాణ రాష్ట్ర ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ నాయకులు రూ.2.50 లక్షలు విరాళంగా అందించారు. ఎవరెస్ట్‌ శిఖరం ఎక్కాలంటే సుమారు రూ. 30 లక్షల నుంచి రూ.35 లక్షల దాకా ఖర్చయ్యే అవకాశం ఉన్నది. ప్రభుత్వం, దాతలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సహకరిస్తే ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహిస్తా. 

   -లెంకల మహిపాల్‌రెడ్డి


logo