మంగళవారం 31 మార్చి 2020
Jagityal - Mar 07, 2020 , 01:06:27

పనిచేసే ప్రభుత్వాలకే మద్దతు

పనిచేసే ప్రభుత్వాలకే మద్దతు

మెట్‌పల్లి రూరల్‌: పనిచేసే ప్రభుత్వాలకే ప్రజల మద్దతు ఉంటుందని, అందుకే రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాయని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు. మండలంలోని మెట్లచిట్టాపూర్‌లో రూ.10లక్షల ఉపాధిహామీ, 14వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన రెండు సీసీ రోడ్ల నిర్మాణానికి గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు. పల్లె ప్రగతి పనులతో గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపడిందన్నారు. ప్రతినెలా పంచాయతీలకు ప్రభుత్వం నుంచి నిధులు సమకూరుతున్నాయని, వాటితో మౌలిక సదుపాయాల కల్పనకు సర్పంచులు కృషి చేయాలని సూచించారు. గ్రామాల్లో నాటిన మొక్కలకు క్రమం తప్పకుండా నీళ్లు పడుతూ ఎండిపోకుండా చూడాలన్నారు. ఎండిపోయిన వాటి స్థానాల్లో కొత్త మొక్కలు నాటాలన్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా నియోజకవర్గానికి 82 వేల లబ్ధిదారులకు పింఛన్లు మంజూరవుతున్నాయని, రూ.4కోట్ల వరకు సీఎం సహాయనిధి మంజూరు చేసినట్లు తెలిపారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుంచడమే తన ధ్యేయమన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మారు సాయిరెడ్డి, సర్పంచ్‌ బద్దం శేఖర్‌, ఉపసర్పంచ్‌ రాజారపు భూమేశ్వర్‌, సహకార సంఘం అధ్యక్షుడు కేశిరెడ్డి నవీన్‌, ఉపాధ్యక్షుడు గోపిడి జగన్మోహన్‌రెడ్డి, నాయకులు సదిరం గంగాధర్‌, సుంకెట గంగాధర్‌, బిక్యా నాయక్‌, కుంట జనార్దన్‌ తదితరులున్నారు.


ఐకమత్యంతో పని చేసి సహకార సంఘం అభివృద్ధికి కృషి చేయాలి

మెట్‌పల్లి రూరల్‌: పాలకవర్గ సభ్యులు ఐకమత్యంతో పనిచేస్తూ సహకార సంఘాల అభివృద్ధికి కృషి చేయాలని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు. శుక్రవారం సాయంత్రం జరిగిన మెట్లచిట్టాపూర్‌ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నియోజకవర్గంలోని 16 సహకార సంఘాల అధ్యక్ష, ఉపాధ్యక్షులను రాష్ట్ర సహకార సంఘం అధ్యక్షుడి వద్దకు తీసుకెళ్లి పీఏసీఎస్‌ల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు. ఆయా సహకార సంఘాల పరిధిలో గోదాముల నిర్మాణానికి తన నిధులను కూడా మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. సంఘాల పరిధిలో యూరియాను నిల్వ ఉంచి రైతులకు ఇక్కట్లు తలెత్తకుండా చూడాలన్నారు. ఎస్సారెస్పీ పునర్జీవ పథకంతో 360 రోజులు పుష్కలంగా నీళ్లుంటాయని, ప్రతి ఎకరాకు సాగునీటిని సరఫరా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్యాకేజీ-21 కింద అంతర్గత పైపులైన్‌ పనులు కూడా ఎర్రాపూర్‌-డబ్బ గ్రామాల మధ్య కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఎత్తు ప్రాంతాల్లో ఉండే గ్రామాలకూ లిఫ్ట్‌ పెట్టయినా సాగునీటిని సరఫరా చేసేలా కృషి చేస్తానన్నారు. ఎన్నికల ముందే పార్టీల పరంగా పోటీ ఉంటుందని, తర్వాత అభివృద్ధే ఎజెండాగా పని చేస్తానన్నారు. అనంతరం పీఏసీఎస్‌ అధ్యక్షుడిగా కేశిరెడ్డి నవీన్‌రెడ్డి, ఉపాధ్యక్షుడిగా గోపిడి జగన్మోహన్‌రెడ్డితోపాటు 11మంది డైరెక్టర్లు ఎమ్మెల్యే సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాలకవర్గ సభ్యులను సన్మానించారు. ఎంపీపీ మారు సాయిరెడ్డి, సర్పంచ్‌ బద్దం శేఖర్‌, ఉపసర్పంచ్‌ రాజారపు భూమేశ్వర్‌, నాయకుడు సదిరం గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.


సమగ్రాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

మెట్‌పల్లి టౌన్‌: సమాజంలోని అన్ని వర్గాల సమగ్రాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు. కోరుట్ల మండలం తిమ్మయ్యపల్లె గ్రామపంచాయతీకి మంజూరైన ట్రాక్టర్‌ను శుక్రవారం పట్టణంలోని టీఆర్‌ఎస్‌ కార్యాలయ ఆవరణలో ఎమ్మెల్యే సర్పంచ్‌కు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామపంచాయతీలకు మంజూరైన ట్రాక్టర్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యేను పూలమాల, శాలువాతో సత్కరించారు. కోరుట్ల ఎంపీపీ తోట నారాయణ, సర్పంచ్‌ శివరాత్రి రాజరెడ్డి, ఉప సర్పంచ్‌ హరికుప్పల పెద్ద వెంకటి, కార్యదర్శి కోల రాజేశ్‌, వార్డు సభ్యులు శివరాత్రి రెడ్డి, నర్సయ్య, రాజం, ఎల్లయ్య, పల్లపు రాజు, టీఆర్‌ఎస్‌ నాయకులు అంజయ్య, నర్సయ్య, సందయ్య, ముత్తన్న తదితరులు పాల్గొన్నారు.


logo
>>>>>>