మంగళవారం 07 ఏప్రిల్ 2020
Jagityal - Mar 05, 2020 , 02:26:06

కరోనా.. అలర్ట్‌

కరోనా.. అలర్ట్‌

జగిత్యాల నమస్తే తెలంగాణ/ కోరుట్ల టౌన్‌:  చైనా నుంచి విజృంభించిన కరోనా.. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్నది. ప్రజా జీవనాన్ని భయాందోళనకు గురిచేస్తున్నది. విదేశాల నుంచి వస్తున్న వా రిలో అనుమానితులుండడం ఆందోళన కలిగిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్‌ అయింది. ఈ మేర కు అందిన ఆదేశాలతో జిల్లా యంత్రాంగం ఇప్పటికే రంగంలోకి దిగింది. అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేసి, వ్యాధి వ్యాప్తి, లక్షణాలు, నివారణపై ప్రజలకు చేరేలా విస్తృత ప్రచారం చేస్తున్నది. ఇదే సమయంలో ఆయా శాఖల వారీగా ముందస్తు చర్యలు చేపడుతున్నది. ఉమ్మడి జిల్లాకు గ్రానైట్‌తో చైనా దేశానికి సంబంధాలుండడంతో వైద్య ఆరోగ్యశాఖ జాగ్రత్తలు చేపట్టింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. కరీంనగర్‌ జిల్లా ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్‌ డా క్టర్‌ అజయ్‌కుమార్‌, ఆర్‌ఎంవో శౌరయ్య, డీఎంఅండ్‌హెచ్‌వో సుజాత కరీంనగర్‌ ప్రభుత్వ దవాఖానలో ప్రత్యేక ఐసోలేషన్‌ వార్డును ఏర్పాటు చేశారు. ఇందులో ఒక ఫిజీషియన్‌, ఫల్మోనాలజీ, స్టాఫ్‌ నర్స్‌, సిబ్బందిని నియమించారు. డ్రగ్స్‌, మాస్క్‌లు అందుబాటులో ఉంచారు. కరీంనగర్‌ డీఎంఅండ్‌హెచ్‌వో సుజాత మాట్లాడుతూ, కరో నా వదంతులకు భయపడాల్సిన అవసరం లేదని, జిల్లాలో అలాంటి కేసులు ఇంతవరకు రాలేదని చెప్పారు. ఇతర దేశాల నుంచి మన దేశానికి వచ్చే వారికి ఎయిర్‌ పోర్టులోనే పూర్తిస్థాయిలో పరీక్షలు చేస్తున్నారని, అనుమానితులుంటే 28 రోజుల పాటు ఇంక్యుబేషన్‌ పీరియడ్‌ కింద (ప్రత్యేక రూం)లో పెడుతున్నారన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు కరోనా వ్యాధి లక్షణాలు ఉన్నట్లు గుర్తించలేదన్నారు. జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వెంటనే దగ్గరలోని ప్రభు త్వ వైద్యులను సంప్రదించాలని సూచించారు.  


ఆర్టీసీ బస్టాండ్లలో ముందస్తు చర్యలు..

రద్దీ ఉండే ప్రాంతాల నుంచే వైరస్‌ వ్యాప్తి చెందే ప్రమాదముండగా ఆర్టీసీ అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న పది డిపోల మేనేజర్లు, సిబ్బందిని ఇప్పటికే ఆర్‌ఎం జీవన్‌ ప్రసాద్‌ అప్రమత్తం చేశారు. ఈ మేరకు  బుధవారం సాయంత్రం తర్వాత అన్ని బస్టాండ్లలో కుర్చీలను, ఏసీ, రాజధాని, గరుడ, గరుడ ప్లస్‌, ఎక్స్‌ప్రెస్‌తోపాటు అన్ని బస్సుల సీట్లను ప్రత్యేక లిక్విడ్‌తో శుభ్రం చేస్తున్నారు. బస్సుల్లో స్ప్రే చేయడంతోపాటు ప్రయాణికులు నిల్చున్నప్పుడు పట్టుకునే పైపులను కూడా క్లీన్‌ చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ముందు జాగ్రత్తగా మాస్క్‌లు ధరించాలని సూచిస్తున్నారు.  


కోర్టు ఆవరణల్లో జాగ్రత్తలు..

జిల్లా కేంద్రంతో పాటు ఇతర కోర్టుల ఆవరణలో కరోనా వైరస్‌ బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా కోర్టు ఆవరణలో కరోనా వైరస్‌ ప్రబలకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. శానిటేషన్‌ పనులపై తక్షణ చర్యలు చేపట్టాలని, వాటిలో సబ్బులు, హ్యాండ్‌వాష్‌లు అందుబాటులో ఉంచాలని, న్యాయమూర్తులకు కోర్టు సిబ్బందికి, న్యాయవాదులకు కక్షిదారులకు మాస్క్‌లు అందించాలని అందులో సూచించారు. జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి సహకారంతో కోర్టు ఆవరణలో ఇద్దరు డాక్టర్లు అందుబాటులో ఉండేలా చూడాలని, వైరస్‌ రాకుండా హోమియో మందులు అందించాలని, వైరస్‌ అనుమానంపై కాల్‌ చేస్తే మెడికల్‌ టీం త్వరగా కోర్టు ఆవరణకు చేరేలా చర్యలు చేపట్టాలని అన్ని విభాగాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 


 ఇవీ సూచనలు..

 కరచాలనం వద్దు.. నమస్కారమే శ్రేయస్కరం.

 చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. నీరు, సబ్బు అందుబాటులో లేనప్పుడు సానిటైజర్‌తో శుభ్రపరుచుకోవాలి.

 తుమ్మినా, దగ్గినా నోటికి రుమాలు అడ్డంపెట్టుకోవాలి.

 రద్దీ ప్రాంతాల్లో మాస్క్‌లు ధరించాలి.

 కండ్లు, ముక్కును నలుపకూడదు. 

జలుబు, దగ్గు, జ్వరం ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

చైనా, దుబాయ్‌, మలేషియా, హాంకాంగ్‌ తదితర దేశాల నుంచి వచ్చినవారు అప్రమత్తంగా ఉండాలి. కనీసం 14 రోజులపాటు ఇంటి నుంచి బయటకు రావద్దు. 

అనుమానిత లక్షణాలు ఉంటే కరోనా నోడల్‌ కేంద్రాన్ని ఆశ్రయించాలి.

బీపీ, షుగర్‌, హార్ట్‌, కిడ్నీ, లంగ్స్‌, అస్తమారోగులు, గర్భిణులు ఈ వైరస్‌ సోకకుండా మరింత జాగ్రత్తగా ఉండాలి.logo