గురువారం 02 ఏప్రిల్ 2020
Jagityal - Mar 06, 2020 , 03:08:52

పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

ధర్మపురి,నమస్తేతెలంగాణ : దర్మపురి లక్ష్మీనరసిం హస్వామి వారి బ్రహ్మోత్సవాలకు పకడ్బందీగా ఏ ర్పాట్లు చేయాలని కలెక్టర్‌ రవి ఆదేశించారు.   నేటి నుంచి 18వ తేదీ వరకు నిర్వహించే లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై గురువారం ధర్మపురి పట్టణంలోని పాత టీటీడీ కల్యాణ మండపంలో అధికారులతో  సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ బ్రహోత్సవాలు జరిగే 13 రోజులు వివిధ ప్రాంతాల నుంచి ధర్మపురి క్షేత్రానికి  అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రధానంగా పారిశుధ్య నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులు దృష్టి సారించాలన్నారు. ధర్మపురి పట్టణంలోని వీధులన్నింటితో పాటు దేవాలయ, గోదావరి ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు చేపట్టాలన్నారు. అవసరమైతే ప్రైవేటు సిబ్బందిని నియమించుకోవాలని మున్సిపల్‌ కమిషనర్‌ దివ్యదర్శన్‌రావ్‌ను ఆదేశించారు. భక్తులు రద్దీగా ఉండే ప్రాంతాల్లో చలివేంద్రాలు తప్పక ఏర్పాటు చేయాలన్నారు. గోదావరి నది వద్ద మహిళలు దుస్తులు మార్చుకునేందుకు గదులను ఏర్పాటు చేయాలన్నారు. జాతరలో ప్రధానంగా గోదావరి నది కాలుష్యం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్లాస్టిక్‌ కవర్లు నదిలో పారవేయకుండా భక్తులకు ఎప్పటికప్పుడు సూచనలు ఇవ్వాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో చేపట్టే పనుల గురించి మాట్లాడుతూ జాతర 13 రోజుల పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల ఆరోగ్య పరిరక్షణ కోసం హెల్త్‌ క్యాంపులు ఏర్పాటు చేయాలని సూచించారు. 


కరోనా వ్యాప్తి చెందుతున్న దృష్టా జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రతి శిబిరంలో ఉదయం 6 గంటల నుంచి  రాత్రి 9గంటల వరకు డాక్టర్లు, నర్సులు అందుబాటులో ఉండాలని జిల్లావైద్యాధికారి శ్రీధర్‌ను ఆదేశించారు. టీఎస్‌ఆర్టీసీ ఏర్పాట్ల గురించి మాట్లాడుతూ ధర్మపురి స్వామివారి బ్రహ్మోత్సవాలకు తెలంగాణ రాష్ట్రం నుంచి కాకుండా మహారాష్ట్ర నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. భక్తుల రద్దీని అంచనా వేస్తూ బస్సులు నడపాలన్నారు. జాతరలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు కాకుండా బందోబస్తు ఏర్పాట్లు చేయాలని అడీషనల్‌ ఎస్పీ దక్షిణమూర్తికి సూచించారు. గోదావరి వద్ద గజఈత గాళ్లను, స్విమ్‌సూట్లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అలాగే రథోత్సవం నిర్వహించే దారు ల్లో గుంతలు లేకుండా రోడ్డును చదును చే యాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గో దావరి నది వద్ద, బ్రహ్మపుష్కరిణి వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ బేతి రాజేశం, అడిషనల్‌ ఎస్పీ దక్షిణామూర్తి, ఆర్డీఓ నరేందర్‌, ఆర్టీసీ డీఎం నాగేశ్వర్‌, తాసిల్దార్‌ రవీందర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ దివ్యదర్శన్‌రావ్‌, సీఐ లక్ష్మీబాబు, ఆర్‌అండ్‌బీ అధికారులున్నారు.


నర్సన్న సన్నిధిలో కలెక్టర్‌ పూజలు..

లక్ష్మీనరసింహస్వామివారి సన్నిధిలో  కల్టెక్టర్‌ రవి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.  అనంతరం అర్చకులు ఆశీర్వచన మండపంలో స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలను అందజేసి ఘనంగా సన్మానించారు. కలెక్టర్‌ వెంట అదనపు కలెక్టర్‌ రాజేశం ఉన్నారు.


logo