శనివారం 04 ఏప్రిల్ 2020
Jagityal - Feb 21, 2020 , 04:24:29

దిగ్విజయంగా ఎత్తిపోతలు

దిగ్విజయంగా ఎత్తిపోతలు

కాళేశ్వరం ప్రాజెక్ట్‌ లింక్‌-1, 2లలో గోదారి జలాల ఎత్తిపోతలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. గురువారం పెద్దపల్లి జిల్లా మంథని మండలం కాసిపేటలోని సరస్వతి పంప్‌హౌస్‌లో అధికారులు 6, 7పంపులు నడిపిస్తూ, మంథని మండలం సిరిపురంలోని పార్వతి బరాజ్‌లోకి నీటిని ఎత్తిపోస్తున్నారు.

  • కాళేశ్వరం లింక్‌-1, 2లో నిరంతరాయంగా నడుస్తున్న మోటర్లు

పెద్దపల్లి ప్రతినిధి/ తిమ్మాపూర్‌, నమస్తే తెలంగాణ/ రామడుగు/ ధర్మారం/ మల్యాల/ బోయినపల్లి): కాళేశ్వరం ప్రాజెక్ట్‌ లింక్‌-1, 2లలో గోదారి జలాల ఎత్తిపోతలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. గురువారం పెద్దపల్లి జిల్లా మంథని మండలం కాసిపేటలోని సరస్వతి పంప్‌హౌస్‌లో అధికారులు 6, 7పంపులు నడిపిస్తూ, మంథని మండలం సిరిపురంలోని పార్వతి బరాజ్‌లోకి నీటిని ఎత్తిపోస్తున్నారు. ఇక అంతర్గాం మండలంలోని గోలివాడలో నిర్మించిన పార్వతీ పంప్‌హౌస్‌ 3, 6, 7, 8 మోటర్ల ద్వారా ఎల్లంపల్లి బరాజ్‌లోకి నీటిని ఎత్తిపోస్తున్నారు. ఇటు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలోని 6వ ప్యాకేజీలో నంది పంప్‌హౌస్‌లో ఎత్తిపోతలు దిగ్విజయంగా కొనసాగుతున్నాయి. బుధవారం రాత్రి వరకు 4,5, 6 మోటర్ల ద్వారా నీటిని ఎత్తిపోసిన అధికారులు, గురువారం 4వ మోటర్‌ను నిలిపివేసి, 5, 6 మోటర్ల ద్వారా 6300 క్యూసెక్కుల నీటిని నంది రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తున్నట్లు అధికారులు తెలిపారు. నంది రిజర్వాయర్‌ నుంచి 7వ ప్యాకేజీలోని జంట సొరంగాల ద్వారా 8 ప్యాకేజీలోని కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని గాయత్రీ పంప్‌హౌస్‌కు తరలుతున్నాయి. ఇక్కడా 2, 3 పంపుల ద్వారా 6300 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. ఇక్కడి నుంచి అటు ఎస్సారార్‌ రిజర్వాయర్‌తోపాటు ఎస్సారెస్పీ పునర్జీవన పథకానికి నీటిని తరలిస్తున్నారు. కాగా,  గురువారం సాయంత్రం వరకు గాయత్రి పంప్‌హౌస్‌ నుంచి 7.08 టీఎంసీలు ఎత్తిపోసినట్లు అధికారులు తెలిపారు. ఎత్తిపోతల ప్రక్రియను ప్రాజెక్టు ఈఎన్సీ నల్లా వేంకటేశ్వర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ ఏఈఈలు శ్రీనివాస్‌, వైద సురేష్‌కుమార్‌, రమేష్‌నాయక్‌, వెంకటేష్‌, వరదకాలువ ఏఈఈ తిరుపతి, మెగా ఏజెన్సీ ప్రతినిధులు ఉన్నారు.


ఎస్సారార్‌ నుంచి 8,100 క్యూసెక్కులు విడుదల

రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం శ్రీ రాజరాజేశ్వర జలాశయం నుంచి ఎల్‌ఎండీకి గురువారం 8,100 క్యూసెక్కుల నీటిని పంపించారు. నాలుగు రివర్స్‌ స్లూయిస్‌ గేట్ల ద్వారా దిగువకు నీటిని పంపుతున్నారు. శ్రీ రాజరాజేశ్వర జలాశయంలో 25టీఎంసీల నీరు నిలువ ఉన్నది. లక్ష్మీపూర్‌ పంపు హౌస్‌ నుంచి వచ్చిన నీటిని జలాశయం నుంచి యథావిధిగా దిగువకు వదలుతున్నట్లు ఇంజినీరింగ్‌ అధికారులు తెలిపారు.  


ఎల్‌ఎండీ @ 11.1 టీఎంసీలు 

ఎస్సారార్‌ జలాశయం స్లూయిస్‌ నుంచి ఇన్‌ఫ్లో కొనసాగుతుండడంతో తిమ్మాపూర్‌ మండలంలోని ఎల్‌ఎండీలో నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఎల్‌ఎండీ రిజర్వాయర్‌లోకి 9004 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో రూపంగా వస్తుండగా, 3773 క్యూసెక్కుల నీరు అవుట్‌ఫ్లో రూపంలో బయటికి వెళ్తుంది. ఎల్‌ఎండీలో ప్రస్తుతం 11.166 టీఎంసీలు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. 


ఇటు ఎస్సారార్‌కు.. అటు వరద కాలువకు.. 

ఎస్సారెస్పీ పునర్జీవ పథకంలో భాగంగా వరద కాలువలో టీఎంసీ నీటిని ఎత్తిపోసి చెరువులు కుంటలు నింపేందుకు రాంపూర్‌, రాజేశ్వరరావుపేట పంప్‌హౌస్‌లను నడిపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు గాయత్రి పంప్‌హౌస్‌లో 2,3 పంపుల ద్వారా నీటిని పంపింగ్‌ చేస్తుండగా, వరదకాలువకు 99 కిలోమీటర్‌ వద్ద ఏర్పా టు చేసిన జంక్షన్‌పాయింట్‌ చేరుకొని అక్కడి నుం చి కుడి, ఎడమలకు తరలుతున్నాయి. ఈ మేరకు షానగర్‌ సమీపంలోని వరదకాలువకు 102 కిలోమీటర్‌ వద్ద నిర్మించిన హెడ్‌రెగ్యూలేటర్‌ గేట్లను సంబంధిత ఇంజనీరింగ్‌ అధికారులు కొంత మేర కిందికి దించడంతో స్థానిక వరదకాలువతో పాటు గ్రావిటీ కాలువలో నీరు నిండుగా వెళుతున్నది. ఇటు ఎస్సారార్‌కు సుమారు 2వేల క్యూసెక్కులు, పునర్జీవ పథకంలో భాగంగా ఎగువన రాంపూర్‌ పంప్‌హౌస్‌కు 4,500 క్యూసెక్కులు తరలుతున్నాయని వరదకాలువ ఏఈఈ తిరుపతి తెలిపారు.  


రాంపూర్‌లో రెండు మోటర్లు రన్నింగ్‌.. 

ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంలో భాగంగా కాళేశ్వరం జలాలను వరద కాలువ ద్వారా ఎగువకు విస్తరిస్తూ, రాంపూర్‌ పంప్‌హౌస్‌కు చేరుతుండగా, ఇక్కడి నుంచి ఎగువకు ఎత్తిపోస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి దాటాక వరద కాలువ ఈఈ సుధాకిరణ్‌ ఆధ్వర్యంలో రాంపూర్‌ పంప్‌హౌస్‌లోని 3,4 మోటర్లను నడిపించిన అధికారులు, గురువారం ఉదయం వాటిని నిలిపివేసి 3, 7 మోటర్లను ఆన్‌ చేశారు. గాయత్రి పంప్‌హౌస్‌ నుంచి వచ్చే నీటిని సర్జ్‌పూల్‌లో నిల్వ చేస్తూ ఎగువకు ఎప్పటికప్పుడు ఎత్తిపోస్తున్నామనీ, మరింత నీటి మట్టం పెరిగితే మరో మోటర్‌ను ఆన్‌ చేస్తామని వరద కాలువ ఈఈ తెలిపారు. మరింత నీటి మట్టం పెరిగితే మరో మోటారును ప్రారంభించే అవకాశం ఉందన్నారు. వరద కాలువలో టీఎంసీ నీటిని ఎత్తిపోసి, తూముల ద్వారా చెరువులను నింపేందుకు గానూ నీటిని పంపింగ్‌ చేస్తున్నామన్నారు. గురువారం రాత్రి వరకు రాజేశ్వర్‌రావుపేట పంప్‌హౌజ్‌ను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.


logo