సోమవారం 06 ఏప్రిల్ 2020
Jagityal - Mar 04, 2020 , 02:57:53

అక్రమ లే అవుట్లపై ఉక్కుపాదం

అక్రమ లే అవుట్లపై ఉక్కుపాదం
  • రాష్ట్ర సర్కారు సీరియస్‌
  • అనుమతి లేని వెంచర్లను గుర్తించాలని ఆదేశాలు
  • మున్సిపాలిటీల వారీగా రంగంలోకి అధికారులు
  • జిల్లాలో 101.26 ఎకరాల్లో 24 అక్రమ వెంచర్లు ఉన్నట్లు గుర్తింపు
  • కఠిన చర్యలకు సిద్ధం.. హద్దురాళ్ల తొలగింపు
  • పలువురికి నోటీసులు జారీ
  • రిజిస్ట్రేషన్ల నిలిపివేతకు లేఖలు

బల్దియాల్లో ‘అక్రమ లేఅవుట్ల’పై రాష్ట్ర సర్కారు సీరియస్‌గా వ్యవహరిస్తున్నది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే రియల్టర్లపై ఉక్కుపాదం మోపుతున్నది. ఈ మేరకు ‘పట్టణ ప్రగతి’లో భాగంగా అనుమతిలేని వెంచర్లను గుర్తించి, ఆన్‌లైన్‌లో నమోదు చేయాలంటూ ‘సీడీఎంఏ’ ఐదు రోజుల క్రితమే ఉత్తర్వులు జారీ చేయగా, అన్ని మున్సిపాలిటీల్లోనూ అధికారులు రంగంలోకి దిగారు. ఇప్పటికే జగిత్యాల మినహా, కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి, రాయికల్‌ మున్సిపాలిటీల్లో మొత్తం 101.26 ఎకరాల్లో 24అక్రమ లే అవుట్లున్నట్లు గుర్తించి, వాటి యజమానులకు నోటీసులు జారీ చేస్తున్నారు. మరోవైపు ఆ ప్లాట్లకు రిజిస్ట్రేషన్లను ఆపేయాలంటూ మున్సిపల్‌ కమిషనర్లు జిల్లా రిజిస్ట్రార్లకు లేఖలు రాస్తుండడంతో క్రయవిక్రయాలను నిలిపేస్తున్నారు.

- జగిత్యాల ప్రతినిధి/జగిత్యాల/ ధరపురి/ మెట్‌పల్లి, నమస్తే తెలంగాణ/ కోరుట్ల/రాయికల్‌


 జగిత్యాల ప్రతినిధి/జగిత్యాల/ ధరపురి/ మెట్‌పల్లి, నమస్తే తెలంగాణ/ కోరుట్ల/రాయికల్‌: అక్రమ లే అవుట్లతో మున్సిపల్‌  ఆదాయనికి గండికొట్టడమే కాకుండా స్థలాల కొనుగోలు దారులకు సమస్య లు సృష్టిస్తున్న రియల్టర్లపై మున్సిపల్‌ శాఖ కఠిన చర్యలు చేపట్టింది. అక్రమ లే అవుట్లను గుర్తించి, వివరాలను నమోదు చేయాలని పురపాలక శాఖ రాష్ట్ర సంచాలకులు ఆదేశాలు జారీ చేయడంతో  ఇటీవల   స్థానిక అధికార యంత్రాంగం  ఆ దిశగా చర్యలకు నడుంబిగించింది. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో జగిత్యాలలో ఒక్కటి కూడా గుర్తించలేదు. మిగతా నాలుగు మున్సిపాలిటీల  పరిధిలో 24 అక్రమ లే అవుట్లను ఇప్పటి వరకు గుర్తించారు.  వీటిలో హద్దు రాళ్లను తొలగించారు. అక్రమ లే అవుట్లలో క్రయ, విక్రయాలకు సంబంధించి రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని స్థానిక సబ్‌రిజిస్ట్రార్‌కు సమాచారం అందించారు. దీంతో ఇప్పటికే ఆయా అక్రమ లే అవుట్లలో స్థలాలు కొనుగోలు చేసిన కొనుగోలు దారులు ఆందోళన చెందుతుండగా, మిగిలిన స్థలాల విక్రయాలు నిలిచిపోవడంతో రియల్టర్లలో గుబులు రేగుతున్నది.  అక్రమ లే అవుట్లను సర్వే నంబర్లతో సహా మున్సిపల్‌ అధికారులు  గుర్తించి, రియల్టర్లపై చర్యలకు ఉపక్రమిస్తున్నారు. 24 ప్రాంతాల్లో అక్రమ లే అవుట్లలో కలిపి 101.26 ఎకరాల విస్తీర్ణాన్ని గుర్తించారు. జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి, రాయికల్‌ మున్సిపాలిటీలున్నాయి. జగిత్యాలలో ఒక్క అక్రమ లేవుట్‌ వెంచర్‌ను కూడా గుర్తించలేదు. అత్యధికంగా మెట్‌పల్లిలో 13, రాయికల్‌, కోరుట్లలో 3చొప్పున, ధర్మపురిలో 5 లేఅవుట్లను అధికారులు గుర్తించి హద్దు రాళ్లను తొలగిస్తున్నారు. తాము గుర్తించిన అన్ని అక్రమ లే అవుట్ల యజమానులకు ఇప్పటికే నోటీసులు కూడా ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. సంబంధిత సర్వే నంబర్లు, యజమానుల వివరాలు తెలుసుకుంటున్నామనీ, వారందరికీ నోటీసులు ఇస్తామని వెల్లడించారు.  ఈ అక్రమ లే అవుట్లను  క్రమబద్ధీకరిస్తే మున్సిపల్‌కు కనీసం 10 ఎకరాల వరకు  స్థిరాస్తి సమకూరుతుంది. భవిష్యత్‌లో  ఉమ్మడి అవసరాలకు ఉపయోగించుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. 


ఇవీ  నిబంధనలు..

మున్సిపాలిటీ పరిధిలో టౌన్‌ ప్లానింగ్‌ నిబంధనల ప్రకారం లే అవుట్లతో ప్లాట్లను విక్రయించాలి. ఎంత విస్తీర్ణంలో వెంచర్‌ (ప్లాట్లు) ఏర్పాటు చేస్తారో ఆ స్థలం ఒక వేళ వ్యవసాయానికి సంబంధించినదైతే  ముందుగా రెవెన్యూ శాఖ నుంచి  వ్యవసాయేతరాల కోసం కన్వర్షన్‌ చేయించాలి. అందుకు 3 శాతం  భూమి విలువ (రిజిస్ట్రార్‌ విలువ) ప్రకారం పన్ను చెల్లించాలి. కన్వర్షన్‌ అనంతరం  వెంచర్‌లో ప్రధాన రహదారిని 40 అడుగులు వెడల్పు, అంతర్గత రహదారులను 30 అడుగుల వెడల్పుతో ఏర్పాటు చేయాలి. అదే విధంగా మౌలిక వసతులలో భాగమైన డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్‌ సౌకర్యం కోసం ఏర్పాట్లు చేయాలి.  ఎంత విస్తీర్ణంలో వెంచర్‌ ఏర్పాటు చేస్తారో అందులో 10 శాతం భూమిని కమ్యూనిటీ అవసరాల కోసం మున్సిపాలిటీ పేరిట రిజిస్ట్రేషన్‌ చేయాలి. నిబంధనలు పాటిస్తే తప్ప మున్సిపల్‌ టౌన్‌ ప్లానింగ్‌ విభాగం నుంచి లే అవుట్‌ అనుమతి  ఉండదు. 


అనుమతులు లేని లే అవుట్‌లే ఎక్కువ

మున్సిపాలిటీల పరిధిలో ప్లాట్ల క్రయ, విక్రయాలు , ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి.  రోజు రోజుకూ పట్టణ జనవాసాల సంఖ్య పెరుగుతూనే ఉన్నది.  మున్సిపాలిటీలు ఏర్పడిన నాటి నుంచి ఇంత వరకు ఒక్కటంటే ఒక్క లే అవుట్‌కు కూడా అనుమతి లేకపోవడం గమనార్హం.  రియల్టర్లు అ క్రమంగా వెంచర్లు వేసి ప్లాట్ల విక్రయాలు చేపట్టారు.  ఆయా వెంచర్లలో కేవలం 18 నుంచి 21 అడుగుల లోపు మాత్రమే అంతర్గత రోడ్లను ఏ ర్పాటు చేసి  ప్లాట్లను విక్రయిస్తూ  సొమ్ము చేసుకోవడం పరిపాటిగా మారింది. దీని వల్ల మున్సిపాలిటీకి రావాల్సిన  కమ్యూనిటీ అవసరాలకు సంబంధించి 10 శాతం భూమిని కోల్పోక తప్పని పరిస్థితి.  


ప్లాట్లు కొన్నవారికి ఇబ్బంది 

అక్రమ లే అవుట్లపై మున్సిపల్‌ అధికారులు చర్యలకు ఉపక్రమించడంతో సంబందిత లే అవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన కొనుగోలు దారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్లాట్లను క్రమబద్దీకరించుకునేందుకు తిరిగి వేలాది రూపాయలు చెల్లించాల్సి వస్తుందనే ఆందోళనకు గురవుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా లే అవుట్‌లో ప్లాట్లు కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా క్రమబద్ధీకరించుకోవాల్సిందేనని మున్సిపల్‌ అదికారులు పేర్కొంటున్నారు. క్రమద్ధీకరించుకుంటేనే గృహ నిర్మాణ అనుమతులు అభిస్తాయని స్పష్టం చేస్తున్నారు. అక్రమ లే అవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు తమ స్థలాలను నిబంధనల మేరకు క్రమబద్ధీకరించుకుంటే మున్సిపాలిటీలకు సుమారు రూ. కోటికి పైగా ఆదాయం సమకూరుతుందని పేర్కొంటున్నారు. 


అక్రమ లే ఆవుట్లపై చర్యలు 

అక్రమంగా వెలిసిన లేవుట్లపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటున్నాం. అక్రమ వెంచర్లను గుర్తించి ఇండ్ల స్థ లాలకు రియల్టర్లు పాతిన హద్దురాళ్లను తొలగిస్తు న్నాం. అక్రమ స్థలాల్లో ప్లాట్లకు రిజిస్ట్రేషన్‌ చే యవద్దని సంబంధిత సబ్‌ రిజిస్ట్రార్‌కు సమాచారం అందించాం. నిబందనలకు విరుద్ధం గా వెంచర్లు ఏర్పాటు చేయవద్దని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు అవగాహన కల్పించాం.    - జగదీశ్వర్‌గౌడ్‌, మున్సిపల్‌ కమిషనర్‌, మెట్‌పల్లి


logo