మంగళవారం 31 మార్చి 2020
Jagityal - Mar 10, 2020 , 02:05:41

సహకార సంఘాల అభివృద్ధికి కృషి

సహకార సంఘాల అభివృద్ధికి కృషి

సారంగాపూర్‌: సహకార సంఘాల అభివృద్ధికి పాలకవర్గ సభ్యులు, రైతులు  కృషి చేయాలని ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ పిలుపు నిచ్చారు. బీర్‌పూర్‌ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కార్యాలయ ఆవరణలో సోమవారం పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేతో పాటు జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత, డీసీఎంఎస్‌ చైర్మన్‌ ఎల్లాల శ్రీకాంత్‌ రెడ్డి హాజరయ్యారు. కాగా సహకార సంఘం చైర్మన్‌ ముప్పాల రాంచందర్‌ రావు, వైస్‌ చైర్మన్‌ ఊరడి కొమురెల్లితో పాటు సభ్యులు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌  పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సహకార సంఘంలో రుణాలు తీసుకున్న రైతులు సకాలంలో చెల్లించడంతో పాటు పెట్టుబడులు పెట్టి సంఘం అభివృద్ధికి కృషి చేయాలన్నారు. బీర్‌పూర్‌ సహకార సంఘం ఉమ్మడి జిల్లాలోనే లాభాల బాటలో నడుస్తున్నదని అన్నారు. 5వసారి చైర్మన్‌గా ఎన్నికైన ముప్పాల రాంచందర్‌రావు జగిత్యాల నియోజకవర్గం నుంచి ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా సహకార బ్యాంక్‌ డైరెక్టర్‌గా ఎన్నికయ్యారని, దీనికి నియోజకవర్గ సింగిల్‌ విండో డైరెక్టర్లు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారని అన్నారు. సహకార సంఘం సభ్యులు సమష్టిగా పని చేస్తూ రైతులు పండించిన పంటలను మార్కెటింగ్‌ చేసేలా చూడాలన్నారు. రైతుల భాగస్వామ్యం ఉంటే ఏదైన సాధించవచ్చన్నారు. బీర్‌పూర్‌ మండలం ఏర్పాటుకు ముప్పాల రాంచందర్‌రావు పట్టుబట్టడంతో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మన్‌ రావు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత సహకారంతో సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించి మండలం ఏర్పాటు చేశారన్నారు. రోళ్లవాగు ఆధునీకరణ పనులు త్వరలోనే పూర్తవుతాయని అన్నారు. రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు. మండలంలోని తాళ్లధర్మారం సమీపంలో దళితులకు సుమారు వెయ్యి ఎకరాలు, మోతినగర్‌లో 12 వందల ఎకరాలకు పట్టాలు ఇచ్చినట్లు గుర్తు చేశారు. పట్టాభూములు అసైన్డ్‌ భూములుగా చూపిస్తుందని, సమస్యను పరిష్కరించాలని రైతులు ఎమ్మెల్యేను కోరగా సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి మండల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత మాట్లాడుతూ మండల ఏర్పాటుకు, అభివృద్ధికి ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత సహకారంతో ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు. చైర్మన్‌గా ముప్పాల రాంచందర్‌ రావు బీర్‌పూర్‌ సొసైటీని జిల్లాలో నంబర్‌ వన్‌గా తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు. పసుపుబోర్డు ఏర్పాటు చేయిస్తానని చెప్పి గెలిచిన ఎంపీ అర్వింద్‌ రైతులను మోసం చేశారని అన్నారు. మాజీ ఎంపీ కవిత సహకారంతోనే పసుపు బోర్డు ఏర్పాటు అవుతుందని అన్నారు. డీసీఎంఎస్‌ చైర్మన్‌ ఎల్లాల శ్రీకాంత్‌ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ముందుచూపుతో తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు మంచి ఫలితాలు ఇస్తున్నాయని అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఎడారిగా ఉన్న ప్రాంతాలు ప్రస్తుతం పచ్చని పంటలతో కళకళలాడుతున్నాయని అన్నారు. ధర్మపురి-బీర్‌పూర్‌ ప్రాంతాలకు ఉపయోగపడే రోళ్లవాగు ప్రాజెక్ట్‌ ఆధునీకరణకు  అడుగగానే ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌, మాజీ ఎంపీ కవిత సహకారంతో సీఎం కేసీఆర్‌ రూ. 70 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు.  అందరి సహకారంతో జిల్లాలోని సొసైటీల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సింగిల్‌ విండో చైర్మన్‌ ముప్పాల రాంచందర్‌ రావు మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన రైతులకు, ఉమ్మడి జిల్లా సహకార బ్యాంక్‌ డైరెక్టర్‌గా ఎన్నికకు సహకరించిన ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌, సింగిల్‌ విండో చైర్మన్లకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచ్‌ గర్షకుర్తి శిల్ప, సారంగాపూర్‌, బుగ్గారం జడ్పీ సభ్యులు మేడిపల్లి మనోహర్‌ రెడ్డి, బాదినేని రాజేందర్‌, రాయికల్‌ మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ గండ్ర రమాదేవి, రైతు బంధు సమితి జిల్లా సభ్యులు కొల్ముల రమణ, గుర్రాల రాజేందర్‌ రెడ్డి, మండల కన్వీనర్‌ రాజేశం, సారంగాపూర్‌, కోనాపూర్‌, జగిత్యాల, జైన, రాయికల్‌, అల్లిపూర్‌, ఉప్పుమడుగు, కల్లెడ సహకార సంఘాల అధ్యక్షులు ఏలేటి నర్సింహ రెడ్డి, గురునాథం మల్లారెడ్డి, పత్తిరెడ్డి మైపాల్‌ రెడ్డి, సౌల్ల నరేశ్‌, మల్లారెడ్డి, రాజలింగం, రాజిరెడ్డి, సందిప్‌ రావు, సీఈఓ సత్యనారాయణ, డీజీఎం రవీందర్‌, ఏడీఏ రాంబాబు, డీఆర్‌డీఓ లక్ష్మీనారాయణ, వ్యవసాయ కళాశాల లెక్చరర్‌ రాజయ్య, సీఈఓ తిరుపతి, సారంగాపూర్‌, బీర్‌పూర్‌, జగిత్యాల మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు, అధికారులు పాల్గొన్నారు.    


logo
>>>>>>