గురువారం 09 ఏప్రిల్ 2020
Jagityal - Mar 04, 2020 , 02:49:41

నిరుపేదల కళ్లలో ఆనందమే లక్ష్యం

నిరుపేదల కళ్లలో ఆనందమే లక్ష్యం
  • వారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకే రెండు పడక గదుల ఇండ్లు
  • వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు
  • మేడిపల్లి మండలం మన్నెగూడెంలో 15 డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లకు ప్రారంభోత్సవం
  • పాల్గొన్న జడ్పీ అధ్యక్షురాలు వసంత, కలెక్టర్‌ రవి

మేడిపల్లి : నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చి వారి కళ్లలో ఆనందం చూడడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు పేర్కొన్నారు. మేడిపల్లి మండలం మన్నెగూడెంలో రూ 94.35 లక్షలతో నిర్మించిన 15 డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను  జడ్పీ అధ్యక్షురాలు వసంత, కలెక్టర్‌ రవితో కలిసి మంగళవారం ఆయన రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలంలోని గోవిందారంలో 15, భీమారంలో 15 డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను నిర్మించి లభ్ధిదారులకు అందజేశామనీ, త్వరలోనే మేడిపల్లి, కల్వకోటలో 30 డబుల్‌బెడ్‌ రూం ఇండ్లను లభ్ధిదారులకు అందజేస్తామని తెలిపారు.  వేములవాడ పట్టణంలో 800 డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లకు శ్రీకారం చుట్టామనీ, మరో 1000 ఇండ్లు మంజూరయ్యాయని చెప్పారు.   పేదల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకే డబుల్‌బెడ్‌ రూం ఇండ్లు, కల్యాణలక్ష్మి పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెట్టారన్నారు. గడిచిన 12 నెలల్లో నియోజకవర్గంలో కల్యాణలక్ష్మి పథకం కింద రూ.11కోట్ల 50 లక్షలను లభ్ధిదారులకు అందజేశామని తెలిపారు. వరద కాలువను రిజర్వాయర్‌లా మార్చి నీటిని నింపిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. 365 రోజులూ వరదకాలువలో నీరుం డి మేడిపల్లి, కథలాపూర్‌ మండలాలు సస్యశ్యామలమవుతాయని తెలిపారు. వరదకాలువకు 19 ఓటీలను గుర్తించామనీ, వాటిని నిర్మించి చెరువులు నింపుతామని పేర్కొన్నారు. లక్ష ఎకరాలకు నీరందించే లక్ష్యంతో పని చేస్తున్నామనీ, వేములవాడ, చందుర్తి, రుద్రంగి మండలాల్లో 55 వేల ఎకరాలకు సాగునీరందించామని చెప్పారు. త్వరలోనే మేడిపల్లి, కథలాపూర్‌ మండలాల్లో 45 వేల ఎకరాలకు నీరందిస్తామని తెలిపారు.


రైతుబీమా, రైతుబంధు పథకాలను ప్రవేశపెట్టి రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ భరోసా ఇచ్చారన్నారు. జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత మాట్లాడుతూ పేదల సొంతింటి కల నెరవేర్చి ఇది చేతల ప్రభుత్వమని నిరూపించిందన్నారు. ఇంటి పెద్దగా పేదలకు ఇండ్లను కట్టించిన సీఎం కేసీఆర్‌ ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలుస్తారన్నారు. ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా పని చేస్తున్న ఎమ్మెల్యేతో కలిసి జిల్లాను అభివృధ్ధి చేస్తానన్నారు. కలెక్టర్‌ రవి మాట్లాడుతూ డబుల్‌ బెడ్‌రూం లభ్ధిదారులు మొక్కలను పెంచి కాలనీని హరితహారం కాలనీగా మార్చాలని సూచించారు. అనంతరం పలు గ్రామాలకు చెందిన లభ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఇక్కడ ఎమ్మెల్యేను, జడ్పీ అధ్యక్షురాలిని, ఉపాధ్యక్షుడు వొద్దినేని హరిచరణ్‌రావును, కలెక్టర్‌ రవి, అదనపు కలెక్టర్‌ రాజేశంను స్థానిక నేతలు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ దోనకంటి ఉమాదేవి, సర్పంచ్‌లు సింగిరెడ్డి నరేశ్‌రెడ్డి, గడ్డం నారాయణరెడ్డి, కాచర్ల సురేశ్‌, ద్యావనపెల్లి అభిలాష్‌, దుంపేట లక్ష్మీనర్సయ్య, తౌటి తిరుపతిరెడ్డి, కుందూరి బాలరాజు, ఎంపీటీసీలు చెన్నమనేని రవీందర్‌రావు, ఆదె రాజన్న, తాసిల్దార్‌ రాజేశ్వర్‌, ఈఈ మనోహర్‌రావు, ఆర్‌ఐ నాగేశ్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు అంకం విజయసాగర్‌, సుధవేని గంగాధర్‌ పాల్గొన్నారు.


కేసీఆర్‌ దేవుడు

పేదల కష్టాలను తీరుస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ మా పాలిట దేవుడు. మేం కూలి పని చేసుకుంటూ బతుకెళ్లదీసుకుంటున్నం. నాకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు బిడ్డలు. మాయి చాలీచాలని బతుకులు. మా గోస చూసి సీఎం కేసీఆర్‌ డబుల్‌ బెడ్‌ రూం ఇల్లు కట్టించిండు. చాలా సంతోషంగా ఉంది.

-  సొన్న రాజమణి (మన్నెగూడెం)


సీఎంకు రుణపడి ఉంటం

మాది పేద కుటుంబం. నేను బీడీలు చుడుతూ కుటుంబాన్ని గట్టెక్కిస్తున్న. పేదలను గుర్తించి డబుల్‌బెడ్‌ రూములను ప్రభుత్వమే కట్టిచ్చుడు గొప్ప విషయం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారుకు రుణపడి ఉంటం. జీవితాంతం కేసీఆర్‌ను జ్ఞాపకముంచుకుంటం. 

- దాసరి రాధ (మన్నెగూడెం)


తెలంగాణ వల్లే ఇల్లు  

గత ప్రభుత్వాలు పేదలను గుర్తించలేదు. తెలంగాణ రాష్ట్రం రావడం వల్లే పేదలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇండ్లు కట్టిస్తున్నడు. నేను కైకిలి చేసుకుంట బతుకుతున్న. మాకు సొంతిల్లు వస్తదని కలలకుడ ఊహించలేదు. సీఎం కేసీఆర్‌ పుణ్యమా అని ఆ కల నెరవేరింది.

- తేలు గంగు (మన్నెగూడెం)


మా కల నెరవేరింది

మేం ఒడ్డెరోళ్లం. గుడిసెలో ఉంటూ, కైకిలి చేసుకుంటూ బతుకుతున్నం. నాకు ముగ్గురు బిడ్డలు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దయ వల్ల మాలాంటి పేదల సొంతింటి కల నెరవేరుతున్నది. మాకు ఇల్లు కట్టిచ్చి మా కళ్లలో ఆనందం నింపిండు. పేదల కష్టాలు తీరుస్తున్న సీఎం కేసీఆర్‌ సల్లంగ ఉండాలె. 

- గొళ్లెం ఎల్లవ్వ (మన్నెగూడెం)logo