ఆదివారం 29 మార్చి 2020
Jagityal - Mar 02, 2020 , 01:37:01

సమష్టి కృషితోనే లక్ష్యం సాకారం

సమష్టి కృషితోనే లక్ష్యం సాకారం

మెట్‌పల్లి,నమస్తే తెలంగాణ: సమష్టి కృషితోనే లక్ష్యం సాకారమవుతుందని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు. ఆదివారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  అభివృద్ధిలో మరింతగా ముందుకు నడిపించేందుకు సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టారని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులతోపాటు స్థానిక వార్డుల ప్రజలు సైతం భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.  ప్రజలు తమ వార్డులో ఎక్కడెక్కడ సమస్యలున్నా వాటిని అధికారుల దృష్టికి తేవాలని సూచించారు.  జనావాసాల మధ్య, ఖాళీ ప్రదేశాల్లో మురుగు నీరు చేరకుండా, పిచ్చిమొక్కలు పేరుక పోకుం డా, చెత్తాచెదారం లేకుండా మున్సిపల్‌ అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పట్టణంలో చేపట్టిన ప్రగతి కార్యక్రమంలో వార్డులవారీగా  ప్రజాప్రతినిధులు, అధికారులు, వార్డు కమిటీ సభ్యులు పాదయాత్ర చేస్తూ  సమస్యలను గుర్తించడం జరుగుతున్నదని,  అలాగే స్థానిక ప్రజలతో కలిసి శ్రమదానంతో పిచ్చిమొక్కలు, చెత్తాచెదారం తొలగింపు, పరిశుభ్రత పనులు చేస్తున్నారన్నారు. పరిశుభ్రత ప్రక్రియను నిరంతరం కొనసాగించాలన్నారు. అభివృద్ధితో పాటు స్వచ్ఛదనం ఎంతో ముఖ్యమని, ఆ దిశగా నియోజకవర్గంలోని కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాలను స్వచ్ఛ పట్టణాలను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇప్పటికే గ్రామాల్లో పల్లె ప్రగతితో  స్వచ్ఛదనం నిండుకుందని, ఈ కార్యక్రమం పల్లెల్లో జయప్రదమైందన్నారు. పట్టణాల్లోనూ అదే స్ఫూర్తితో నిరంతర ప్రక్రియగా ప్రగతి పనులు నిర్వహించేందుకు  మున్సిపల్‌ కౌన్సిలర్లు, అధికారులు, ప్రజలు  సమష్టిగా కృషి చేయాలన్నారు. వేసవిలో నీటి ఎద్దడి ఉన్న వార్డులు, ప్రాంతాలను గుర్తించి  ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు కార్యాచరణను రూపొందించాలని మున్సిపల్‌ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. మల్లాపూర్‌ జడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు ఆదిరెడ్డి, మాదవరెడ్డి, జగన్‌ తదితరులు పాల్గొన్నారు.


logo