శనివారం 04 ఏప్రిల్ 2020
Jagityal - Feb 18, 2020 , 01:55:35

శివరాత్రికి 600 బస్సులు

 శివరాత్రికి 600 బస్సులు

వేములవాడ రూరల్‌ : మహాశివరాత్రి జాతర కోసం వేములవాడకు 600 బస్సులను నడిపించనున్నట్లు కరీంనగర్‌ రీజనల్‌ మేనేజర్‌ జీవన్‌ ప్రసాద్‌ తెలిపారు. మహాశివరాత్రి  జాతర సందర్భంగా సోమవారం వేములవాడ ఆర్టీసీ డిపో కార్యాలయంలో బస్సు సర్వీస్‌, ఏర్పాట్లపై విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 20, 21, 22 తేదీల్లో జాతర జరగనుందనీ, ఇందు కోసం వరంగల్‌, నిజామాబాద్‌, నిర్మల్‌, ఆర్మూర్‌, కామారెడ్డి, సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, మెట్‌పల్లి, కరీంనగర్‌, జగిత్యాల ప్రాంతాల నుండి 600 బస్సులను నడిపించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. 20న 190, 21న 190, 22న 220 బస్సు సర్వీస్‌లను ఆయా రూట్లలో నడిపిస్తామన్నారు. వేములవాడలోని జగిత్యాల బస్టాండ్‌ నుండి కోరుట్ల, జగిత్యాల, నిజామాబాద్‌, నిర్మల్‌, ఆర్మూర్‌ ప్రాంతాలకు బస్సులు నడుస్తాయనీ, వేములవాడ బస్టాండ్‌ నుండి కరీంనగర్‌, వరంగల్‌, కామారెడ్డి, సిరిసిల్ల ప్రాంతాలకు బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. 


ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా ఆర్టీసీ ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం, తాగునీటి వసతి ఏర్పాటు చేస్తామన్నారు. డిపో మేనేజర్ల పర్యవేక్షణలో బస్సుల రాకపోకలు జరుగుతాయనీ వెల్లడించారు. అలాగే జిల్లా అధికారులు, రాజన్న ఆలయ అధికారులు సూచన మేరకు తిప్పాపూర్‌ బస్టాండ్‌ నుండి రాజన్న ఆలయ వరకు 10 మినీ పల్లెవెలుగు బస్సులను ఉచితంగా 24 గంటలు నడిపిస్తున్నామన్నారు. ఈ సంవత్సరం ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా బస్సులను అలంకరిస్తామని వెల్లడించారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో వేములవాడతో పాటు కాళేశ్వరం, దుబ్బరాజేశ్వరస్వామి, వేలాలకు ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నామనీ ఆర్‌ఎం వెల్లడించారు. జగిత్యాల నుండి దుబ్బరాజేశ్వరస్వామి దేవస్థానానికి ప్రతి రోజూ 6 బస్సులు, వేలాలకు గోదావరిఖని నుండి 30, మంథని నుండి 15 బస్సులు ఉంటాయన్నారు. కాళేశ్వరానికి మంథని నుండి ప్రతి రోజు 50 బస్సులు, కరీంనగర్‌, గోదావరిఖని నుండి 20 బస్సు సర్వీసులను నడిపిస్తున్నామన్నారు. కాళేశ్వరానికి ఎక్కువగా మహారాష్ట్రలోని సిరోంచ నుండి భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రతి రోజు సిరోంచ నుండి మంథని వరకు బస్సు సర్వీసులు ఉంటాయన్నారు. 


ప్రత్యేక బస్సులకు అదనంగా చార్జీలు

వేములవాడతోపాటు కాళేశ్వరం, దుబ్బరాజేశ్వరస్వామి, వేలాలకు వెళ్లే ప్రత్యేక బస్సులకు అదనంగా చార్జీలు వసూలు చేస్తామనీ ఆర్‌ఎం వెల్లడించారు. సాధారణ సర్వీసుల నుండి ఎలాంటి అదనపు చార్జీలూ ఉండవన్నారు. జాతర స్పెషల్‌ బస్సులకు 1.25 శాతం అదనపు చార్జీలు వసూలు చేస్తామన్నారు. వరంగల్‌ నుండి వేములవాడకు వచ్చే ప్రత్యేక బస్సులకు 25 శాతం వసూలు చేయడానికి నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని కోరారు. సమావేశంలో కరీంనగర్‌ డివిజనల్‌ మేనేజర్‌ కిరణ్‌కుమార్‌, జగిత్యాల డివిజనల్‌ మేనేజర్‌ నాగేశ్వరావు, వేములవాడ డిపో మేనేజర్‌ భూపతిరెడ్డి, సిరిసిల్ల డిపో మేనేజర్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.


logo