సోమవారం 30 మార్చి 2020
Jagityal - Feb 20, 2020 , 03:03:03

వరదకాలువకు కాళేశ్వర జలాలు

వరదకాలువకు కాళేశ్వర జలాలు


(కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ)శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు అనుబంధంగా నిర్మించిన వరద కాలువకు నీరులేక నిరుపయోగంగా మారే దశకు చేరుకుంది. కాళేశ్వరం నీటిని వరదకాలువ ద్వారా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు ఎత్తిపోసే ఎస్పారెస్పీ ప్రాజెక్టు పునర్జీవ పథకాన్ని సీఎం కేసీఆర్‌ రూపొందించారు. రూ.1067 కోట్లతో 2018 ఆగస్టులో సీఎం కేసీఆర్‌ బాల్కొండ వద్ద పనులు ప్రారంభించారు. ప్రతికూల పరిస్థితుల్లో ఒకవేళ వర్షాలు కురవక, గోదావరి ఎగువ నుంచి ఎస్పారెస్పీకి నీరు రాకపోతే కాళేశ్వరం జలాలను ఎత్తిపోసేందుకు జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్‌ శివారులో వరదకాలువ 73 కిలోమీటర్‌ వద్ద ఒక పంప్‌హౌస్‌, 34 కిలోమీటర్‌ ఇబ్రహీంపట్నం రాజేశ్వర్‌రావుపేట మరో పంపుహౌస్‌ నిర్మించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు వరద కాలువను నిండుకుండలా మార్చేందుకు బుధవారం రాత్రి నుంచి రాంపూర్‌ పంప్‌హౌస్‌లో రెండు మోటర్లతో నీటిని ఎత్తి పోయిస్తున్నారు. వరద కాలువలో ద్వారా ఉమ్మడి జిల్లా పరిధిలోని ధర్మపురి, చొప్పదండి, వేములవాడ, కరీంనగర్‌ నియోజకవర్గాల పరిధిలోని లక్ష ఎకరాలకు సాగు నీరు అందనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి పుష్కలంగా నీరు వస్తున్న క్రమంలో గురువారం ఎల్లంపల్లి నుంచి కూడా వరద కాలువకు నీటిని ఎత్తిపోస్తామని ఈఎన్‌సీ అనిల్‌ కుమార్‌ తెలిపారు.


వరద కాలువ ద్వారా చెరువులకు.. 

సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాంపూర్‌, రాజేశ్వర్‌ రావుపేట పంప్‌హౌస్‌ల నుంచి నీటిని ఎత్తి పోయిస్తుండగా, వరద కాలువలో అవసరాన్ని నీటిని నిలువ చేస్తామని అధికారులు చెబుతున్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో ఒక టీఎంసీ నీటిని వరద కాలువలో ఎత్తి పోసేందుకు ప్రస్తుతం ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్న వరద కాలువకు 35 తూములు నిర్మించారు. ఈ తూముల ద్వారా ఆయా నియోజకవర్గాల పరిధిలో ఉన్న 50 ప్రధాన చెరువులను నీటితో నింపనున్నారు. ప్రధానంగా గంగాధర మండలంలోని నారాయణపూర్‌, కొడిమ్యాల మండలంలోని మైసమ్మ చెరువు, పోతారం రిజర్వాయర్లకు నీటిని మళ్లిస్తారు. ఈ చెరువుల ద్వారా కరీంనగర్‌ జిల్లా పరిధిలోని గంగాధర, రామడుగు, జగిత్యాల జిల్లాలోని కొడిమ్యాల, మల్యాల మండలాల పరిధిలోని 30 వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందిస్తారు. ఇవి కాకుండా వేములవాడ నియోజకవర్గంలోని పలు మండలాలకు కూడా సాగు నీరు అందిస్తారు. కొడిమ్యాల మండలంలోని మైసమ్మ చెరువు నుంచి వేములవాడ మండలం ఫాజుల్‌నగర్‌ చెరువు నుంచి వేములవాడ నియోజకవర్గంలోకి నీటిని మళ్లిస్తారు. ప్రస్తుతం ఈ రెండు నియోజకవర్గాలకు నీటిని అందించాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. అయితే ప్రధానంగా ఉన్న 50 చెరువుల కింద సుమారు 300 వరకు ఉన్న గొలుసుకట్టు చెరువులను కూడా కాళేశ్వరం జలాలతో నింపే అవకాశాలు ఉన్నాయి. 


రెండోసారి కరుణించిన సీఎం.. 

కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాను నీటి కూడలిగా మార్చిన సీఎం కేసీఆర్‌, సాగు నీరు అందని బీడు పొలాలకు నీళ్లు మళ్లించే బృహత్తర కార్యక్రమాన్ని వరద కాలువ ద్వారా చేపడుతున్నారు. గతేడాది కూడా ఇదే మాదిరిగా వరద కాలువ ద్వారా నీటిని మళ్లించడంవల్ల కరీంనగర్‌, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల పరిధిలోని వేలాది ఎకరాలకు సాగు నీరు అందింది. తన నియోజకవర్గంలోని బీడు భూములకు వరద కాలువ ద్వారా నీటిని అందించాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ కోరడంతో ‘నీ పెళ్లి రోజు కానుకగా నీటిని విడుదల చేయిస్తానని’ చెప్పి అప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో చొప్పదండి, వేములవాడ నియోజకవర్గాల్లోని బీళ్లుగా ఉన్న వేలాది ఎకరాలు సాగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో మరోసారి యాసంగిలోనే వరద కాలువను నింపడంతో పాటు తూముల ద్వారా చెరువుల్లోకి నీటిని మళ్లించాలని అధికారులకు సీఎం ఆదేశాలు ఇవ్వడంతో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నారు.

logo