గురువారం 02 ఏప్రిల్ 2020
Jagityal - Feb 27, 2020 , 00:26:36

‘ప్రగతి’తో మారనున్న పట్టణ రూపురేఖలు

‘ప్రగతి’తో మారనున్న పట్టణ రూపురేఖలు

మెట్‌పల్లి,నమస్తే తెలంగాణ/మెట్‌పల్లిటౌన్‌: దూరదృష్టితో సీఎం కేసీఆర్‌ రూపొందించిన పట్టణ ప్రగతి కార్యక్రమంతో చేపట్టనున్న పనులతో పట్టణాల రూపురేఖలు మారనున్నాయని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు.  బుధవారం పట్టణంలోని 24, 26వార్డుల్లో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే పలు వీధులను సందర్శించి డ్రైనేజీ, అంతర్గత రహదారులను పరిశీలించారు. తాగునీరు, విద్యుత్‌ తదితర సమస్యలను స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, జనవాసాల మధ్య మురుగునీరు, చెత్తాచెదారం పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. విద్యుత్‌ సరఫరాకు సంబంధించి మరమ్మతు పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మెట్‌పల్లికి 60ఏండ్ల కిందట కరెంట్‌ వచ్చిందని, ఆ కాలం నాటి తుప్పుపట్టిన ఇనుప స్తంభాలు, వంగిపోయి, ఎత్తు తక్కువగా ఉండి ప్రమాదకరంగా మారాయన్నారు. వాటన్నింటిని తొలగించి కొత్త స్తంభాలను అమర్చడానికి విద్యుత్‌ సంస్థ నడుంబిగించిందన్నారు. వివిధ వార్డుల్లో అదనపు ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు కోసం స్థలాలను ఎంపిక చేసి విద్యుత్‌ సంస్థకు అప్పగించే బాధ్యతను ఆయా వార్డుల కౌన్సిలర్లు తీసుకోవాలన్నారు. నియోజకవర్గంలోని పట్టణ, గ్రామాల్లో విద్యుత్‌ అధికారులు, సిబ్బంది బాగా కష్టపడి పని చేస్తున్నారని ప్రశంసించారు. అదే విధంగా పది రోజుల పాటు కొనసాగునున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రజలు తమ వార్డుల్లో నెలకొన్న సమస్యలను సంబంధిత అధికారుల దృషిక్టి తేవాలన్నారు. సమస్యల పరిష్కారం కోసం  ప్రణాళికను తయారు చేసి కార్యాచరణ ప్రక్రియను చేపట్టడం జరుగుతుందన్నారు. ఎన్‌పీడీసీఎల్‌ డీఈ గంగారాం మాట్లాడుతూ.. మెరుగైన విద్యుత్‌ సరఫరా కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మెటీరియల్‌ కొరత లేదని, వంద శాతం  పనులు పూర్తి చేసి మెట్‌పల్లి పట్టణాన్ని జిల్లా స్థాయిలో పట్టణ ప్రగతిలో ముందంజలో నిలబెడతామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ అధ్యక్షురాలు రాణవేని సుజాత, ఉపాధ్యక్షుడు బోయినపల్లి చంద్రశేఖర్‌రావు, ఏడీఈ మనోహర్‌,  మున్సిపల్‌ కమిషనర్‌ జగదీశ్వర్‌గౌడ్‌, ఏఈలు చంద్రశేఖర్‌, రాంచందర్‌, మున్సిపల్‌ కౌన్సిలర్లు జక్కని సుజాత, చర్లపల్లి లక్ష్మి, ఒజ్జెల బుచ్చిరెడ్డి, మర్రి సహదేవ్‌, మన్నేఖాన్‌, పోచయ్య, రాజయ్య, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు. 


logo