మంగళవారం 31 మార్చి 2020
Jagityal - Mar 02, 2020 , 01:37:01

పరిశుభ్రత అందరి బాధ్యత

పరిశుభ్రత అందరి బాధ్యత

కోరుట్లటౌన్‌: పరిసరాల శుభ్రత అందరి బాధ్యత అని అదనపు కలెక్టర్‌ బేతి రాజేశం పేర్కొన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆయన పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించారు. వార్డుల్లో నెలకొన్న సమస్యల గురించి కాలనీవాసులను అడిగి తెలుసుకున్నారు. పచ్చదనం, స్వచ్ఛదనానికి ప్రజలు సహకరించాలని కోరారు. పట్టణాలు అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో పయనించాలనే సంకల్పంతో ప్రభుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమానికి రూపకల్పన చేసిందన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని సమస్యలకు పట్టణ ప్రగతి ద్వారా పరిష్కరించనున్నామన్నారు. అన్ని వార్డు ల్లో పరిశుభ్రత, పచ్చదనం కోసం ప్రణాళికలను రూపొందించినట్లు చెప్పారు. పది రోజుల పట్టణ ప్రగతిని నిరంతరం కొనసాగించేలా వార్డు కమిటీ సభ్యులు కృషి చేయాలని సూచించారు. వ్యర్థాలను ఇష్టారీతిలో ఆరు బయట వేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. నివాస ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న ప్లాట్లలో చెత్తను వేస్తే యజమానులకు జరిమానా విధిస్తామన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా నిరక్షరాస్యులను గుర్తించడం కోసం ఇంటింటా మెప్మా ఆర్పీలు సర్వే చేస్తున్నారని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఇంటికి అవసరమైన మొక్కలు పంపిణీ చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ పడవేయవద్దని, ఇంటి వద్దకు వచ్చే మున్సిపల్‌ వాహన సిబ్బందికి తడి, పొడి చెత్తను వేరు చేసి అందించాలన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే పట్టణ ప్రగతి సాధ్యమన్నారు. అలాగే  పట్టణంలోని బీమునిదుబ్బ, శ్రీనివాసరోడ్డు, వినోభా రోడ్డు కాలనీల్లో జనావాస ప్రాంతాల్లోని ఓపెన్‌ ప్లాట్లలో పెరిగిన పిచ్చిమొక్కలను పారిశుధ్య సిబ్బంది జేసీబీ సాయంతో తొలగించారు. స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి మురుగుకాల్వల్లోని చెత్తాచెదారాన్ని తొలగించే పనులు చేపట్టారు. వార్డుల్లో డ్రైనేజీ, అంతర్గత రహదారులను పరిశీలించిన అధికారులు, ప్రజాప్రతినిధులు తాగునీరు, విద్యుత్‌ తదితర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆయా వార్డుల్లో రోడ్లపై ఉన్న గుంతల పూడ్చివేత, ఖాళీ స్థలాల్లో మురుగు నీటి సమస్య, మొక్కలు నాటే ప్రాంతాలను గుర్తించిన కౌన్సిలర్లు పనుల నిర్వహణపై స్పెషలాఫీసర్లకు నివేదించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ మహ్మద్‌ ఆయాజ్‌, కౌన్సిలర్లు గుండోజి శ్రీనివాస్‌, తిరుమల వసంత,  డీఈఈ ప్రభాకర్‌రెడ్డి, డిప్యూటీ తాసిల్దార్‌ వకీల్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ రాజయ్య, వార్డు స్పెషల్‌ ఆఫీసర్లు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.logo
>>>>>>