శనివారం 04 ఏప్రిల్ 2020
Jagityal - Feb 22, 2020 , 01:07:38

ఓం నమశ్శివాయ

ఓం నమశ్శివాయ

‘ఓం నమశ్శివాయ..’, ‘హరహర మహాదేవ శంభోశంకర..’ అంటూ భక్తుల శివనామస్మరణతో సుప్రసిద్ధ శైవక్షేత్రం వేములవాడ మారుమోగింది. శుక్రవారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రాజన్న సన్నిధి భక్తజనసంద్రమైంది.

  • రాజన్న సన్నిధిలో వైభవంగా మహాశివరాత్రి
  • తరలివచ్చిన 2లక్షల మంది భక్తులు
  • ప్రభుత్వం తరుఫున పట్టువస్ర్తాలు సమర్పించిన మంత్రి అల్లోల
  • టీటీడీ తరుఫున అందజేసిన డీఈఓ
  • స్వాగతం పలికిన ఎమ్మెల్యే చెన్నమనేని
  • కన్నులపండువలా మహాలింగార్చన
  • అర్ధరాత్రి ఘనంగా లింగోద్భవ వేడుక
  • స్వామివారిని దర్శించుకున్న మంత్రులు హరీశ్‌రావు, ఈటల, పలువురు ప్రముఖులు
  • పర్యవేక్షించిన కలెక్టర్‌, ఎస్పీ

‘ఓం నమశ్శివాయ..’, ‘హరహర మహాదేవ శంభోశంకర..’ అంటూ భక్తుల శివనామస్మరణతో సుప్రసిద్ధ శైవక్షేత్రం వేములవాడ మారుమోగింది. శుక్రవారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రాజన్న సన్నిధి భక్తజనసంద్రమైంది. తరలివచ్చిన రెండు లక్షల మంది భక్తులతో ఎటు చూసినా జనసందోహమే కనిపించింది. రాజరాజేశ్వరస్వామికి రాష్ట్ర ప్రభుత్వం తరుఫున ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు, కలెక్టర్‌తో కలిసి దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు, దేవాదాయశాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ పట్టువస్ర్తాలు సమర్పించారు. ఆనవాయితీలో భాగంగా టీటీడీ తరుఫున డీఈవో హరిచంద్రనాథ్‌, అర్చకులు గురువరాజు స్వామివారికి పట్టు వస్ర్తాలు అందజేశారు. మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌తో ఎమ్మెల్యేలు, పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకోగా, రాత్రి అనువంశిక అర్చకులతో ఆలయ అద్దాల మండపంలో మహాలింగార్చనను, అర్ధరాత్రి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. 


(వేములవాడ, నమస్తే తెలంగాణ/ కల్చరల్‌): వేములవాడ జన శోభితమైంది. మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర నలుమూలలతోపాటు పొరుగు రాష్ర్టాల నుంచి వచ్చిన భక్తకోటితో జనసంద్రమైంది. శుక్రవారం ఒక్కరోజే సుమారు 2 లక్షల మంది తరలిరాగా, రాజన్న క్షేత్రం పోటెత్తింది. ఎటు చూసినా భారీ జనసందోహం కనిపించింది. భక్తులు ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించి, కోడెమొక్కులు చెల్లించుకున్నారు. నాలుగు గంటలపాటు క్యూలైనల్లో నిల్చుని, స్వామి వారిని దర్శించుకున్నారు. రాజేశ్వర స్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఎమ్మెల్యే దంపతులు చెన్నమనేని రమేశ్‌బాబు దంపతులు, కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ దంపతులతో కలిసి దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ పట్టువస్ర్తాలను సమర్పించారు. ఆనవాయితీలో భాగంగా టీటీడీ తరుఫున డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ అధికారి హరిచంద్రనాథ్‌, అర్చకులు గురువరాజు స్వామివారికి పట్టు వస్ర్తాలను అందజేశారు. 


8.30 గంటలకు ఎమ్మెల్సీ నారదాసు, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో కలిసి వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్వామివారికి శేషవస్ర్తాలను సమర్పించగా, మధ్యాహ్నం 2.30 గంటలకు ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు, మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, బ్రేవరేజస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దేవీప్రసాద్‌, ఐడీసీ చైర్మన్‌ ఈద శంకర్‌ స్వామివారిని దర్శించుకున్నారు. వీరందరికీ రాజన్న ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్‌, ప్రధానార్చకులు నమిలకొండ ఉమేశ్‌, ఈశ్వరగారి సురేశ్‌ ఆధ్వర్యంలో స్వాగతం పలికి, ఆలయ అద్దాల మండపంలో అర్చకులు తీర్థప్రసాదాలను అందజేశారు. రాత్రి అనువంశిక అర్చకులు ఆలయ అద్దాల మండపంలో నిర్వహించిన మహాలింగార్చన కనులపండువను తలపించగా, అర్ధరాత్రి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. రాత్రి నిర్వహించిన శివార్చన కార్యక్రమాలు అలరించగా, భక్తులు పెద్దసంఖ్యలో తిలకించారు. 


logo