సోమవారం 06 ఏప్రిల్ 2020
Jagityal - Feb 10, 2020 , 01:15:32

జాతరో జాతర..

జాతరో జాతర..

కోరమీసాల సామికి కోటి దండాలు 

‘కోరిన కోర్కెలు తీర్చే కోరమీసాల సామీ నీకు కోటి దండాలు” అంటూ కొడిమ్యాల మండలం నల్లగొండ లక్ష్మీ నరసింహస్వామి స్వామివారిని వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. ఆదివారం నిర్వహించిన రథోత్సవంలో చిన్నాపెద్దా తేడా లేకుండా పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచే కాకుండా వరంగల్‌, నిజామాబాద్‌, అదిలాబాద్‌, మెదక్‌ తదితర జిల్లాల నుంచి సుమారు 80 వేల మంది తరలివచ్చినట్లు అధికారులు అంచనా వేశారు. ఆలయ ఈఓ కాంతారెడ్డి, వ్యవస్థాపక ధర్మకర్త చెన్నాడి సత్యనారాయణరావు, సర్పంచ్‌ పిల్లి మల్లేశం, ఎంపీటీసీ చీకట్ల సింధు ఆధ్వర్యంలో భక్తులకు సౌకర్యాలు కల్పించారు. రథోత్సవం అనంతరం రాత్రి వేళ స్వామి వారి ఏకాంత సేవ నిర్వహించారు. గుట్ట పైన గుట్ట కింద ఉన్న స్వామి వార్లను దర్శించుకునేందుకు భక్తులు ఉదయం 4 గంటల నుంచే క్యూలైన్లలో వేచి ఉన్నారు. 

తాటిపల్లిలో వేంకటేశ్వరుడి రథోత్సవం

 జగిత్యాల రూరల్‌ మండలం తాటిపెల్లిలో  వేంకటేశ్వర స్వామి రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా  నిర్వహించారు. ఆలయంలో హోమం, గోపాలకల్వలు, ఒడిబియ్యం, డోపోత్సవం తదతర ప్రత్యేక పూజాది కార్యక్రమాలు చేశారు. భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. సర్పంచ్‌ నాడెం రత్నమాల శంకర్‌, ఉప సర్పంచ్‌ బక్కశెట్టి గణేష్‌ తదితరులు పాల్గొన్నారు. 


అంబారిపేటలో ..

జగిత్యాల అర్బన్‌ మండలం అంబారిపేటలో వేంకటేశ్వర స్వామి  కల్యాణం. రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసిన రథంపై స్వామి వారల ఉత్సవ మూర్తులను ఉంచి రథోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించారు.  మున్సిపల్‌ అధ్యక్షురాలు బోగ శ్రావణి ప్రవీణ్‌, రూరల్‌  ఎంపీపీ గాజర్ల గంగారాం గౌడ్‌, సర్పంచ్‌ గొడిశెల గంగాధర్‌, ఉప సర్పంచ్‌ పోగుల  నారాయణ, ఆలయ చైర్మన్‌ భారతపు నాగరాజు, అర్బన్‌ జడ్పీటీసీ సంగెపు మహేశ్‌ తదితరులు పూజల్లో పాల్గొన్నారు. 

మత్స్యగిరీంద్రుడికి ప్రత్యేక పూజలు

మాఘ పౌర్ణమి జాతర సందర్భంగా శంకరపట్నం మండలంలోని కొత్తగట్టు మత్స్యగిరీంద్రస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. నీలాదేవి, భూదేవి సమేతుడైన మత్స్యగిరీంద్రస్వామిని దర్శించుకునేందుకు క్యూ లైన్లలో బారులు తీరారు. ఉదయం నుంచీ సాయంత్రం వరకు ప్రత్యేక పూజలు, రాత్రి గరుడ సేవ నిర్వహించి తీర్థప్రసాద వితరణ చేశారు. అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా హుజూరాబాద్‌ రూరల్‌ సీఐ కిరణ్‌ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు. ఆలయ చైర్మన్‌ తూముల శ్యాంరావు, ఈఓ వెంకటయ్య ఆధ్వర్యంలో భక్తులకు ఏర్పాట్లు చేశారు.  

 బీర్‌పూర్‌లో డోలోత్సవం, తెప్పోత్సవం

బీర్‌పూర్‌ మండలంలోని గుట్టపై వెలసిన లక్ష్మీనరసింహుడికి ఉదయం చందనోత్సవం, సాయంత్రం కోనేరులో  డోలోత్సవం, తెప్పోత్సవాలను వైభవంగా నిర్వహించారు. బీర్‌పూర్‌కు చెందిన చిట్నేని శ్రీవాణి-విజయ్‌ కుమార్‌ దంపతులు అమ్మవారికి ఆరున్నర గ్రాముల బంగారు పుస్తెలు, మట్టెలుర భక్తులు పంచహారతుల సెట్టును అందజేశారు. ఎంపీపీ మసర్తి రమేశ్‌, సర్పంచ్‌ గర్షకుర్తి శిల్ప, కార్యనిర్వాహణ అధికారి ముద్దం శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. logo