శనివారం 04 ఏప్రిల్ 2020
Jagityal - Feb 24, 2020 , 00:42:09

కవులు, కళాకారులకు జగిత్యాల పుట్టినిల్లు

కవులు, కళాకారులకు జగిత్యాల పుట్టినిల్లు

జగిత్యాల టౌన్‌: కవులు, కళాకారులకు జగిత్యాల పుట్టినిల్లని, సాహిత్యం భవిష్యత్‌ తరాలకు మార్గదర్శనం కావాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని దేవిశ్రీ గార్డెన్స్‌లో సమ్మక్క-సారక్క జాతర విశిష్టతపై కవితా గానం పోటీలను కళాశ్రీ సాహితీ వేదిక ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆసియా ఖండంలో అతి పెద్ద జాతరలో ఒకటైన సమ్మక్క-సారక్క జాతర విశిష్టతపై కవితా గానం చేయడం మహాద్భుతమన్నారు. భాషపై ఆదరణ తగ్గుతున్న తరుణంలో కళాశ్రీ సాహితీ వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో కవితా పోటీలు నిర్వహించడం గొప్ప విషయమన్నారు. అదనపు కలెక్టర్‌ బేతి రాజేశం మాట్లాడుతూ.. ‘రవి గాంచని చోట కవి గాంచును’ అన్న పదానికి నిదర్శనంగా భాషపై ఉన్న అభిమానాన్ని కవి తన ఆలోచనలతో అభివర్ణిస్తాడన్నారు. ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక రాష్ర్టాల నుంచి వచ్చిన కవులు చందపద్యంలో కవితా గానం చేయడం అభినందనీయమన్నారు. 


కళాశ్రీ సాహితీ వేదిక రాష్ట్ర స్థాయిలో మరెన్నో కార్యక్రమాలు నిర్వహించి కవులు, కళాకారులకు గొప్ప గుర్తింపు తెచ్చేలా కృషి చేయాలన్నారు. పట్టణ సీఐ జయేశ్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కవులు, కళాకారులకు ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు. అనంతరం కవితా పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌, అదనపు కలెక్టర్‌ బి.రాజేశం, పట్టణ సీఐ జయేశ్‌ శాలువాతో సత్కరించి బహుమతులు అందించారు. హన్మకొండకు చెందిన రాగుల కిరణ్మయి మొదటి బహుమతి, హుజూరాబాద్‌కు చెందిన జక్కుల కృష్ణమూర్తి ద్వితీయ బహుమతి, సికింద్రాబాద్‌కు చెందిన పగిడిపెల్లి సురేందర్‌ తృతీయ బహుమతులకు ఎంపికయ్యారు. కళాశ్రీ సాహితీ వేదిక అధ్యక్షుడు గుండేటి రాజు, కవయిత్రులు మద్దెల సరోజన, అయిత అనిత, కట్కం కవిత, నమిలికొండ సాకేత, వుజగిరి జమున, రమాదేవి కులకర్ణి, ప్రభాశాస్త్రి జ్యోషిలా, ములస్తం లావణ్య, కవులు కేవీ సురేందర్‌, పసుల రవికుమార్‌, కళాకారుడు కొమురవెల్లి లక్ష్మీనారాయణ తదితరులున్నారు.


logo