శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Jagityal - Feb 21, 2020 , 04:33:05

సంకల్ప బలంతో ఏదైనా సాధ్యమే

సంకల్ప బలంతో ఏదైనా సాధ్యమే

పనిచేయాలనే సంకల్పం ఉంటే సాధ్యం కానిదేదీ లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలో గురువారం జరిగిన పట్టణ ప్రగతి అవగాహన సదస్సు, పంచాయతీ రాజ్‌ సమ్మేళనంలో రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి పాల్గొన్నారు.

  • మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పనే ధ్యేయం
  • పర్యావరణ పరిరక్షణకే హరితహారం
  • ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే మిషన్‌ భగీరథ నీరు
  • రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌
  • నిజాయితీగా పనిచేస్తే చట్టాలకు భయపడాల్సిన పని లేదు
  • ప్రజాశ్రేయస్సు కోసమే ప్రజాప్రతినిధులు పనిచేయాలి
  • పల్లె ప్రగతి దేశానికే ఆదర్శం
  • రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌
  • జిల్లా కేంద్రంలో పంచాయతీ రాజ్‌ సమ్మేళనం, పట్టణ ప్రగతిపై అవగాహన సదస్సు
  • పాల్గొన్న ఎమ్మెల్యే సంజయ్‌, జడ్పీ అధ్యక్షురాలు వసంత, కలెక్టర్‌ రవి
  • హాజరైన బల్దియా అధ్యక్షులు, కౌన్సిలర్లు, స్థానిక సంస్థల పాలకులు

పనిచేయాలనే సంకల్పం ఉంటే సాధ్యం కానిదేదీ లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలో గురువారం జరిగిన పట్టణ ప్రగతి అవగాహన సదస్సు, పంచాయతీ రాజ్‌ సమ్మేళనంలో రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి పాల్గొన్నారు. సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందు చూపుతో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని రూపొందించారనీ, అధికారులు, పాలకులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మంత్రి కొప్పుల మాట్లాడుతూ సర్కారు ప్రవేశపెట్టిన పల్లె ప్రగతితో సర్పంచులు తలెత్తుకొని తిరిగే గౌరవం కలిగిందనీ, నిజాయితీగా పనిచేస్తే ఎలాంటి చట్టాలకూ భయపడాల్సిన పనిలేదని పేర్కొన్నారు. 

   -జగిత్యాల, నమస్తే తెలంగాణ/జగిత్యాల రూరల్‌/జగిత్యాల అర్బన్‌ 


జగిత్యాల, నమస్తే తెలంగాణ/జగిత్యాల అర్బన్‌ : పనిచేయాలనే సంకల్ప బలం ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. పట్టణ ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై జిల్లా కేంద్రంలోని సు మంగళి గార్డెన్స్‌లో గురువారం నిర్వహించిన అవగాహన సదస్సుకు మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలి సి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ మున్సిపాలిటీల్లో సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్‌ ముందు చూపుతో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని రూపొందించారని చెప్పారు. గత పాలకుల నిర్లక్ష్యంతో సమస్యలు ఎక్కడివక్కడే ఉన్నాయనీ, వార్డుల్లో సమస్యలు పరిష్కారమైతే పట్టణం పరిశుభ్రంగా ఉంటుందని, పట్టణం పరిశుభ్రంగా ఉంటే రాష్ట్రం పరిశుభ్రంగా మారుతుందన్నారు. గత ప్రభుత్వాలు అరచేతిలో వైకుంఠం, గాలిలో మేడలు కడుతూ సమస్యలను పక్కదారి పట్టించాయని విమర్శించారు. తెలంగాణ కోసం ఉద్యమం చేపట్టిన కేసీఆర్‌ను చూసి ఎగతాళి చేశారనీ, అయినా సమస్యలకు ఎదురొడ్డి పోరాడి రాష్ర్టాన్ని సాధించుకున్నామన్నారు. ఉద్యమంలో నిజాయితీ, చిత్తశుద్ధి ఉంది కాబట్టే రాష్ట్రం సాధించామన్నారు. ప్రజా సమస్యలపై చిత్తశుద్ధితో పోరాడుతూ అభివృద్ధి బాటలో రాష్ర్టాన్ని ముందంజలో ఉంచామన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నదనీ, కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ జలకళను సంతరించుకుందన్నారు. 


తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే చీకటి రాజ్యమేలుతుందని ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి విషం చిమ్మాడనీ, కేసీఆర్‌ దృఢసంకల్పంతో విద్యుత్‌ సమస్యను రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి సంవత్సరంలోనే అధిగమించామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 100కు పైగా సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించామనీ, 29వ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ, దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచిందన్నారు. జల సాధనే ధ్యేయంగా పనిచేస్తున్న రాజేంద్ర సింగ్‌ తెలంగాణ రాష్ట్రంలో పర్యటించి, దేశంలోని అన్ని రాష్ర్టాలు తెలంగాణను చూసి నేర్చుకోవాలని కితాబునిచ్చారని గుర్తు చేశారు. 24గంటల విద్యుత్‌, నీటి పారుదల, మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ వంటి పథకాలతో పక్క రాష్ర్టాలకు అందనంత ఎత్తుకు ఎదిగిపోయామన్నారు. గతంలో వేసవి కాలం వచ్చిదంటే మంచినీటికి ఇబ్బందులు ఉండేవన్నారు. ప్రజలకు శుద్ధమైన నీరు అందించడమే లక్ష్యంగా మిషన్‌ భగీరథ పథకాన్ని చేపట్టామన్నారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా పట్టణ ప్రగతి ప్రణాళికతో ముందుకు వెళ్తామన్నారు. 


పల్లె ప్రగతి స్ఫూర్తితో సాగాలి : మంత్రి ఈశ్వర్‌

రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతూ పల్లె ప్రగతిని ఎలాగైతే ప్రజలు ఆదరించారో, పట్టణ ప్రణాళికను కూడా అలానే ఆదరించాలనీ, పల్లె ప్రగతి స్ఫూర్తితో ముందుకు సాగాలని పేర్కొన్నారు. 60 ఏళ్లుగా పేరుకుపోయిన చెత్తను పల్లె ప్రగతిలో శుభ్రం చేసుకున్నామని గుర్తుచేశారు. ప్రతి వార్డును ఒక గ్రామంగా వార్డు కౌన్సిలర్లు తీసుకొని, ఆ వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని సూచించారు. పల్లె ప్రగతితో గ్రామాల్లో సుమారు 60 శాతానికి పైగా సమస్యలు పరిష్కారమయ్యాయనీ, ఇప్పుడు గ్రామాల్లోకి వెళితే పారిశుధ్యం, మొక్కల పెంపకంతో నందనవనాలను తలపిస్తున్నాయన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో 134 వార్డులకు గాను 8,040 మందికి పైగా కమిటీ సభ్యులు పర్యవేక్షిస్తారన్నారు. 5 వార్డులకు ఒక ప్రత్యేకాధికారిని నియమిస్తారని, ఆయా వార్డుల్లో సమస్యల పరిష్కారం కోసం జిల్లా అధికారి పనిచేస్తారని చెప్పారు. పట్టణాల బాగోగుల కోసం 14వ ఆర్థిక సంఘం నిధులు కూడా త్వరలో ప్రభుత్వం విడుదల చేస్తుందని, దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక నిధులు కేటాయిస్తుందని చెప్పారు. ఈ నెల 24 నుంచి మార్చి 4వరకు జరిగే పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములను చేసుకొని విజయవంతం చేయాలన్నారు. నిజాయతీగా పనిచేసే ప్రజాప్రతినిధులు చట్టాలకు భయపడాల్సిన పని లేదన్నారు. విద్యుత్‌ అధికారులు ప్రతి వార్డును తనిఖీ చేసి సమస్యను పరిష్కరిస్తారని చెప్పారు. గత మూడేళ్లుగా 20 అంశాల్లో రాష్ట్రంలోనే జిల్లా నంబర్‌ వన్‌ స్థానంలో నిలచిందనీ, పట్టణ ప్రగతిలోనూ నంబర్‌వన్‌ స్థానం పొందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. 


పట్టణాలను బాగుచేసుకొనేందుకే.. : ఎమ్మెల్యే సంజయ్‌

ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ పట్టణాలను బాగుచేసుకునేందుకు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు. వార్డు సభ్యులుగా గెలుపొందిన వారు తమ వార్డులను అభివృద్ధి చేసుకునే లక్ష్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. జగిత్యాల మున్సిపాలిటీగా ఏర్పడిన తర్వాత 10 సార్లు కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిందనీ, పట్టణంలో మాత్రం ఇప్పటికీ సమస్యలు అలాగే ఉన్నాయన్నారు. సుమారు 1.10లక్షకు పైగా జనాభా ఉన్నా, రోడ్లు విశాలంగా లేవన్నారు. మురుగు కాలువల నీరు చెరువులు, వాగుల్లో కలువడం ద్వారా నీరు కలుషితమవుతున్నదని చెప్పారు. రోడ్లు, వీధి దీపాలు, పారిశుధ్యం బాగుండేలా చర్యలు చేపట్టాలన్నారు. 


ప్రగతి నిరంతరం : కలెక్టర్‌ రవి

కలెక్టర్‌ రవి మాట్లాడుతూ పల్లె ప్రగతిలో మొదటి, రెండో విడత పనులు పూర్తయ్యాయనీ, మరికొన్ని పనులు త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. పల్లె ప్రగతి అనేది నిరంతర కార్యక్రమమనీ, వైకుంఠధామం, డంప్‌యార్డు, సోక్‌ పిట్స్‌, కిచెన్‌ షెడ్‌లను వాడుకలోకి తెచ్చేలా చూడాలన్నారు. అనంతరం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల నుంచి గెలుపొందిన వార్డు కౌన్సిలర్లకు మున్సిపల్‌ చట్టం, పట్టణ ప్రగతిపై అవగాహన కల్పించారు. 


పట్టణాభివృద్ధి మన చేతుల్లోనే : మున్సిపల్‌ అధ్యక్షులు

పట్టణాల అభివృద్ధి మన చేతుల్లోనే ఉందని, అందరి సహాయ సహకారాలతో స్వచ్ఛ, హరిత పట్టణాలుగా తీర్చిదిద్దుతామని జగిత్యాల, మెట్‌పెల్లి, ధర్మపురి, రాయికల్‌ మున్సిపాలిటీల అధ్యక్షులు బోగ శ్రావణి, రాణవేని సుజాత, సంగి సత్తెమ్మ, మోర హనుమాండ్లు అన్నారు. పట్టణ ప్రగతి సదస్సులో వారు మాట్లాడుతూ మున్సిపాలిటీల్లో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయనీ, వాటిని తొలగించేందుకు కలిసికట్టుగా పనిచేయడమే మార్గమన్నారు. కొత్తగా ఎన్నికయిన మున్సిపల్‌ పాలక వర్గాలకు పట్టణ ప్రగతి ప్రణాళికపై అవగాహన సదస్సు నిర్వహించడం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందనీ, మంత్రులు, ఎమ్మెల్యేల దిశానిర్దేశంలో రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్తామన్నారు. అనంతరం పట్టణ ప్రగతి ప్రణాళికపై మున్సిపల్‌ అధ్యక్షులకు, కౌన్సిలర్లకు మాస్టర్‌ ట్రైనర్లు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత, అదనపు కలెక్టర్‌ బేతి రాజేశం, మున్సిపల్‌ కమిషనర్లు, అధికారులు పాల్గొన్నారు.  


logo