బుధవారం 01 ఏప్రిల్ 2020
Jagityal - Feb 11, 2020 , 01:29:33

సహ‘కారు’ జోరు

సహ‘కారు’ జోరు

జగిత్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ:  పార్టీ సింబల్‌ లేని సహకార సంఘాల ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ తన ప్రభావాన్ని చూపుతున్నది. జిల్లాలోని సహకార సంఘాల అధ్యక్ష స్థానాల్లో టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులే చైర్మన్లుగా, డైరెక్టర్‌గా గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాలో 51 సహకార సంఘాలుండగా, వాటిలో ఇప్పటికే 25సంఘాలు టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులు కైవసం చేసుకోనున్నారు. మిగిలిన స్థానాల్లోనూ టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులు గెలిచే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జిల్లాలోని 18 మండలాల పరిధిలో మొత్తం 51 సహకార సంఘాలు, 663 డైరెక్టర్‌ స్థానాలున్నాయి. సోమవారం నామినేషన్ల ఉప సంహరణ తర్వాత 312 డైరెక్టర్‌ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మరో 351 డైరెక్టర్‌ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 

ఐదు సంఘాలు సంపూర్ణంగా ఏకగ్రీవం 

ఐదు సహకార సంఘాల పరిధిలోని అన్ని డైరెక్టర్‌ స్థానాలూ ఏకగ్రీవమయ్యాయి. మెట్‌పల్లి మండలం బండలింగాపూర్‌ సంఘంలోని 13 డైరెక్టర్‌ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇక్కడ ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు నిర్ణయించిన డైరెక్టర్‌ చైర్మన్‌ కానున్నారు. మల్లాపూర్‌ మండలం ముత్యంపేట, సిరిపూర్‌ సంఘాల పరిధిలో 13 చొప్పున డైరెక్టర్‌ స్థానాలన్నీ ఏకగ్రీవమయ్యాయి. ముత్యంపేట సంఘం అధ్యక్షుడిగా తక్కల నరేశ్‌రెడ్డి, సిరిపూర్‌ అధ్యక్షుడిగా బద్దం అంజిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలున్నాయి. కోరుట్ల మండలం మాదాపూర్‌ సంఘం పరిధిలోనూ 13 మంది డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక్కడ గడ్డం ఆదిరెడ్డి చైర్మన్‌ అయ్యే అవకాశాలున్నాయి. మల్యాల మండలం పోతారం సంఘం పరిధిలో 12 డైరెక్టర్‌ స్థానాలు ఏకగ్రీవం కాగా అధ్యక్షుడిగా మరోసారి అయిల్నేని సాగర్‌రావు బాధ్యతలు చేపట్టనున్నారు. 

20సంఘాల్లో మెజార్టీ డైరెక్టర్లు ఏకగ్రీవం 

ఐదు సంఘాల్లో మొత్తం డైరెక్టర్‌ స్థానాలు ఏకగ్రీవం కాగా, మరో 20సంఘాల పరిధిలో మెజార్టీ డైరెక్టర్‌ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. టీఆర్‌ఎస్‌ బలపర్చిన వారు మెజార్టీ స్థానాల్లో ఏకగ్రీవం కావడంతో ఆయా సంఘాలను సైతం టీఆర్‌ఎస్‌ మద్దతు దారులు కైవసం చేసుకోనున్నారు. మెట్‌పల్లిలో 13 స్థానాలుండగా, ఏడు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. భూషణ్‌రావుపేటలో 13 స్థానాలకు 10 ఏకగ్రీవమయ్యాయి. భూషణ్‌రావుపేట సంఘం చైర్మన్‌గా మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ లోకబాపురెడ్డి ఎన్నికల లాంఛనం కానుంది. ఉప్పుమడుగు పరిధిలో 13 స్థానాలుండగా, ఏడు స్థానాలు, మల్లాపూర్‌ పరిధిలో 13 స్థానాలకు 8, ధర్మపురిలో 8 స్థానాలు, జైన పరిధిలో 8, కొడిమ్యాలలో 7, గొల్లపల్లిలో 11, చందోలిలో 9, కోరుట్లలో 10, ఐలాపూర్‌లో 10, వల్లంపల్లిలో 7, భీమారంలో 11, నందగిరిలో 8, నంచర్లలో 8, పెగడపల్లిలో 7, ఎండపల్లిలో 7, మల్యాలలో 7 స్థానాలు, ఇబ్రహీంపట్నంలో 9 స్థానాలు, యామాపూర్‌లో 11 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మెజార్టీ స్థానాలను టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులు గెలుచుకోవడంతో ఇరవై సంఘాల్లోనూ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలను టీఆర్‌ఎస్‌ బలపర్చిన వ్యక్తులే సాధించనున్నారు. 

చక్రం తిప్పిన మంత్రి కొప్పుల 

ధర్మపురి నియోజకవర్గ పరిధిలోని సింగిల్‌ విండో స్థానాలను కైవసం చేసుకునే విషయంలో రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ చక్రం తిప్పారు. ధర్మపురి నియోజకవర్గం పరిధిలోని మెజార్టీ సింగిల్‌ విండో స్థానాలను టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులకు దక్కేలా వ్యూహ రచన చేశారు. ధర్మపురి నియోజకవర్గ పరిధిలో 12 సంఘాలున్నాయి. (ఇందులో రెండు ధర్మారం మండలానికి సంబంధించినవి) 12 సంఘాల పరిధిలో 9 సంఘాలను టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులు గెలిచేలా చూడడంలో మంత్రి ఈశ్వర్‌ సఫలీకృతులయ్యారు. ధర్మపురి, జైన, గొల్లపల్లి, చందోళి, నంచర్ల, పెగడపల్లి, ఎండపెల్లి, నందగిరి స్థానాలు దాదాపు టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకున్నా యి. ధర్మపురి చైర్మన్‌గా ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, జైన చైర్మన్‌గా సౌళ్ల నరేష్‌, గొల్లపల్లి రాజ సుమన్‌రావు, చందోళి వెంకట మాధవరావు, పెగడపల్లి చైర్మన్‌గా ఒరుగంటి రమణారావు బాధ్యతలు స్వీకరించనున్నారు. ధర్మారం మండలంలోని నందిమేడారం సంఘాన్ని సైతం టీఆర్‌ఎస్‌ పార్టీ బలపర్చిన అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. మిగలిన పత్తిపాక, వెల్గటూర్‌, తిమ్మాపూర్‌ సొసైటీల్లోనూ టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులు కొన్ని స్థానాల్లో ఏకగ్రీవమయ్యారు. అయితే చైర్మన్‌ స్థానాన్ని సాధించేందుకు అవసరమైన మెజార్టీ సాధించేందుకు ఎన్నికల దాకా ఆగాల్సిన పరిస్థితి నెలకొంది.  


logo
>>>>>>