శనివారం 28 మార్చి 2020
Jagityal - Mar 08, 2020 , 02:04:03

విచ్చలవిడిగా చీటింగ్‌

విచ్చలవిడిగా చీటింగ్‌

 జగిత్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ధనార్జనే ధ్యేయంగా, ప్రజల అవసరాలే ఆసరాగా చీటీలు, వడ్డీవ్యాపారులు రెచ్చిపోతున్నారు. జిల్లాలో ఇష్టారీతిన దందాలు నడుపుతున్నారు. వైట్‌ కాలర్‌ నేరాలపై ఇటీవల జిల్లా పోలీస్‌ యంత్రాంగం దృష్టి పెట్టడం, విస్తృతంగా దాడులు చేస్తుండంతో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. విచ్చలవిడిగా పెరిగిపోయిన వడ్డీ వ్యాపారులు, ప్రైవేట్‌ చీటీల నిర్వాహకుల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు రంగంలోకి దిగడం చర్చనీయాంశమైంది. మూడు, నాలుగు రోజులు క్రితం జిల్లా కేంద్రంలో వడ్డీ వ్యాపారం, ప్రైవేట్‌ చీటీలు నడుపుతున్న ఆరుగురి నుంచి నగదు, ప్రామీసరీ నోట్లు, బాండ్‌ పేపర్లు, చీటీల నిర్వహణ పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మెట్‌పల్లి డివిజన్‌లోని మల్లాపూర్‌ మండలంలోనూ ఓ చీటీ వ్యాపారి ఇంట్లో తనిఖీలు చేపట్టి నగదు, రికార్డులను స్వాధీనపరుచుకున్నారు. కోరుట్ల పట్టణలో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న లక్కీదందా కేంద్రంపైనా దాడి చేసి, నగదు స్వాధీనం చేసుకోవడంతో పాటు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. జగిత్యాలలో అదుపులోకి తీసుకున్న చీటీ వ్యాపారులపై మనీల్యాండరింగ్‌ 1978 యాక్ట్‌ 43 కింద వచ్చే సెక్షన్లతో పాటు, 420 చీటింగ్‌ కేసులను నమోదు చేశారు. జిల్లాలో ఏండ్లుగా నడుస్తున్న అక్రమ వడ్డీ వ్యాపారం, ప్రైవేట్‌ చీటీల నిర్వహణపై పోలీసులు దృష్టి సారించడం, కేసులు నమోదు చేయడం చర్చనీయాంశమైంది. ప్రైవేట్‌ చీటీ వ్యాపారులు, వడ్డీదారులపై పోలీసులు దృష్టి సారించడంతో అనేక విషయాలు వెలుగులోకి వెస్తున్నాయి. 

వడ్డీ, ఫైనాన్స్‌ వ్యాపారం నిబంధనలు ఇవీ..

వడ్డీ వ్యాపారం, ఫైనాన్స్‌లు, ప్రైవేట్‌ చీటీలు నిర్వహించేందుకు భారత ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలు రూపొందించింది. రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిబంధనల ప్రకారం ప్రభుత్వ అనుమతులు పొంది, పారదర్శకంగా ఎవరైనా, ఏ సంస్థలైనా ఫైనాన్స్‌లను, వడ్డీ వ్యాపారాన్ని నిర్వహించుకునే అవకాశముంది.  ఫైనాన్స్‌ పేరుతో రిజిస్ట్రేషన్‌ నమోదై ఉండాలి. రిజిస్ట్రేషన్‌ అయిన ఫైనాన్స్‌ పేరిట, టాన్‌, పాన్‌ కార్డులు ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఫైనాన్స్‌ మనీ లెండింగ్‌ లైసెన్స్‌ పొంది ఉండాలి. ఫైనాన్స్‌ వ్యవహారాలన్నీ బ్యాంకు ఖాతా ద్వారా నిర్వహించాలి. ఫైనాన్స్‌కు సంబంధించి ఆదాయ, వ్యయాల వ్యవహారాల రికార్డులను ఏటా ఫైనాన్స్‌ ఆడిటింగ్‌ చేయించాలి. ఫైనాన్స్‌ కార్యాలయానికి లీజ్‌ డీడ్‌ ఉండాలి. అన్ని రకాల అనుమతులతో పాటు నిబంధనలను పాటించాలి. ప్రైవేట్‌ ఫైనాన్స్‌ కంపెనీలో సభ్యులు ఎవరు? మూలధనం ఎంత? వాటాధనం ఎంత? ఎన్ని చీటీలు నడుపుతున్నారు? ఎంత మొత్తం వసూలు చేస్తున్నారు? డివిడెంట్‌ ఎంత ఇస్తున్నారు? నివేదించాలి. చీటీల మొత్తాన్ని డిపాజిట్‌ రూపంలో పెట్టాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఐదు లక్షల చీటీ నిర్వహిస్తే, ఐదు లక్షల రూపాయల డిపాజిట్‌ను ఫైనాన్స్‌ నిర్వాహకులు బ్యాంకులో డిపాజిట్‌ చూపించాలి. ఇన్ని నిబంధనలను ప్రభుత్వం మనిలెండింగ్‌ చట్టంలో పొందుపర్చింది. ఈ నిబంధనలన్నింటినీ పాటిస్తూ ఏటా ఆదాయ, వ్యయాల లెక్కలను నివేదిస్తూ, ప్రైవేట్‌ ఫైనాన్స్‌లు చీటీల వ్యాపారం, అప్పులు ఇచ్చే వ్యాపారం నిర్వహించుకునే అవకాశముంది. 

నిబంధనలు గాలికి..

జిల్లాలో ఫైనాన్స్‌, చీటీలు, వడ్డీ వ్యాపార నిర్వహణ విషయాల్లో నిబంధనలు అమలవుతున్న దాఖలాలు దాదాపుగా లేవనే చెప్పాలి. కేవలం కొన్ని ప్రైవేట్‌ ఫైనాన్స్‌లు మాత్రమే నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తున్నాయి. ప్రభుత్వ అనుమతి లేకుండా, ఎలాంటి డిపాజిట్లు కట్టకుండా, పాన్‌ కార్డులు, టాన్‌కార్డులు లేకుండానే వేలాది మంది ఫైనాన్స్‌, చీటీ, వడ్డీ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. 20, 30, 40, 50, 100, 200 మందిని ఒక గ్రూప్‌గా మార్చి, వారితో 50వేలు, లక్ష, ఐదులక్షలు, పదిలక్షలు, ఇరవైలక్షలు, 50లక్షల చీటీలు నిర్వహించడం సర్వసాధారణంగా మారింది. జిల్లాలో చీటీలతో పాటు, అనేక ఆర్థిక పరమైన లావాదేవీలు యథేచ్ఛగా నడుస్తున్నాయి. కుల సంఘాల నుంచి మొదలు కొని గిరిగిరి చిట్టీల దాకా అనేక పద్ధతుల్లో వ్యాపారం చేస్తున్నారు.

వేల సంఖ్యలో ప్రైవేట్‌ చీటీనిర్వాహకులు

 జిల్లాలో తొలి నుంచీ ఆర్థిక పరనేరాలు అధిక సంఖ్యలోనే ఉంటున్నాయి. 25ఏళ్ల క్రితం జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాల కేంద్రాలుగా పుట్టగొడుగుల్లా వెలిసిన ఫైనాన్స్‌లు అనేక అక్రమాలకు పాల్పడి, ఉత్తర తెలంగాణ ఆర్థిక వ్యవస్థను కొన్నేళ్ల పాటు చిన్నాభిన్నం చేసిన విషయం విదితమే. ప్రైవేట్‌ ఫైనాన్స్‌ల అగడాల నేపథ్యంలో అనేక మంది దివాళా తీయడమే గాక, ప్రాణాలు వదిలిన ఘటనలు సైతం జిల్లా ప్రజలకు ఇంకా గుర్తుంది. ఫైనాన్స్‌ల ప్రస్తానం ముగిసిన తర్వాత కొద్ది సంవత్సరాల నుంచి జిల్లాలో వడ్డీ వ్యాపారులు, ప్రైవేట్‌ చీటీ నిర్వాహకులు తమ వ్యవహారాలను విస్తృతం చేశారు. జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలో ప్రైవేట్‌ చీటీలను నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలోనే 600మందికి పైగా ప్రైవేట్‌ చీటీనిర్వాహకులు వ్యాపారం చేస్తున్నారు. మూడు నాలుగు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్న ఆరుగురు చీటీ వ్యాపారుల వద్దే కోట్ల రూపాయాల లావాదేవీలు ఎలాంటి అనుమతులు లేకుండా, ష్యూరిటీలు లేకుండా దందా నడిపినట్లు పోలీసులు గుర్తించారు. ఆరుగురు వ్యాపారుల వద్దే ఇలాంటి పరిస్థితి కనిపిస్తే, మిగిలిన ఐదారువందల మంది వ్యాపారుల వద్ద ఎన్నికోట్ల లావాదేవీలు జరిగి ఉంటాయోననే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 

వడ్డీ వ్యాపారుల సంఖ్యా అధికమే

జిల్లాలో ప్రైవేట్‌ చీటీ నిర్వాహకుల స్థాయిలో కాకపోయినా వడ్డీ వ్యాపారుల సంఖ్య కూడా అధికంగానే ఉంది. ప్రజల అవసరాలను గుర్తించి, వారికి నిబంధనలకు విరుద్ధంగా వందకు రెండు రూపాయల నుంచి నాలుగు రూపాయల వడ్డీ వసూలు చేస్తూ అప్పులు ఇచ్చే వ్యాపారులు జిల్లాల్లో పదుల సంఖ్యలో ఉన్నట్లు తెలిసింది. ఆరునెలలు, ఏడాది గడువుతో రెండు నుంచి నాలుగు శాతం వడ్డీకి అప్పులు ఇస్తూ దందా కొనసాగిస్తున్నారు. 

ప్రైవేట్‌ చీటీ ఆఫీస్‌లుగా కుల సంఘాలు 

జిల్లాలోని పలు కుల సంఘాలు సైతం ప్రైవేట్‌ చీటీ ఆఫీస్‌లుగా మారిపోయాయి. కుల సభ్యుల ఔనత్యం కోసం ఏర్పడిన సంఘాలు, క్రమంగా ఆర్థిక లావాదేవీల నిర్వహణల్లో మునిగిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రతి కుల సంఘం, సంఘ సభ్యులతో కలిసి ప్రైవేట్‌ చీటీలు నడుపుతున్నది. ఒక్కో సంఘం, ప్రతి నెలా ఐదు నుండి పది గ్రూప్‌లతో చీటీలు నిర్వహిస్తుండడం సర్వసాధారణ అంశంగా మారింది. కుల సంఘాల్లో నిర్వహిస్తున్న చీటీల వ్యాపారం విషయంలో అధికారులు తలదూర్చే సాహసం చేయరన్న అభిప్రాయంతో సంఘాలు లైసెన్స్‌ లేని ఫైనాన్స్‌లుగా మారిపోయాయి. చీటీల్లో వచ్చే లాభాలను సంఘం సంక్షేమానికి అంటూ, అధిక మొత్తంలో వసూలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. నిర్ణీత సమయంలో కిస్తీలు చెల్లించని పక్షంలో అపరాధ రుసుమును సైతం వసూలు చేస్తున్నాయి. ఇదేంటని ఎవరైనా సభ్యులు ప్రశ్నిస్తే, వారిని కుల బహిష్కరణ చేసిన సందర్భాలూ ఉన్నాయి. 

భయపెడుతున్న గిరిగిరి వ్యాపారం 

ఆర్థికపరమైన అప్పులు ఇచ్చే వాటిలో అత్యంత భయకరమైందిగా గిరిగిరి వ్యాపారం పేరుపొందింది. రోజు నుంచి మొదలు కొని ఏడు, 30, 60, 90రోజుల కాలవ్యవధితో అప్పులు ఇచ్చి వడ్డీ తీసుకునే వ్యాపారాన్ని గిరిగిరి వడ్డీ వ్యాపారంగా వ్యవహరిస్తారు. గిరిగిరి అప్పు తీసుకున్న వారు తీవ్రంగా నష్టపోతున్నారు. అప్పు ఇచ్చే సమయంలోనే వడ్డీని మినహాయించుకొని డబ్బు ఇస్తుంటారు. అప్పు తీసుకున్న వ్యక్తి మొత్తం డబ్బును వడ్డీదారుకు చెల్లించాలి. ఉదాహరణకు పదివేల రూపాయలు అప్పు తీసుకుంటే, తొమ్మిది వందల వడ్డీని ముందుగానే మినహాయించుకుంటారు. డ్యాకుమెంటేషన్‌ కింద వంద రూపాయలు మొత్తంగా వెయ్యి మినహాయించుకొని 9వేలు ఇస్తారు. మూడు నెలల వ్యవధిలో అప్పు తీసుకున్న వ్యక్తి పది వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ వ్యవహారంలో అప్పు తీసుకున్న వ్యక్తి నాలుగు నుంచి నాలుగున్నర శాతం వడ్డీని చెల్లించాల్సి వస్తున్నది. ప్రభుత్వ నిబంధనలకు ఇది పూర్తి విరుద్ధమైంది. 

అప్పుతీసుకున్నవారి పాలిట భయంకరులుగా 

ఓ సామాజిక వర్గీయులు 

జిల్లాలో అన్నింటికంటే భయకరమైన వ్యాపారులుగా ఓ సామాజిక వర్గం మారిపోయింది. మూడు నుంచి ఆరు శాతం వడ్డీకి అప్పు ఇస్తున్న సదరు సామాజిక వర్గం, డబ్బు వసూలు సందర్భంలో చేస్తున్న హంగామా, బీభత్సం అంతాఇంతా అని చెప్పలేని పరిస్థితి నెలకొంది. మూడు నుంచి ఆరు నెలల వ్యవధితో అప్పులు ఇచ్చే సదరు సామాజిక వర్గం, వడ్డీ, అసలు వసూలు చేసే సమయంలో అప్పు తీసుకున్నవారి పట్ల క్రూరంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అప్పు ఇచ్చే సమయంలోనే గతంలో వడ్డీ వ్యాపారులు బంగారం, లేదా స్థిరాస్తులను తనఖా పెట్టుకోవడం జరిగేది. ఈ సామాజిక వర్గం వారు తనఖాను కాకుండా, స్థిరాస్థిని రిజిస్ట్రేషన్‌ చేసుకుంటున్నారు. నిర్ణీత సమయంలో డబ్బు వడ్డీతో సహా చెల్లించనట్లయితే, వారి ఇండ్లలోకి చొరబడడం, ఇంట్లో బీభత్సం సృష్టించడం, నోటీతో ఉచ్చరించలేని స్థాయిలో బూతులు తిట్టడం, ఇంట్లో భయానక వాతావరణాన్ని కల్పించడం లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇంత చేసీ, చివరకు రిజిస్ట్రేషన్‌ చేసుకున్న పత్రాల ఆధారంగా స్థిరాస్థిని స్వాధీనం చేసుకుంటున్నారు. 


logo