శనివారం 19 సెప్టెంబర్ 2020
Jagityal - May 06, 2020 , 01:54:42

క్షేమంగా ఇండ్లకు..

క్షేమంగా ఇండ్లకు..

  • 51రోజుల తర్వాత చేరుకున్న కాశీ యాత్రికులు
  • నంద్యాల నుంచి తిరిగొచ్చిన జిల్లా విద్యార్థులు
  • మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత చొరవతో రాక
  • స్వాగతం పలికిన ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌, టీఆర్‌ఎస్‌ నేతలు

లాక్‌డౌన్‌ కారణంగా ఉత్తరప్రదేశ్‌లోని కాశీలో చిక్కుకున్న జిల్లాయాత్రికులు, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా నంద్యాలలో ఉండిపోయిన విద్యార్థులు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత చొరవతో మంగళవారం క్షేమంగా ఇండ్లకు చేరుకున్నారు. కోరుట్లలో టీఆర్‌ఎస్‌ నాయకులు, జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ వారికి స్వాగతం పలికి శీతల పానీయాలు, అల్పాహారం అందించి అలసట తీర్చారు. తమను స్వగ్రామాలకు చేర్చిన కవితకు సంబంధిత వ్యక్తులు కృతజ్ఞతలు తెలిపారు. 

జగిత్యాల, నమస్తే తెలంగాణ/జగిత్యాల రూరల్‌/ కోరుట్లటౌన్‌/ఇబ్రహీంపట్నం : జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన 45 మంది, కోరుట్ల పట్టణానికి చెందిన 13 మంది సుమారు రెండు నెలల క్రితం తీర్థయాత్రలకు వెళ్లారు. యూపీలోని కాశీ పుణ్యక్షేత్ర దర్శనానికి వెళ్లిన సమయంలో లాక్‌డౌన్‌ అమలులోకి రావడంతో అక్కడే చిక్కుకుపోయారు. ఈ విషయాన్ని మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత దృష్టికి తీసుకెళ్లగా, వారిని స్వస్థలాలకు రప్పించేలా ఆమె చర్యలు తీసుకున్నారు. కాశీ నుంచి రెండు బస్సుల్లో వచ్చిన 58 మందికి వైద్యులు నరేందర్‌, వనజ నేతృత్వంలో జిల్లా సరిహద్దు బండలింగాపూర్‌ పోలీస్‌ చెక్‌ పోస్ట్‌ వద్ద వైద్య సిబ్బంది పరీక్షలు చేశారు. బస్సుల్లో 17 మంది పురుషులు, 41 మంది మహిళలు ఉన్నట్లు ఎస్‌ఐ అశోక్‌ తెలిపారు. అందరినీ 28 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. అనంతరం కోరుట్లకు చెందిన వారు పట్టణంలో దిగగా పీవీ నరసింహారావు వెటర్నరీ కళాశాల సమీపంలో టీఆర్‌ఎస్‌ నాయకులు స్వాగతం పలికారు. ఇక్కడ యాత్రికులు మాట్లాడుతూ తాము తిరిగి ఇంటి ముఖం చూస్తామనుకోలేదని, సీఎం కేసీఆర్‌, మాజీ ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు విద్యాసాగర్‌రావు, సంజయ్‌కుమార్‌, కోరుట్ల ఎమ్మెల్యే తనయుడు సంజయ్‌కుమార్‌, కౌన్సిలర్‌ గుంటుక శ్రీనివాస్‌, మాజీ కౌన్సిలర్‌ పుప్పాల ప్రభాకర్‌ చొరవతో ఇంటికి చేరుకున్నామని చెప్పారు. వారిని కోరుట్ల మున్సిపల్‌ ఉపాధ్యక్షుడు గడ్డమీది పవన్‌, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు అన్నం అనిల్‌, ప్రధాన కార్యదర్శి గుడ్ల మనోహర్‌ పరామర్శించి మజ్జిగ, పండ్లు, మంచినీరు అందజేశారు. అనంతరం జగిత్యాలకు చేరుకున్నవారికి హస్నాబాద్‌ వద్ద ఎమ్మెల్యే సంజయ్‌ స్వాగతం పలికారు. స్క్రీనింగ్‌ టెస్ట్‌ల అనంతరం శీతలపానీయాలు, మజ్జిగ అందించారు. ఇక బ్యాంకు పరీక్షల కోచింగ్‌ కోసం నంద్యాలకు వెళ్లి, అక్కడే ఉండిపోయిన 21 మంది విద్యార్థులు సైతం కల్వకుంట్ల కవిత కృషితో జగిత్యాలకు చేరుకోగా వారికీ ఎమ్మెల్యే సంజయ్‌ స్వాగతం పలికారు. స్క్రీనింగ్‌ పరీక్షలు చేయించి తన సొంత వాహనాల్లో స్వగ్రామాలకు పంపించారు. విద్యార్థులు మాట్లాడుతూ కవితక్కకు జీవితాంతం రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపారు. యాత్రికులు, విద్యార్థుల్లో జిల్లాకు చెందిన వారితో పాటు రాజన్నసిరిసిల్ల, మంచిర్యాల, కరీంనగర్‌ జిల్లాలకు చెందిన వారు సైతం ఉన్నారు. 


logo