ఆదివారం 29 మార్చి 2020
Jagityal - Mar 23, 2020 , 01:50:57

జిల్లాలో విజయవంతమైన కర్ఫ్యూ

జిల్లాలో విజయవంతమైన కర్ఫ్యూ

  • ఉదయం నుంచే నిర్మానుష్యంగా పట్టణాలు 
  • పల్లెల్లోనూ అదే వాతావరణం
  • పోలీసులు తప్ప కనిపించని జనం
  • ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌  పిలుపునకు విశేష స్పందన
  • స్వచ్ఛందంగా పాల్గొన్న జిల్లాప్రజలు
  • వైద్య ఆరోగ్య సిబ్బంది సేవకులకు సంఘీభావంగా చప్పట్లు
  • స్వీయ నిర్బంధంలో ప్రజాప్రతినిధులు, ప్రముఖులు
  • ఇండ్లలోనే గడిపిన మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్యేలు విద్యాసాగర్‌రావు, డాక్టర్‌ సంజయ్‌
  • పర్యవేక్షించిన కలెక్టర్‌, ఎస్పీ

వేలాది వాహనాలతో వేలాది వాహనాలతో నిత్యం రద్దీగా ఉండే పట్టణాల ప్రధానదారులు ఆదివారం బోసిబోయాయి.. ముఖ్య ప్రాంతాలన్నీ వెలవెలబోయాయి.. దవాఖానలు, మెడికల్‌షాపులు, మార్కెట్లు, వ్యాపారసముదాయాలన్నీ మూతపడ్డాయి.. మండల కేంద్రాలు, పల్లెల్లోనూ అవే దృశ్యాలు కనిపించాయి. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కట్టడికి ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపునివ్వగా, జిల్లా ప్రజానీకం స్వచ్ఛందంగా ఇళ్లకే పరిమితమైంది. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా నిర్మానుష్య వాతావరణం నెలకొనగా, జనతా కర్ఫ్యూ విజయవంతమైంది. వైద్య ఆరోగ్య సిబ్బందికి సంఘీభావంగా సాయంత్రం వేళ ప్రజలు ఇంటి ముంగిళ్లలో నిలబడి చప్పట్లతో కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ తమ ఇళ్లలోనే కుటుంబసభ్యులతో గడిపారు. కలెక్టర్‌ రవి, ఎస్పీ సింధూశర్మ, ఏఎస్పీ దక్షిణామూర్తి పలుచోట్ల పర్యటించి కర్ఫ్యూను పర్యవేక్షించారు.

జగిత్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ :  కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు ప్రధాని నరేంద్రమోడీ, ము ఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా ప్రజ లు స్వచ్ఛందంగా స్పందించారు. జనతా కర్ఫ్యూలో పాల్గొని విజయవంతం చేశారు. సోమవారం ఉద యం నుంచే జిల్లాలో ఎక్కడ చూసినా రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. వ్యాపార, వాణిజ్య వర్గాలు స్వచ్ఛందంగా దుకాణ సముదాయాలను మూసివేశా యి. నిత్యం రద్దీగా ఉండే ప్రముఖ వ్యాపార కూడలి టవర్‌సర్కిల్‌ బోసిబోయింది. బస్సులు డిపోలకే పరిమితం కావడంతో ప్రయాణికులు లేక ప్రధాన బస్టేష న్‌ వెలవెలబోయింది.  అక్కడక్కడా విధులు నిర్వహించిన పోలీసులు మినహా సాధారణ జనం కనిపించ లే దు. కలెక్టర్‌ రవి, ఎస్పీ సింధూశర్మ, ఏఎస్పీ దక్షిణామూర్తి పలు ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. అధికారులు, పోలీసులకు పలు సూచనలు చేశారు. అడపాదడపా వచ్చిన వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు.           

మిగతా చోట్లా స్వచ్ఛంద బంద్‌..

మండల కేంద్రాలు, గ్రామాల్లోనూ నిర్మానుష్య వా తావరణమే కనిపించింది. ఎక్కడా చూసినా జనసంచారం కనిపించలేదు. కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి, రాయికల్‌, జగిత్యాల పట్టణాలు, మండలాల్లో వ్యాపా ర సంస్థలు పూర్తిగా మూతబడ్డాయి. రహదారులు నిర్మానుష్యంగా మారాయి. 

 అంత్యక్రియలు నిలిపివేత 

కర్ఫ్యూకు స్వచ్ఛందంగా మద్దతు పలికిన ప్రజలు చివరకు అంత్యక్రియలను సైతం వాయిదా వేశారు. మెట్‌పల్లి మండలం జగ్గసాగర్‌కు చెందిన చిన్నరా జం అనే వృద్ధుడు అనారోగ్యంతో ఆదివారం మృతిచెందాడు. ప్రజలంతా స్వచ్ఛందంగా మహమ్మారిపై పోరాటం చేస్తున్న సమయంలో అంత్యక్రియలు చేయవద్దని అతడి కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో చినరాజం అంత్యక్రియలను సోమవారం నిర్వహించనున్నారు. 

ఇండ్లలోనే ఉండి మద్దతు పలికిన ప్రముఖులు 

జనతా కర్ఫ్యూ సందర్భంగా ప్రజలతో పాటు, ప్ర జాప్రతినిధులు, అధికారులు సైతం ఇండ్లలోనే గడిపి సాయంత్రం ఐదు గంటల సమయంలో వైద్యులు, పోలీసులు, మీడియా మిత్రులకు అభినందనలు తెలియజేశారు. మంత్రి ఈశ్వర్‌, జగిత్యాల, కోరుట్ల ఎమ్మెల్యేలు డాక్టర్‌ సంజయ్‌కుమార్‌, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు ఇండ్లలోనే కుటుంబ సభ్యులతో గడిపారు. జడ్పీ అధ్యక్షురాలు వసంత, కలెక్టర్‌ జీ.రవి, ఎస్పీ సిం ధూ శర్మ ఒకవైపు జనతా కర్ఫ్యూను పర్యవేక్షిస్తూనే మరోవైపు ఇంట్లోనే ఎక్కువ సమయం గడిపారు. 

ఇదే స్ఫూర్తిని కొనసాగించాలి : మంత్రి కొప్పుల 

జనతా కర్ఫ్యూ విజయవంతమైన నేపథ్యంలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతూ, భయంకరమై న కరోనా వైరస్‌ను ధైర్యంగా ఎదుర్కొనే విషయంలో ప్రతి ఒక్కరూ జనతా కర్ఫ్యూ స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. ప్రధాని, ముఖ్యమంత్రి పిలుపు మేరకు స్వీయ నిర్బంధంలోకి స్వచ్ఛందంగా వెళ్లిన జిల్లా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. 


logo