సోమవారం 30 మార్చి 2020
Jagityal - Mar 08, 2020 , 02:01:12

సరిలేరు ఆమెకెవ్వరు..

సరిలేరు ఆమెకెవ్వరు..

తల్లిగా.. తోబుట్టువుగా.. అర్ధాంగిగా కండ్ల్లు తెరిచినప్పటి నుంచి కండ్ల్లు మూసే వరకు ప్రతి మగాడి వెనుక నిలుస్తున్నది ఆమె! గృహిణిగా.. శ్రమజీవిగా.. ఉద్యోగిగా.. ప్రజాప్రతినిధిగా సకల బాధ్యతలు నిర్వర్తిస్తున్నది ఆమె! ఇంటా.. బయటా.. నింగీ నేలా.. అన్నింటా ముద్రవేస్తున్నది ఆమె! ఇప్పుడామె పురుషులకు మించి శక్తియుక్తులు చాటుతున్నది! ‘ఆమెకేం తెలుసు’ అన్న మాటల నుంచి ‘ఆమెకే అంతా తెలుసు’ అనే స్థాయికి ఎదిగింది! అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తూ, ‘సరిలేరు ఆమెకెవ్వరు’ అన్న రీతిలో ఔరా అనిపిస్తున్నది! ఆకాశంలో సగమై, అవనిలో అర్ధభాగమై, విజయపథాన నడుస్తూ.. నడిపిస్తున్నది! జయహో జనయిత్రి.. జయహో విజయనారీ.. 


రాజకీయాల్లో పాత్ర..

ప్రస్తుతం జిల్లా ముఖచిత్రంపై మహిళలు రాజకీయ ప్రతినిధులుగా, ఉన్నతాధికారులుగా తమదైన ముద్ర వేసుకుంటున్నారు. కరీంనగర్‌కు తొలి మహిళా జడ్పీ అధ్యక్షురాలిగా తుల ఉమ కాగా, కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత కనుమల్ల విజయ ఉన్నారు. జగిత్యాల, సిరిసిల్ల జడ్పీ చైర్‌ పర్సన్లు దావ వసంత, న్యాలకొండ అరుణ, మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల ఆర్గనైజర్‌గా మూల విజయారెడ్డి, పెద్దపల్లి జడ్పీ వైస్‌ చైర్మన్‌ మండిగ రేణుక, కరీంనగర్‌ డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపారాణి, హుజూరాబాద్‌, జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి, మెట్‌పల్లి, సిరిసిల్ల, వేములవాడ, పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్‌ మున్సిపల్‌ చైర్‌ పర్సన్లుగా గందె రాధిక, బోగ శ్రావణి, అన్నం లావణ్య, రాణవేని సుజాత, సంగి సత్తెమ్మ, జిందం కళ, రామతీర్థపు మాధవి, చిట్టిరెడ్డి మమతారెడ్డి, పుట్ట శైలజ, ముత్యం సునీత పాలనలో తమ ప్రత్యేకతను చాటుతున్నారు. జగిత్యాల జిల్లాలో 18 జడ్పీటీసీ స్థానాలకు 9 మంది, 18 ఎంపీపీ స్థానాలకు 9 మంది,  380 మంది సర్పంచ్‌లకు 191 మంది మహిళా సర్పంచులు ప్రస్తుతం అధికారంలో ఉన్నారు. ఎంపీటీసీ సభ్యుల్లోనూ సగం మంది మహిళలే  ఉండడం గమనార్హం. 


కొలువుల్లో ముద్ర..

కరీంనగర్‌ జిల్లా నగరపాలక సంస్థ కమిషనర్‌ వల్లూరి క్రాంతి, శిక్షణ ఐపీఎస్‌ నితికా పంత్‌ కరీంనగర్‌ డీఐఈఓ రాజ్యలక్ష్మి, మార్కెటింగ్‌ శాఖ డీడీ పద్మావతి, ఐసీడీఎస్‌ పీడీ శారద, డీఎంఅండ్‌హెచ్‌వో సుజాత, ఆత్మ సంస్థ పథక సంచాలకురాలు ఎన్‌ ప్రియదర్శిని, సఖీ కేంద్రం అడ్మినిస్ట్రేటర్‌ డీ లక్ష్మి.. పెద్దపల్లి జిల్లాలో కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌, డీటీవో అఫ్రిన్‌ సిద్ధిఖీ.. జగిత్యాల జిల్లాలో ఎస్పీ సింధూశర్మ, డీఆర్డీఓ జల్ద అరుణశ్రీ.. ఇలా ఎంతో మంది కీలక శాఖల్లో ముఖ్య అధికారులుగా కొనసాగుతున్నారు. మరెందరో జిల్లా అధికారులుగా, తాసిల్దార్లుగా, ఎంపీడీవోలుగా, ఇతర అధికారులుగా, ఇంజినీర్లు, వైద్యులు, ఉద్యోగులుగా, ప్రొఫెసర్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇంకా ఎందరో ప్రజారక్షణలో కీలకమైన పోలీస్‌ శాఖలో చేరి స్ఫూర్తిగా నిలుస్తున్నరు. మరెందరో వైద్యులుగా, సామాజిక కార్యకర్తలుగా సేవలందిస్తున్నరు. 


అండగా రాష్ట్ర సర్కారు..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డలకు అండగా నిలుస్తున్నది. పుట్టినప్పటి నుంచి అత్తారింటికి చేరేదాకా ఏదో రకంగా భరోసా ఇస్తున్నది. ఆడపిల్ల చదువు సమాజానికి వెలుగని భావించి, చదువుకు ప్రాధాన్యతనిస్తున్నది. బళ్లలో సకల వసతులు కల్పించడంతోపాటు రెసిడెన్షియల్‌ స్కూళ్లను ఏర్పాటు చేసింది. అన్నింటా ప్రత్యేక రిజర్వేషన్లు అమలు చేస్తున్నది. పోకిరీలు, ఆకతాయిల నుంచి రక్షణ కల్పించేందుకు షీటీంలను ఏర్పాటు చేసింది. మహిళల భద్రత, ఆర్థిక స్వావలంబన, పథకాల సందేహాల నివృత్తి కోసం ‘181’ టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. వివిధ రంగాల్లో రాణించే వారికి ప్రోత్సాహకాలు అందిస్తున్నది. ఆడపిల్ల పెళ్లికి సాయంగా లక్ష నూట పదహార్లు ఇస్తున్నది. పేదింట మాతృత్వం కూడా భారం కావద్దని కేసీఆర్‌ కిట్లు ఇస్తున్నది. ఉచిత కాన్పు చేసి, అబ్బాయి పుడితే 12 వేలు, అమ్మాయి అయితే మరో వెయ్యి అదనంగా ఇస్తున్నది. గర్భిణులను దవాఖానకు తరలించేందుకు 102 వాహనాలను తేవడంతోపాటు గర్భిణులకు పీహెచ్‌సీల్లోనే నెలనెలా ఉచిత స్కానింగ్‌ పరీక్షలు చేయిస్తున్నది. ఏతోడూ లేని ఒంటరి మహిళల బతుకులకు భరోసా ఇచ్చే లక్ష్యంతో జీవన భృతి కల్పిస్తున్నది. స్త్రీ నిధి ద్వారా ఆర్థిక చేయూతనిస్తున్నది. వ్యాపార రంగంలో రాణించే మహిళలను ప్రోత్సహిస్తున్నది. ఆడపిల్లలు, మహిళలపై జరిగే అకృత్యాలను నివారించేందుకు జిల్లాల్లో సఖీ కేంద్రాల (వన్‌ స్టాఫ్‌ సెంటర్లు) ను ఏర్పాటు చేసింది.


కూలీ టూ సెలబ్రిటీ..

మల్యాల : వ్యవసాయ కూలీ నుంచి ఎదిగి వెండితెరపై మెరుస్తున్న గంగవ్వ, అందరికీ స్ఫూర్తి దాయకంగా నిలిచింది. మల్యాల మండలం లంబాడిపల్లె నుంచి ‘మై విలేజ్‌ షో’ వేదికగా తన ఇంటి పక్కనే ఉండే శ్రీరాం శ్రీకాంత్‌ సాయంతో పలు షార్ట్‌ ఫిల్మ్‌లలో నటిస్తూ తన ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నది. జగిత్యాల మండలం పొలాసలో పుట్టిన గంగవ్వ, ఊహ తెలియని వయసులోనే తన తండ్రిని, కొతకాలంలోనే తల్లిని కూడా కోల్పోయింది. తినడానికి తిండి లేక సాదే దిక్కు లేక ఇద్దరు తమ్ముళ్లతో ఉన్న గంగవ్వను ఓ మహిళ చేరదీసి కన్నతల్లిలా సాకింది. ఐదేళ్లు వచ్చేసరికి మల్యాల మండలం లంబాడిపల్లికి చెందిన మిల్కూరి గంగయ్యకు ఇచ్చి వివాహం జరిపించారు. తన అత్తే గంగవ్వను సొంత తల్లిలా చూసుకున్నది. పెరిగిన తర్వాత అత్తతోపాటు వ్యవసాయ కూలీగా పనిచేస్తూ జీవనం కొనసాగించింది. రెండు రూపాయల కూలీ కోసం వెయ్యి బీడీలను చుట్టడంతో పాటు వ్యవసాయ కూలీగా పనిచేస్తూ బతికింది. భర్త తాగుబోతు అయినా ముగ్గురు పిల్లలకు పెండ్లిళ్లు చేసి తనకున్న వ్యవసాయ భూమిని సాగుచేస్తూ బతుకీడుస్తున్నది. అత్త, భర్త మృతి చెందినా ఏదో సాధించాలనే తపనతో తన ప్రయత్నాన్ని ఆపలేదు. ఈ క్రమంలోనే తన ఇంటి పక్కనే ఉన్న శ్రీరాం శ్రీకాంత్‌ మై విలేజ్‌ షో ద్వారా లంబాడిపల్లిలో పలు సన్నివేశాలను ట్రెండింగ్‌గా చిత్రీకరిస్తూ యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నాడని తెలిసి తాను కూడా షార్ట్‌ఫిల్మ్‌లలో నటించడం ప్రారంభించింది. ప్రస్తుతం మై విలేజ్‌ షో వేదికగా పలు షోల్లో నటించిన గంగవ్వ, ఎల్లలుదాటి పేరును తెచ్చుకున్నది. జోర్దార్‌ న్యూస్‌లో వార్తలు చదవడంతో పాటు పలు సినిమాల్లోనూ నటించి సెలబ్రిటీగా మారింది. గ్రామీణ స్థాయి నుంచి కష్టనష్టాలకోర్చి గంగవ్వ, సినిమాల్లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకొని మహిళా దినోత్సవం సందర్భంగా ఇటీవల గవర్నర్‌ తమిళిసైతో అవార్డు అందుకొని అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచింది. 


logo