గురువారం 02 ఏప్రిల్ 2020
Jagityal - Feb 22, 2020 , 03:55:35

ఓం నమ శివాయ

ఓం నమ శివాయ

(వేములవాడ, నమస్తే తెలంగాణ/ కల్చరల్‌)వేములవాడ జన శోభితమైంది. మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర నలుమూలలతోపాటు పొరుగు రాష్ర్టాల నుంచి వచ్చిన భక్తకోటితో జనసంద్రమైంది. శుక్రవారం ఒక్కరోజే సుమారు 2 లక్షల మంది తరలిరాగా, రాజన్న క్షేత్రం పోటెత్తింది. ఎటు చూసినా భారీ జనసందోహం కనిపించింది. భక్తులు ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించి, కోడెమొక్కులు చెల్లించుకున్నారు. నాలుగు గంటలపాటు క్యూలైనల్లో నిల్చుని, స్వామి వారిని దర్శించుకున్నారు. రాజేశ్వర స్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఎమ్మెల్యే దంపతులు చెన్నమనేని రమేశ్‌బాబు దంపతులు, కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ దంపతులతో కలిసి దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ పట్టువస్ర్తాలను సమర్పించారు. 


ఆనవాయితీలో భాగంగా టీటీడీ తరుఫున డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ అధికారి హరిచంద్రనాథ్‌, అర్చకులు గురువరాజు స్వామివారికి పట్టు వస్ర్తాలను అందజేశారు. 8.30 గంటలకు ఎమ్మెల్సీ నారదాసు, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో కలిసి వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్వామివారికి శేషవస్ర్తాలను సమర్పించగా, మధ్యాహ్నం 2.30 గంటలకు ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు, మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, బ్రేవరేజస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దేవీప్రసాద్‌, ఐడీసీ చైర్మన్‌ ఈద శంకర్‌ స్వామివారిని దర్శించుకున్నారు. వీరందరికీ రాజన్న ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్‌, ప్రధానార్చకులు నమిలకొండ ఉమేశ్‌, ఈశ్వరగారి సురేశ్‌ ఆధ్వర్యంలో స్వాగతం పలికి, ఆలయ అద్దాల మండపంలో అర్చకులు తీర్థప్రసాదాలను అందజేశారు. రాత్రి అనువంశిక అర్చకులు ఆలయ అద్దాల మండపంలో నిర్వహించిన మహాలింగార్చన కనులపండువను తలపించగా, అర్ధరాత్రి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. రాత్రి నిర్వహించిన శివార్చన కార్యక్రమాలు అలరించగా, భక్తులు పెద్దసంఖ్యలో తిలకించారు. 



logo