బుధవారం 01 ఏప్రిల్ 2020
Jagityal - Mar 07, 2020 , 01:07:07

బ్రహ్మోత్సవాలు షురూ

బ్రహ్మోత్సవాలు షురూ

ధర్మపురి,నమస్తేతెలంగాణ:  ధర్మపురిలో లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం అత్యం త వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం మంగళవాయిద్యాలు వెంటరాగా దేవస్థానం ఈవో సంకటాల శ్రీనివాస్‌, సిబ్బంది కలిసి యజ్ఞాచార్యులు కందాళై పురుషోత్తమాచార్యుల ఇంటికి వెళ్లి స్వామివారి ఉత్సవాల నిర్వహణ కోసం సంప్రదాయ రీతిలో ఆహ్వానించారు. అనంతరం ఆయనను మేళతాళాలతో ఆలయానికి తీసుకువచ్చారు. ఆలయం పక్షాన అర్చకులకు ఈవో దీక్షావస్ర్తాలు సమర్పించారు. ఆలయంలో వేద పండితులు బొజ్జ రమేశ్‌శర్మ, పురోహితులు బొజ్జ సంతోష్‌కుమార్‌శర్మ తదితరుల మంత్రోచ్ఛరణల మధ్య అర్చకులు నేరెల్ల శ్రీనివాసాచార్యులు, నంబి శ్రీనివాస్‌, నరసింహమూర్తి, రమణాచార్యు లు కలశ, విశ్వక్సేన వాసుదేవ, పుణ్యహవచనం, బ్రహ్మకలశ స్థాపన, అంకురార్పణ, వరాహతీర్థం తదితర పూజాకార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవమూర్తులకు రక్షాబంధనం చేసి నాందీముఖం, ఇదహవచనం చేసి బ్రహ్మోత్సవాల కో సం దేవతలందరినీ ఆహ్వానించి మాతృక పూజలు చేశారు.           

కనుల పండువలా ‘పుట్ట బంగారం’ ఘట్టం 

సాయంత్రం 7గంటలకు లక్ష్మీనరసింహ స్వామి(యోగ,ఉగ్ర), వేంకటేశ్వరస్వామివారల ఉత్సవ మూర్తులను సేవలపై ఉంచి వరాహతీర్థం, పుట్టబంగారం తేవడం కోసం తీసుకెళ్లారు. చింతామణి చెరువు కట్ట వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక వద్దకు ఊరేగింపుగా వచ్చి యజ్ఞాచార్యులు పురుషోత్తమాచార్యుల మంత్రోచ్ఛరణల మధ్య పండితులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయాలకు పుట్టమన్ను తవ్వి తీసుకువచ్చారు. స్వా మివారల సేవలను తిరిగిఆలయాలకు తెస్తుండగా దారి పొడవునా మహిళలు మంగళహారతులు ప ట్టారు. పూజల అనంతరం భక్తులు పోటీపడి పుట్ట బంగారాన్ని సేకరించి ఇంటికి తీసుకెళ్లారు. ఈ పుట్ట బంగారాన్ని పంటపొలాల్లో చల్లుకుంటే పం టలు సమృద్ధిగా పండుతాయని భక్తుల నమ్మకం. 

స్వామివారి కల్యాణం 

ఉత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం 6గంటలకు గోధూళి సుముహూర్తాన లక్ష్మీనరసింహస్వామి వారల (ఉగ్ర, యోగ) కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తామని దేవస్థానం ఈవో సంకటాల శ్రీనివాస్‌ తెలిపారు. స్వామివారల కల్యాణానికి డీసీఎమ్మెస్‌ చైర్మన్‌ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి-వెన్నెల దంపతులు  పట్టువస్ర్తాలు, తలంబ్రాలు ముందస్తుగా సమర్పించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కాగా ఉత్సవాల కోసం భక్తుల రాక శుక్రవారం నుంచే మొదలైంది.  శనివారం జరిగే స్వామివారి కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు ధర్మపురి చేరుకొని గోదావరి నది వ ద్ద ఏర్పాటు చేసిన చలువ పందిళ్లకింద బస చేశారు.

ఏర్పాట్లను పరిశీలించిన అడిషనల్‌ ఎస్పీ

బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను అడిషనల్‌ ఎస్పీ దక్షిణామూర్తి, ఆర్డీవో నరేందర్‌ పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా భద్రతా ఏర్పాట్లు చేయాలని సీఐ లక్ష్మీబాబును ఆదేశించారు. గోదావరి నది, దేవాలయం, చౌక్‌లు, వాహనాల పార్కింగ్‌ల వద్ద  పెట్రోలింగ్‌ ఏర్పాటు చేయాలన్నారు. వారివెంట జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్‌, తాసిల్దార్‌ రవీందర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ దివ్యదర్శన్‌రావు, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఇందారపు రామన్న తదితరులున్నారు. పూజల్లో ఈవో శ్రీనివాస్‌, సూపరింటెండెంట్‌ ద్యావళ్ల కిరణ్‌కుమార్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ అలువాల శ్రీనివాస్‌, మున్సిపల్‌ అధ్యక్షురాలు సంగి సత్తెమ్మ, బుగ్గారం ఎంపీపీ బాదినేని రాజమణి, జడ్పీటీసీ బాదినేని రాజేందర్‌ పాల్గొన్నారు.


logo
>>>>>>