మంగళవారం 26 మే 2020
Jagityal - May 22, 2020 , 00:46:21

సుందరంగా తీర్చిదిద్దుతాం

సుందరంగా తీర్చిదిద్దుతాం

అన్ని హంగులతో నగరాన్ని అభివృద్ధి చేస్తాం

మంత్రి గంగుల కమలాకర్‌

నగరంలో పలు అభివృద్ధి పనులకు భూమిపూజ

కార్పొరేషన్‌ : కరీంనగర్‌ను అన్ని హంగులతో సుందరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ స్పష్టం చేశారు. గురువారం ఉదయం నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయంలో కరోనా కట్టడికి చేపట్టిన కార్యక్రమాలపై రూపొందించిన వీడియోను, రోజూ మంచినీటి సరఫరాకు సంబంధించిన పైలాన్‌ లోగోను మేయర్‌ చాంబర్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత రెండు నెలలుగా నగరపాలక సంస్థ అందిస్తున్న సేవలు చరిత్రలో మరచిపోలేనివన్నారు. ఒకేసారి 8 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో తామంతా నగరంలోనే ఉండి ప్రజలు భయాందోళనకు గురికాకుండా పని చేశామని గుర్తుచేశారు. ఈ సేవలు భవిష్యత్‌ తరాలకు తెలిసేలా వీడియో రూపొందించినట్లు చెప్పారు. ప్రస్తుతం కూడా కరోనా విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా ప్రతి రోజూ మంచినీటి సరఫరా, ఐటీ టవర్‌ను ప్రారంభిస్తామన్నారు. నగరంలోకి వచ్చే ముఖద్వారాలను చరిత్ర ఉట్టిపడేలా తీర్చిదిద్దుతామని, దీనికి సంబంధించి ఇప్పటికే ప్రణాళికలు సిద్ధమైనట్లు వెల్లడించారు. 2014 నుంచి నగర రూపురేఖలు మారేలా పనులు జరుగుతున్నాయని, స్మార్ట్‌సిటీ పనులు కూడా వేగంగా సాగుతున్నాయని, ప్రజలకు మెరుగైన సేవలందించాలన్న భయంతో పని చేస్తున్నామని తెలిపారు. కరోనా సమయంలో కొందరు మాత్రం హైదరాబాద్‌ పారిపోయారని ఎద్దేవా చేశారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా తాము ప్రజలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

నాణ్యమైన విద్యనందించేందుకు కృషి

ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి గంగుల పేర్కొన్నారు. విద్య, వైద్యానికి సీఎం కేసీఆర్‌ పెద్దపీట వేస్తున్నారని, ఇందులో భాగంగా శిథిలావస్థలో ఉన్న పురాతన ప్రభుత్వ కళాశాలల్లో అదనపు గదుల నిర్మాణానికి నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. కళాశాల భవన నిర్మాణానికి రూ.6 కోట్లు వ్యయం అవుతుందని, మొదటి విడుతలో డీఎంఎఫ్‌టీ నుంచి సైన్స్‌వింగ్‌కు రూ.1.22 కోట్లు, బాలికల కళాశాలకు రూ.1.22 కోట్లు మంజూరు చేశామన్నారు. కార్పొరేట్‌ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ కళాశాలలను తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమాల్లో జడ్పీ చైర్‌పర్సన్‌ విజయ, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మేయర్‌ వై సునీల్‌రావు, డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపారాణి హరిశంకర్‌, కమిషనర్‌ క్రాంతి, కార్పొరేటర్లు బుచ్చిరెడ్డి, శ్రీనివాస్‌, గందె మాధవి, ఎడ్ల సరిత, తోట రాము, గంట కళ్యాణి శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.


logo