మంగళవారం 14 జూలై 2020
Jagityal - May 25, 2020 , 01:46:40

పరిశుభ్రతతోనే వ్యాధులు దూరం

పరిశుభ్రతతోనే వ్యాధులు దూరం

స్వచ్ఛత కోసం సమయం కేటాయిద్దాం

ప్రజాప్రతినిధుల పిలుపు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ‘ప్రతి ఆదివారం పది నిమిషాలు’ కార్యక్రమానికి స్పందన

కార్పొరేషన్‌/మెట్‌పల్లి/ మెట్‌పల్లి టౌన్‌/ జగిత్యాల/ గోదావరిఖని/ పెద్దపల్లి రూరల్‌, రాజన్న సిరిసిల్ల, నమస్తేతెలంగాణ  : రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ పిలుపు మేరకు ‘ఆదివారం 10 గంటలకు 10 నిమిషాలు’ కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి జిల్లా పరిధిలో ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా కదిలారు. తమ ఇంటి ఆవరణలో నిల్వ ఉన్న నీటిని పారబోసి, పరిసరాలను శుభ్రం చేశారు.  కరీంనగర్‌ 59వ డివిజన్‌లో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటుగా, ఇల్లు, తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడు సీజనల్‌, అంటువ్యాధులను అరికట్టవచ్చన్నారు. దీనికోసం ప్రతి ఆదివారం పది నిమిషాల సమయం కేటాయించాలని పిలుపునిచ్చారు. అలాగే కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌ రావు  మెట్‌పల్లిలోని తన ఇల్లు, ఇంటి పరిసరాలను శుభ్రం చేశారు. ఇంటి ఆవరణలోని మొక్కల ఆకులను కత్తిరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతతోనే వ్యాధులు దరి చేరవన్నారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ గోదావరిఖనిలోని తన నివాసంలోని కూలర్‌లో నిల్వ ఉన్న నీటిని తొలగించారు. ఇక మీదట భవిష్యత్‌లో కరోనా లాంటి విపత్కర పరిస్థితులు రావద్దంటే.. ప్రతి ఒక్కరూ మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు పరిశుభ్రత పాటించాలని సూచించారు. జగిత్యాల జడ్పీ క్యాంపు కార్యాలయ పరిసరాలను జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత దంపతులు శుభ్రం చేశారు. పూలకుండీలు, కూలర్లలోని నీటిని తొలగించారు. పెద్దపల్లి క్యాంపు కార్యాలయ ఆవరణలో జిల్లా కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ సిబ్బందితో కలిసి పరిసరాలను శుభ్రం చేశారు. కూలర్‌లో ఉన్న నిలువ నీటిని తొలగించారు.  సిరిసిల్ల కలెక్టరేట్‌లో కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ తమ నివాసంలో పూల కుండీల్లో నిల్వ నీటిని పారబోశారు. పరిసరాలను శుభ్రం చేశారు. 


logo