మంగళవారం 31 మార్చి 2020
Jagityal - Mar 08, 2020 , 02:05:45

కల్యాణ వైభోగం

కల్యాణ వైభోగం

ధర్మపురి,నమస్తేతెలంగాణ : బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధర్మపురి దివ్యక్షేత్రంలో లక్ష్మీనరసింహుడి కల్యాణ వేడుకలు శనివారం అంగరంగ వైభవంగా జరిగాయి. వేద మంత్రోచ్ఛాణ లు, భక్తుల గోవిందనామస్మరణల మధ్య శాస్ర్తోక్తంగా సాగా యి. పాంచరాత్రాగమ శాస్త్ర పద్ధతిలో శాస్ర్తోక్తంగా ఆలయంలోని శేషప్ప కళావేదికపై కల్యాణోత్సవాన్ని ఆగమశాస్త్ర ప్రకా రం కనులపండువలా నిర్వహించారు. క్షేత్రానికి భారీగా తరలివచ్చిన భక్తజనులు స్వామివారిని దర్శించుకొని తరించారు.

గోధూళి సుముహూర్తాన..

కల్యాణోత్సవాన్ని పురస్కరించుకొని లక్ష్మీనరసింహ(యోగ, ఉగ్ర), వేంకటేశ్వరస్వామివారల ఉత్సవమూర్తులను అర్చకులు పట్టు వస్ర్తాలు, బంగారు, ముత్యాల ఆభరణాలు, వివిధ రకాల పూలతో దివ్యమనోహరంగా అలంకరించిన కల్యాణ వేదికపై అధిష్టింపజేశారు. గోధూళి సముహూర్తాన స్వామి, అమ్మవార్లకు పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలను కలెక్టర్‌ రవి అర్చక, రుత్విక బృందం సమక్షంలో అందించారు. అనంతరం సంప్రదాయరీతిలో విశ్వక్సేన ఆరాధనలతో కల్యాణ తంతును ప్రారంభించిన అర్చకులు, స్వామికి రక్షాబంధనం, యజ్ఙోపవితధారణ చేశారు. యాజ్ఙిక స్వామి మాంగల్య పూజలను స్త్రీ సూక్త పఠనంతో చేశారు. అనంతరం వేదమంత్ర పఠనాలు, ఆస్థాన విద్వాంసుల మంగళవాయిద్యాలు, భక్తజనుల జయజయధ్వానాలు, గోవిందనామస్మరణ నడుమ నారసింహుడు అమ్మవారి మెడలో మాంగల్యధారణ గావించాడు. యజ్ఙాచార్యులు కందాళై పురుషోత్తమాచార్య ఆధ్వర్యంలో వేద పండితులు కల్యాణ క్రతువును నిర్వహించారు. దేవస్థానం ఈవో శ్రీనివాస్‌ పర్యవేక్షణలో భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశారు. వేడుకను వీక్షించేందుకు ప్రత్యేకంగా స్క్రీన్లను కూడా పెట్టారు. 

పట్టు వస్ర్తాలు సమర్పించిన కలెక్టర్‌ ..

ప్రభుత్వం పక్షాన కలెక్టర్‌ రవి దంపతులు పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. ధర్మపురికి చేరుకున్న కలెక్టర్‌కు ఇసుక స్తంభం వద్ద దేవస్థాన సిబ్బంది ఘన స్వాగతం పలికారు. మంగళవాయిద్యాలు, మేళతాళాలతో ఆలయంలోకి తీసుకెళ్లారు. అనంతరం కలెక్టర్‌ దంపతులు స్వామివారి సన్నిధిలో పూజలు చేశారు. వేదపండితులు వారిని ఘనంగా ఆశీర్వదించారు. పూజల అనంతరం స్వామివారి ప్రసాదం, శేషవస్ర్తాలను అందజేశారు. బాచంపల్లి సంతోష్‌కుమార్‌ ప్రవచణాలు ఇచ్చారు. స్వామివారి కల్యాణోత్సవానికి రాష్ట్ర ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సతీమణి స్నేహలత పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. పట్టువస్ర్తాలతో ఆలయానికి చేరుకున్న ఆమెకు దేవస్థాన సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ధర్మపురి పురపాలక సంఘం పక్షాన కమిషనర్‌ దివ్యదర్శన్‌రావు పట్టు వస్ర్తాలను సమర్పించారు.

భక్తులకు ఇబ్బందులు కలుగవద్దు : కలెక్టర్‌ రవి 

కల్యాణోత్సవం సందర్భంగా ఏర్పాట్లను కలెక్టర్‌ రవి పరిశీలించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లలో ఎలాంటి లోపాలూ ఉండద్దనీ, భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని దేవస్థాన సిబ్బందిని ఆదేశించారు. క్యూలైన్లను దేవస్థాన పద్ధతి ప్రకారం నిర్వహించాలని పోలీసులకు సూచించారు. వాహనాల పార్కింగ్‌కు ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. వైద్యశిబిరాల్లో వైద్యులు ఉదయం నుంచి రాత్రి వరకూ అందుబాటులో ఉండాలనీ, చలివేంద్రాల్లో మినరల్‌ వాటర్‌ను అందుబాటులో ఉంచాలన్నారు. 

పకడ్బందీ ఏర్పాట్లు..

భక్తుల కోసం ఆలయం, గోదావరి నది, నంది చౌక్‌, బస్టాండ్‌ ప్రాంతాల్లో స్థానిక పీహెచ్‌సీ ఆధ్వర్యంలో వైద్యులు ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. డీఎంఅండ్‌హెచ్‌ఓ శ్రీధర్‌ వైద్యశిబిరాలను పర్యవేక్షించగా డాక్టర్‌ నరేశ్‌, సిబ్బంది భక్తులకు సేవలందించారు. ఎస్పీ సింధూశర్మ ఆదేశాల మేరకు అడిషనల్‌ ఎస్పీ దక్షిణామూర్తి సూచనల మేరకు సీఐ లక్ష్మీబాబు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 200 మంది పోలీసులతో బందోబస్తు చేపట్టారు.

భక్తులకు అన్నదానం

పాత టీటీడీ కల్యాణ మండపంలో అన్నదానం చేశారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్‌ రవి, ఆర్డీవో నరేందర్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సంగి సత్తెమ్మ, ఈవో శ్రీనివాస్‌, డీసీఎమ్మెస్‌ చైర్మన్‌ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, సీఐ లక్ష్మీబాబు ప్రారంభించారు. ఇక్కడ ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ అక్కనపల్లి సునీల్‌కుమార్‌, ఇనుగంటి వినోద్‌రావు, ఇనుగంటి వెంకటేశ్వర్‌రావు, చిలివేరి శ్యాంసుందర్‌ తదితరులు పాల్గొన్నారు.  


logo
>>>>>>