శనివారం 04 ఏప్రిల్ 2020
Jagityal - Feb 10, 2020 , 01:19:34

నడిరాత్రి విషాదం

నడిరాత్రి విషాదం

కొడిమ్యాల/కరీంనగర్‌ హెల్త్‌ : శనివారం ఆర్ధరాత్రి కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం కురిక్యాల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృత్యువాత పడడం ఉమ్మడి జిల్లాలో విషాదం నింపింది. టాటా ఏస్‌ వాహనాన్ని లారీ ఢీకొనడంతో జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం గౌరాపూర్‌కు చెందిన నలుగురు, పూడూర్‌ గ్రామానికి చెందిన ఒకరు చనిపోయారు. ఒకే గ్రామానికి చెందిన నలుగురి మృతితో గౌరాపూర్‌ శోకసంద్రంలో మునిగిపోయింది. 

గాయపడ్డ వ్యక్తికి చికిత్స చేయించి 

తిరిగి వస్తుండగా..

గౌరాపూర్‌కు చెందిన మ్యాక బాబు శనివారం సాయంత్రం గ్రామం నుంచి ఇంటికి వెళ్తుండగా తన ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడి గాయపడ్డాడు. దీంతో గ్రామానికి చెందిన మ్యాక నర్సయ్య, మ్యాక శేఖర్‌, మ్యాక బాణయ్య, పూడూర్‌కు చెందిన గడ్డం అంజయ్య టాటా ఏస్‌ వాహనంలో బాబును చికిత్స కోసం కరీంనగర్‌ తరలించారు. అక్కడ వైద్యం చేయించుకొని తిరిగి గౌరాపూర్‌ వస్తుండగా అదేరోజు అర్ధరాత్రి కురిక్యాల వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ గడ్డం అంజయ్య (50), మ్యాక నర్సయ్య (58), మ్యాక బాబు (28), మ్యాక శేఖర్‌ (28) అక్కడికక్కడే మృతి చెందారు. మాజీ ఎంపీపీ మ్యాక బాణయ్య (58) తీవ్రగాయాలతో పడి ఉండగా స్థానికులు, గంగాధర ఫోలీసులు కరీంనగర్‌ దవాఖానకు తరలించారు. బాణయ్య చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం తెల్లవారుజామున 3 గంటలకు తుది శ్వాస విడిచాడు. ఒకే గ్రామానికి చెందిన నలుగురి మృతితో గౌరాపూర్‌ శోకసంద్రంలో మునిగింది. 

ప్రమాదంలో తండ్రీకొడుకుల మృత్యువాత

గౌరాపూర్‌కు చెందిన మ్యాక బాబు, తండ్రి నర్సయ్య ప్రమాదంలో మృతి చెందడం స్థానికులను కలిచివేసింది. కొడుకు బాబుకు గాయాలు కాగా కరీంనగర్‌లో వైద్యం చేయించుకొని వస్తానని ఇంట్లో భార్య లక్ష్మీదేవమ్మకు చెప్పి వెళ్లిన భర్త, కొడుకు బాబుతో కలిసి తిరిగి రానిలోకాలకు వెళ్లిపోవడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నిండింది. కూతురు దివ్వ డిగ్రీ పూర్తి చేసి హైదరాబాద్‌లో ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తుండగా ఇద్దరి మృతితో వారి కుటుంబం పెద్ద దిక్కులను కోల్పోయినట్లయింది. నర్సయ్య ఇంటివద్ద వ్యవసాయం చేసేవాడు కాగా  బాబు ఇటివలే డ్రైవర్‌ కం ఓనర్‌ పథకంలో కారు కొనుగోలు చేసి నడిపిస్తున్నాడు. 

స్నేహితుడి వైద్యం కోసం వెళ్లి.. 

గ్రామానికి చెందిన మ్యాక శేఖర్‌, బాబు స్నేహితులు. బాబుకుకు వైద్యం కోసం వెళ్లి రోడ్డు ప్రమాదంలో శేఖర్‌ కూడా చనిపోయాడు. శేఖర్‌ కరీంనగర్‌లో పైవేట్‌ ఉద్యోగం చేసేవాడు.  

మృతుల్లో మాజీ ఎంపీపీ 

గౌరాపూర్‌కు చెందిన మ్యాక బాణయ్య గ్రామ సర్పంచ్‌గా, సింగిల్‌ విండో డైరెక్టర్‌గా, కొడిమ్యాల మండల పరిషత్‌ అధ్యక్షుడిగా సేవలందించారు. బాణయ్యకు భార్య నాగవ్వ, ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. బాబు కుటుంబసభ్యులు తమ బంధువులే కావడంతో చికిత్స కోసం బాణయ్య సైతం వెళ్లి మృత్యువాత పడ్డాడు. 

కిరాయికని వెళ్లి.. 

పూడూర్‌కు చెందిన గడ్డం అంజయ్య టాటా ఏస్‌ వాహనం నడుపుతూ ఉపాధి పొందేవాడు. భార్య లావణ్య, కూతురు అఖిల, కొడుకు రాకేశ్‌ ఉన్నారు. టాటా ఏస్‌ వాహనంతో కిరాయికని వెళ్లి రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. 

మంత్రి, ఎమ్మెల్యే పరామర్శ 

కుటుంబ సభ్యుల రోదనలతో కరీంనగర్‌లోని ప్రభత్వ దవాఖాన దద్దరిల్లింది. బాధిత కుటుంబాలను వైద్యశాలలో ఆదివారం ఉదయం రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ పరామర్శించారు. ఒకేసారి ఐదుగురు మృతిచెందడం తమను కలిచివేసిందని, ఆ కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. ప్రమాద విషయం తెలిసి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌, టీపీసీసీ అధికార ప్రతినిధులు మేడిపల్లి సత్యం, కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, కవ్వంపల్లి సత్యానారాయణ, బాస సత్యనారాయణ, బొడిగ శోభ, ఎమ్మార్పీఎస్‌ నాయకులు ప్రభుత్వ దవాఖానకు చేరుకొని మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని ఆందోళన చేశారు. ఆర్డీవో ఆనంద్‌కుమార్‌ వచ్చి బాధిత కుటుంబాలతో మాట్లాడుతూ ఎక్స్‌గ్రేషియా కోసం ప్రభుత్వానికి సిఫారసు చేస్తామన్నారు. బాధితుల కుటుంబాలవి జగిత్యాల జిల్లా కావడంతో ఆ జిల్లా కలెక్టర్‌కు నివేదిక అందజేస్తామన్నారు. ఒక్కో మృతుడి కుటుంబానికి లారీ ఓ నర్‌ నుంచి రూ.25 వేల చొప్పున తక్షణ సా యం అందజేశారు. మృతదేహాలను ప్రత్యేక అంబులెన్స్‌లో స్వస్థలాలకు పంపించగా ఆయా గ్రామాల్లో రాత్రి వరకు అంత్యక్రియలు పూర్తి చేశారు. 


logo