సోమవారం 30 మార్చి 2020
Jagityal - Feb 08, 2020 , 02:09:39

దేశంలోనే గొప్ప పథకం కల్యాణలక్ష్మి

దేశంలోనే గొప్ప పథకం కల్యాణలక్ష్మి

జగిత్యాల రూరల్‌:  కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ దేశంలోనే గొప్ప పథకాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్‌వీఎల్‌ఆర్‌ గార్డెన్స్‌లో శుక్రవారం అర్బన్‌ మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 138కల్యాణలక్ష్మి, 73షాదీ ముబారక్‌ లబ్ధిదారులకు రూ.2,04,53,012 విలువ గల చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదింటి ఆడపడుచుల వివాహాలు భారం కాకూడదనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ మేనమామ కట్నం కింద రూ.1,00,116 కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాల ద్వారా అందజేస్తున్నారన్నారు. ఈ పథకాల కింద మొదట రూ.51వేలు అందజేయగా తర్వాత రూ.75,116 అందజేశారని, ప్రస్తుతం రూ.లక్షా 116 ఇస్తున్నట్లు తెలిపారు. అనంతరం 188మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.లక్షా 116 చొప్పున రూ.1,88,21,808, 19మంది లబ్ధిదారులకు రూ.75,116 చొప్పున రూ.14,27,204, నలుగురు లబ్ధిదారులకు రూ.51వేల చొప్పున రూ.2,04,000 మొత్తం రూ.2,04,53,012 విలువగల చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో  అర్బన్‌ ఎంపీపీ మ్యాదరి వనిత, మున్సిపల్‌ అధ్యక్షురాలు బోగ శ్రావణి, వైస్‌ చైర్మన్‌ గోలి శ్రీను, తాసిల్దార్‌ నలువాల వెంకటేశ్‌, కౌన్సిలర్లు తోట మల్లికార్జున్‌, కూసరి అనిల్‌, కోరె గంగమల్లు, చుక్క నవీన్‌, అడువాల జ్యోతి, పిట్ట ధర్మరాజు, వొద్ది లత, బాలె లత, బండారి రజిని, వొల్లెపు రేణుక, నాయకులు హరి అశోక్‌కుమార్‌, బండారి నరేందర్‌, బాలె  శంకర్‌ తదితరులు పాల్గొన్నారు. 

గ్రామాల అభివృద్ధికి కృషి

గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ అన్నారు. జగిత్యాల మండలంలోని హబ్సీపూర్‌, తక్కళ్లపెల్లి, తిమ్మాపూర్‌, గుల్లపేట గ్రామాలకు పల్లె ప్రగతి కింద పంపిణీ చేసిన ట్రాక్టర్లను శుక్రవారం ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ గ్రామాల అభివృద్ధికి పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి ప్రతినెలా నిధులను మంజూరు చేస్తున్నారన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయన్నారు. ప్రతిఒక్కరూ  గ్రామాల అభివృద్ధికి తమవంతు కృషి చేయాలన్నారు. గ్రామాల్లో హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కల సంరక్షణకు పాటుపడాలన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం నిరంతర ప్రక్రియ అని, పల్లె ప్రగతి కార్యక్రమంలో చేపట్టిన పనులను విజయవంతం చేయాలన్నారు. రూరల్‌ ఎంపీపీ గాజర్ల గంగారాంగౌడ్‌, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. 

అన్ని వర్గాల సంక్షేమానికి కృషి

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి ఎల్లవేళలా కృషి చేస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ అన్నారు. పట్టణంలోని భవానీనగర్‌లో గల సోషల్‌ వెల్ఫేర్‌ స్కూల్‌ 4వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నేటి బాలలే రేపటి భావిభారత పౌరులన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుల, మతాలకు తావులేకుండా అన్ని వర్గాల  సంక్షేమానికి పాటుపడుతుందన్నారు. అన్ని వర్గాలకు గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసిందన్నారు. విద్యార్థులు ఉన్నత చదువులు చదివి అత్యుత్తమ స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ప్రిన్సిపాల్‌ అశోక్‌ రెడ్డి, కౌన్సిలర్‌ మల్లమ్మ, నాయకులు దుమాల రాజ్‌కుమార్‌, తిరుమలయ్య, సుజాత, శ్రీను, సతీశ్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo