శనివారం 15 ఆగస్టు 2020
Jagityal - Feb 29, 2020 , 00:20:55

చిన్నారి తుదిశ్వాస

చిన్నారి తుదిశ్వాస

 ధర్మపురి,నమస్తేతెలంగాణ : ధర్మపురి ఎస్‌ఐ కదిరి శ్రీకాంత్‌-సింధూ దంపతుల కూతురు వేదశ్రీ(20నెలలు) అలియాస్‌ స్మైలీ జ్వరంతో బాధపడుతూ గురువారం అర్ధరాత్రి హైదారాబాద్‌లోని ఓ వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందింది. వివరాలిలా ఉన్నాయి.  సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వెంకట్రావ్‌పేటకు చెందిన శ్రీకాంత్‌-సింధూ దంపతుల కూతురు వేదశ్రీ(20నెలలు)కి ఐదు రోజుల క్రితం తీవ్ర జ్వరం రావడంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్‌ వైద్యశాలకు తరలించారు. రక్తంలో ఇన్‌ఫెక్షన్‌ వచ్చిందనీ, హైదరాబాద్‌కు తరలించాల్సిదిగా కరీంనగర్‌ వైద్యులు సూచించడంతో హైదరాబాద్‌ అమీర్‌పేట్‌లోని ప్రణమ్‌ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ మూడు రోజులుగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి కన్ను మూసింది. శుక్రవారం చిన్నారి అంత్యక్రియలు స్వగ్రామమైన వెంకట్రావుపేటలో నిర్వహించగా కూతురు మృతదేహంపై పడి ఎస్‌ఐ దంపతులు, కుటుంబసభ్యులు రోదించిన తీరు చూపరులకు కంట తడి పెట్టించింది. జగిత్యాల ఎస్పీ సింధూశర్మ, అడిషనల్‌ ఎస్పీ దక్షిణామూర్తి, డీఎస్పీ వెంకటరమణ, జగిత్యాల సబ్‌డివిజన్‌ సీఐలు, ఎస్‌లు, భారీగా ఇతర పోలీస్‌ సిబ్బంది చిన్నారి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.


‘జీవితంలో నవ్వు లేకుండా చేశావా తల్లీ  

కూతురు స్మైలీ మృతితో ఎస్‌ఐ శ్రీకాంత్‌ గుండెలవిసేలా రోదించారు. ‘జీవితంలో నవ్వు అనేదే లేకుండా చేశావా తల్లీ..పొద్దున లేస్తే నీముఖం చూసి నిను ముద్దాడనిదే..ఏమీ తోచదమ్మా.. ఇప్పుడు నాకు తోచేదెలానమ్మా..రోజూ ఇంట్లో నవ్వుతూ తిరుగుతూ ఉంటే చూసి మురిసేటోనమ్మా..ఇప్పుడు ఎలా మురిసేద మ్మా..”అంటూ రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది.


logo