ఆదివారం 23 ఫిబ్రవరి 2020
‘సహకార’ సమరం నేడే

‘సహకార’ సమరం నేడే

Feb 15, 2020 , 00:12:52
PRINT
‘సహకార’  సమరం నేడే
  • సర్వం సిద్ధం చేసిన అధికారులు
  • ఆయాచోట్ల పాఠశాలలకు సెలవు
  • కేంద్రాలకు తరలిన సిబ్బంది
  • ఉదయం 7నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటింగ్‌
  • మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు
  • 16న ఆఫీస్‌ బేరర్ల ఎన్నిక

(జగిత్యాల టౌన్‌)జిల్లాలో మొత్తం 51 సహకార సం ఘాలకు ఎన్నికల నోటీసు ఇవ్వగా ఐదు సంఘాలు ఏకగ్రీవమయ్యాయి. మొత్తం సంఘాల పరిధిలో 651ప్రాదేశిక నియోజకవర్గాలుండగా 302డైరెక్టర్‌ స్థానాలకు ఏకగ్రీవం కాగా మిగతా 349 పదవులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల కోసం ఈ నెల 6 నుంచి నామినేషన్లు స్వీకరించారు. శనివారం ఉదయం 7.00 నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 51సహకార సంఘాల పరిధిలో మొంత్తం 26,913 మంది సభ్యులు ఓటు హక్కు కలిగి ఉన్నారు. మధాహ్నం ఒంటి గంట వరకు ఎన్నికలు ముగిసిన తర్వాత భోజనం చేసి వెంటనే ఓట్ల లెక్కింపు చేపడతారు. డైరెక్టర్లుగా ఎన్నికైన వారి వివరాలను ప్రకటిస్తారు. కాగా, ఆదివారం చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికలు నిర్వహిస్తామని డీసీఓ తెలిపారు. 


 ఏకగ్రీవాలతో తప్పిన భారం

సహకార సంఘాల ఎన్నికలు మునుపెన్నడూ లేని విధంగా 302 డైరెక్టర్‌ పదవులు ఏకగ్రీవం కావడంతో ఎన్నికల నిర్వహణ భారం పెద్ద మొత్తంలో తప్పింది.  ఏకగ్రీవాల సంఖ్య పెరగడంతో బ్యాలెట్‌ పత్రాల ముద్రణ, సిబ్బంది కేటాయింపు తదితర ఆర్థిక భారం కూడా తప్పినట్లు అధికారులు తెలిపారు.


పకడ్బందీగా ఏర్పాట్లు 

ఏకగ్రీవాలు పోను మిగతా 349 డైరెక్టర్‌ పదవులకు నిర్వహిస్తున్న ఎన్నికల కోసం అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఆయా సహకార సంఘాల కార్యాలయాలు ఉన్న చోటనే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఎన్నికలు జరిగే చోట పాఠశాలలకు శనివారం సెలవులు ప్రకటించారు. ఎన్నికల నిర్వహణ కోసం పీఓలు, ఏపీలు కలిపి 880 మంది విధులు నిర్వహిస్తున్నారు. మొత్తం 46పోలింగ్‌ కేంద్రాలు సిద్ధం చేశారు. అన్ని చోట్లా కావాల్సిన సదుపాయలు కల్పించారు. నీడ, తాగు నీటి వసతితోపాటు తాత్కాలిక మూత్రశాలలు, దివ్యాంగుల కోసం ప్రత్యేక ర్యాంపులు ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణ కోసం బ్యాలెట్‌ బాక్స్‌లను సిద్ధం చేసుకున్న అధికారులు ఏకగ్రీవాలు పెరగడంతో అవసరమైన వాటిని మాత్రమే వాడుకుంటున్నారు. ఎన్నికల సామగ్రిని శుక్రవారం జిల్లా కేంద్రంలో, కోరుట్లలో పంపిణీ చేశారు.  ఎన్నికల సామగ్రిని ఆయా పోలింగ్‌ కేంద్రాలకు చేర్చేందుకు మొత్తం 10 జోన్లు, 17 రూట్లుగా విభజించారు.  శుక్రవారం మధ్యాహ్నం నుంచే ఎన్నికల సిబ్బంది వారికి కేటాయించిన పోలింగ్‌ కేంద్రాలకు తరలి వెళ్లారు.


 రేపు ఆఫీస్‌బేరర్ల ఎన్నికలు

సహకార సంఘాల ఎన్నికలు శనివారం ఉదయం 7.00 నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు జరుగుతాయి. ఎన్నికల సిబ్బంది భోజన విరామానికి గంట సమయం కేటాయించారు. మధ్యాహ్నం 2.00 గంటల నుంచి తిరిగి ఓట్లు లెక్కిస్తారు. ఒక్కో ప్రాదేశిక నియోజకవర్గంలో తక్కువ ఓట్లు మాత్రమే ఉండడంతో లెక్కింపు త్వరగా పూర్తయ్యే అవకాశాలున్నాయి. ఇదే రోజు ఓటింగ్‌, ఏకగ్రీవం ద్వారా విజైతలైన వారికి ధ్రువీకరణ పత్రాలు అందిస్తారు. కాగా, ఆదివారం ఆఫీస్‌ బేరర్లుగా వ్యవహరిస్తున్న చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులకు ఎన్నికలు నిర్వహిస్తారు. సంఘం పరిధిలో ఎన్నికైన డైరెక్టర్లు వీరిని ఎన్నుకుంటారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎన్నికైన డైరెక్టర్లకు ఆయా సంఘాల్లో ప్రత్యేక సమావేశానికి హాజరు కావాలని అధికారులు నోటీసులు జారీ చేస్తారు. 


రాయికల్‌లో 45వార్డులకు

రాయికల్‌ రూరల్‌ : రాయికల్‌ మండలంలోని ఐదు సంఘాల్లో 58 వార్డులకు 15 వార్డులు ఏకగ్రీవం కాగా 45 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. 111 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా 99 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు.  


 కొడిమ్యాల లో 23వార్డులకు ..

మల్యాల (కొడిమ్యాల) :  కొడిమ్యాల మండలంలోని సహకార సంఘాల పరిధిలో ఎన్నికలకు  ఏర్పాట్లు పూర్తిచేసినట్లు రిటర్నింగ్‌ అధికారులు తెలిపారు.  పూడూరు సంఘంలో 13వార్డులకు  6ఏకగ్రీవం కాగా 7వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. కొడిమ్యాల సంఘంలో 13వార్డులకు  7ఏకగ్రీవం కాగా 6వార్డులకు,  తిర్మలాపూర్‌ పరిధిలో 3వార్డులు ఏకగ్రీవం పది వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. 


మల్యాలలో 28వార్డులకు ఎన్నికలు

మల్యాల : మండలంలో మూడు సహకార సంఘాల పరిధిలో 28వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. మల్యాలలో 7వార్డులు ఏకగ్రీవం కాగా, 6వార్డులకు, నూకపెల్లిలో 12వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు.  పోతారం సంఘం పూర్తిగా ఏకగ్రీవమైంది. తక్కళ్లపెల్లి సంఘం పరిధిలో మూడు ఏకగ్రీవం కాగా 10 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. మల్యాల సీఐ కోరె కిషోర్‌, ఎస్‌ఐలు శివకృష్ణ, ఉపేంద్రాచారి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహిస్తున్నారు.  logo