ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Jagityal - May 27, 2020 , 02:43:17

నియంత్రిత సాగుతో రైతుకు మేలు

నియంత్రిత సాగుతో రైతుకు మేలు

ఆ దిశగా రైతులను ప్రోత్సహించాలి

మంత్రి కొప్పుల ఈశ్వర్‌

ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం

ధర్మపురి/గొల్లపల్లి: సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుట్టిన నియంత్రిత పంటల సాగు విధానంతో రైతులకు ఎంతో మేలు కలుగుతుందని, ఆ దిశగా గ్రామ స్థాయిలో ప్రజాప్రతినిధులు వారిని ప్రోత్సహించాలని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పిలుపునిచ్చారు. జగిత్యాలలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో మంగళవారం జిల్లా స్థాయి అధికారులు, ధర్మపురి నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. గొల్లపల్లి మండలం ఇబ్రహీంనగర్‌లో కలెక్టర్‌ గుగులోతు రవి, జడ్పీ అధ్యక్షురాలు దావ వసంతతో కలిసి అవగాహన సదస్సులో పాల్గొన్నారు. అనంతరం లక్ష్మీపూర్‌ డీ 83ఏ, గొల్లపల్లిలోని డీ 64కాలువ మరమ్మతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల మంత్రి మాట్లాడుతూ.. రైతాంగానికి లాభం చేకూర్చాలన్న లక్ష్యంతో నియంత్రిత పద్ధతిలో ఈ వానకాలం సీజన్‌ నుంచి డిమాండ్‌ ఉన్న పంటలు మాత్రమే సాగు చేయాలని సీఎం కేసీఆర్‌ సూచించారని, ఆ మేరకు రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులదేనని చెప్పారు. గ్రామాల్లో ఏర్పాటు చేసే క్లస్టర్‌ స్థాయి సమావేశాలకు అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు కచ్చితంగా హాజరై అన్నదాతలకు వివరించాలన్నారు. రైతులందరూ ఒకే రకంగా వరి పండిస్తూ పోతుంటే తినేవారు, కొనేవారు ఉండరన్నారు. పంటకు మంచి ధర రావాలనే ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేస్తున్నదన్నారు. జిల్లాలో ప్రతి యాసంగిలో 40లక్షల ఎకరాల్లో వేసే వరిలో సగం దొడ్డు, మరో సగం సన్నరకం పంటలు ఉండాలన్నారు.  మిగతా రైతులు పత్తి, కంది, సోయను పండించాలన్నారు. ఆనాటి తెలంగాణ ఉద్యమం నుంచి సీఎం కేసీఆర్‌ ఏది చెబితే అది చేశారన్నారు. ముఖ్యమంత్రి చెప్పినట్లు పంటల మార్పిడి ద్వారా రానున్న జనవరిలో సన్నం వడ్లు మార్కెట్‌లో అమ్మిన రోజు రైతుల కండ్లల్లో ఆనందం చూస్తామని పేర్కొన్నారు. నియోజకవర్గంలో అర్హులైన వారికి 1500 ఇండ్లు మంజూరయ్యాయని, ఇందులో ఎవరైనా సొంతంగా నిర్మించుకోవడానికి ముందుకు వస్తే రూ. 5లక్షలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గొల్లపల్లి మండలంలో సాగు చేస్తున్న వరిలో 25శాతం సన్న రకాలని, అదనంగా మరో 25శాతం సన్నరకాలను పండించాలని కోరారు. కంది, పెసర, పంటల సాగు విస్తీర్ణం పెంచాలన్నారు. వానకాలంలో పసుపులో అంతర పంటగా కాకుండా మక్క విడిగా సాగు చేయవద్దన్నారు. ఆయిల్‌పామ్‌ సాగుకు గొల్లపల్లి ప్రాంతం అనుకూలంగా ఉన్నందున ఆ తోటలను పెంచాలని సూచించారు. ప్రభుత్వం సూచించిన పంటలను సాగు చేస్తూ లాభాల పంట పండించాలని విజ్ఞప్తి చేశారు. ఆయకట్టు చివరి భూములకు నీరందించాలనే లక్ష్యంతో చేపట్టిన ఎస్సారెస్పీ కాలువల పునరుద్ధరణ పనులు చురుగ్గా సాగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. ఈ నెల 18న ప్రారంభమైన కాలువల పూడికతీత 15రోజుల్లో పూర్తి చేయాలనుకున్నామని, ఆ సమయంలోగా పూర్తి కాకపోతే కొన్నిరోజులు పొడిగిస్తామన్నారు. అనంతరం గొల్లపల్లి శ్యాంసుందర్‌రెడ్డి ఫంక్షన్‌హాల్‌లో ఆశ్రయ ఆకృతి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో 80మంది దివ్యాంగులకు 10కిలోల బియ్యం, నిత్యావసర సరుకులను అందించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత, జిల్లా కలెక్టర్‌ గుగులోతు రవి, అదనపు కలెక్టర్‌ రాజేశం, ఆర్డీవో నరేందర్‌, ఎఫ్‌టీసీ ఏడీఏ ప్రియదర్శిని, డీఏవో కల్పన, ఏడీఏ రాంచందర్‌, జిల్లా ఉద్యానవన అధికారి ప్రతాప్‌ సింగ్‌, తహసీల్దార్‌ నవీన్‌ కుమార్‌, ఏవో కరుణ, ఎంపీపీ నక్క శంకరయ్య, జడ్పీటీసీ జలంధర్‌, వైస్‌ ఎంపీపీ ఆవుల సత్తయ్య, సర్పంచులు గంగారెడ్డి, మల్లవ్వ, నిశాంత్‌ రెడ్డి, విండో అధ్యక్షులు రాజసుమన్‌ రావు, గందె వెంకట మాధవ రావు, రైతు బంధు సమితి అధ్యక్షులు జలపతి రెడ్డి, కిష్టారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు బొల్లం రమేశ్‌, యూత్‌ అధ్యక్షుడు గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo