మంగళవారం 26 మే 2020
Jagityal - May 22, 2020 , 00:46:19

ఆలయాల్లో ఆన్‌లైన్‌ మొక్కులు

ఆలయాల్లో ఆన్‌లైన్‌ మొక్కులు

నెల నుంచి భక్తులకు అందుబాటులోకి సేవలు

రాజన్న, అంజన్న, లక్ష్మీనరసింహుడి క్షేత్రాల్లో పూజలు

వేములవాడ కల్చరల్‌/ధర్మపురి/మల్యాల : లాక్‌డౌన్‌ కారణంగా ప్రముఖ ఆలయాల్లో ఆన్‌లైన్‌ పూజలు చేస్తున్నారు. దేవాదాయశాఖ అధికారుల ఆదేశాలతో ఏప్రిల్‌ 19 నుంచి ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి భక్తులు ఈ సేవలను వినియోగించుకుంటున్నారు. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుంటే వారి గోత్రనామాల పేరిట అర్చకులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అభిషేకాలు, అన్నపూజలు, కుంకుమ పూజలు, నిత్యకల్యాణం, సత్యనారాయణవ్రతం, లింగార్చన, అష్టోత్తర శతనామావళి, తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వేములవాడలో ఏప్రిల్‌ 11 నుంచి ఆన్‌లైన్‌ పూజల విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇప్పటిరకు ఆన్‌లైన్‌లో దాదాపు 223 మంది భక్తులు వివిధ రకాల పూజలను బుక్‌ చేసుకోగా, ఆలయానికి సుమారు లక్షా 10 వేల ఆదాయం వచ్చినట్లు ఆలయ పర్యవేక్షకుడు ప్రతాప నవీన్‌ తెలిపారు. ఇక ధర్మపురిలో లక్ష్మీనరసింహస్వామివారికి ఆన్‌లైన్‌ ద్వారా 46 మంది భక్తులు పూజలు చేయించుకోగా 24,400 సమకూరిందని, ఆన్‌లైన్‌ ద్వారా బ్యాంకు ఖాతాలో 111 మంది భక్తులు 1,69,145 వేసినట్లు ఈవో శ్రీనివాస్‌ వెల్లడించారు. మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఏప్రిల్‌ 22 నుంచి ఆన్‌లైన్‌ విధానం అందుబాటులోకి రాగా ఇప్పటి వరకు 73 మంది అభిషేకాల కోసం బుక్‌ చేసుకున్నారు. 67మందివి పూజలు కాగా మొత్తంగా 40,200 ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. 



logo