బుధవారం 08 ఏప్రిల్ 2020
Jagityal - Mar 01, 2020 , 02:33:21

స్వచ్ఛ జగిత్యాలే లక్ష్యం

స్వచ్ఛ జగిత్యాలే లక్ష్యం

జగిత్యాల, నమస్తే తెలంగాణ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో జగిత్యాలను స్వచ్ఛంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ అన్నారు. పట్టణ పగ్రతిలో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలోని 44వ వార్డులో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బోగ శ్రావణి పలు పనులు ప్రారంభించారు. పలు వీధుల్లో పర్యటించి, స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఖాజీపురా ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. పట్టణంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసమే కార్యక్రమాన్ని ప్రారంభించామనీ, దీంతో పట్టణాలన్నీ పరిశుభ్రంగా మారుతున్నాయన్నారు. ప్రజలకు శుద్ధమైన మంచినీటి మిషన్‌ భగీరథ ద్వారా అందిస్తున్నామనీ, వాతావరణ కాలుష్యం కాకుండా ఉండాలంటే ప్లాస్టిక్‌ వాడకాన్ని ప్రతి ఒక్కరూ తగ్గించాలని సూచించారు. 


ప్రజలంతా చెత్తను మురుగు కాలువల్లో వేయొద్దనీ, తప్పనిసరిగా ఇండ్ల వద్దకు వచ్చే ఆటోలు, రిక్షాల్లోనే వేయాలని సూచించారు. మన ఇంటిని శుభ్రంగా ఉంచుకున్నట్లే, మన వార్డును, పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. మున్సిపల్‌ అధ్యక్షురాలు బోగ శ్రావణి మాట్లాడుతూ పట్టణాన్ని స్వచ్ఛ జగిత్యాలగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కంకణబద్దులు కావాలని పిలుపునిచ్చారు. మార్పు అనేది మన నుండే వస్తుందనీ, పల్లె ప్రగతి తరహాలో అందరు మన ఇండ్లతో పాటు పట్టణాన్ని స్వచ్ఛంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని కోరారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రతి వార్డులోని సమస్యలను గుర్తించి, పరిష్కరించే దిశగా ముందుకెళ్తున్నట్లు తెలిపారు. అనంతరం పలు వార్డుల్లో స్థానిక వార్డు కౌన్సిలర్లతో ప్రజా సమస్యలను గుర్తించారు. కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ గోలి శ్రీనివాస్‌, మున్సిపల్‌ కమిషనర్‌ జయంత్‌కుమార్‌రెడ్డి, కౌన్సిలర్లు కూతురు పద్మ, ఫిర్దోస్‌ తరున్నం, ఆసియా సుల్తానా, సాహెరా భాను, స్పెషల్‌ అధికారులు, సూపర్‌వైజర్లు, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు. 


logo