శనివారం 11 జూలై 2020
Jagityal - May 25, 2020 , 01:46:38

రైతుల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

రైతుల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

రుణమాఫీతో భరోసా

నియంత్రిత సాగు విధానంలో పంటలు వేయాలి

రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్‌

491 మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ

జమ్మికుంట రూరల్‌/హుజూరాబాద్‌ రూరల్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నదని, విపత్కర పరిస్థితుల్లోనూ ఇచ్చిన మాటకు కట్టుబడి రూ.25 వేల లోపు క్రాప్‌ లోన్‌ తీసుకున్న రైతులకు రుణమాఫీ చేసి భరోసా కల్పించిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. ఇల్లందకుంట, జమ్మికుంట పీఏసీఎస్‌ పరిధిలోని 54మంది రైతులకు, హుజూరాబాద్‌ మండలానికి చెందిన 437 మంది రైతులకు రుణమాఫీ వర్తించగా, ఆదివారం జమ్మికుంట పట్టణంలోని కేడీసీసీ బ్యాంక్‌ ఆవరణలో, హుజూరాబాద్‌ సమీపంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతు పక్షపాతి అని, ప్రస్తుత పరిస్థితుల్లోనూ రుణమాఫీ చేయడమే అందుకు నిదర్శనమని కొనియాడారు. ఈ సంవత్సరం ధాన్యం దిగుబడి భారీగా పెరిగిందని, అయినప్పటికీ రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వమే పూర్తిగా కొనుగోలు చేస్తున్నదని గుర్తుచేశారు. అలాగే ప్రభుత్వం ప్రకటించిన నియంత్రిత సాగు విధానంలో రైతులు పంటలు వేసి ఆర్థికాభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం పెద్దంపల్లి గ్రామంలోని స్నేహా ఫీడ్స్‌లోని మక్కల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి, రైతులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ విజయ, డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ పింగిలి రమేశ్‌, మున్సిపాలిటీల అధ్యక్షులు రాజేశ్వరరావు, రాధిక, జడ్పీటీసీ పడిదం బక్కారెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ శ్రీనివాస్‌ సింగిల్‌ విండో చైర్మన్లు కొండాల్‌రెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి, పొనగంటి సంపత్‌, సీఈవో ఆదిత్య, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌ యాదవ్‌, నాయకులు కిషన్‌రెడ్డి, అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.logo