శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Jagityal - Feb 06, 2020 , 02:12:32

రైతుల ఆశలపై నీళ్లు

రైతుల ఆశలపై నీళ్లు

జగిత్యాల, నమస్తే తెలంగాణ: రైతుల చిరకాల కోరిక అయిన పసుపు బోర్డును తీసుకురాని నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ రాజీనామా చేయాలని పట్టభద్రుల ఎ మ్మెల్సీ జీవన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ నివాసంలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పసుపు బోర్డు కోసమే రైతులు ధర్మపురి ఆర్వింద్‌ను ఎంపీగా గెలిపించారని గుర్తు చేశారు. మున్సిపల్‌ ఎన్నికలకు ముందు పసుపుబోర్డు వచ్చిందని సోషల్‌ మీడియాలో విస్తృత ప్రచారం చేశారని, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పసుపుబోర్డుకు బదులు సుగంధ ద్రవ్యాల బోర్డు ప్రాంతీయ కార్యాలయం, విస్తరణ కేంద్రాన్ని ప్రకటించడంలో ఆంతర్యం ఏమిటో వారికే తెలియాలన్నారు. నిజామాబాద్‌, జగిత్యాల జిల్లా రైతులు ఉద్యమం చేసింది పసుపు బోర్డు కోసం తప్ప, సుగంధ ద్రవ్యాల బోర్డు కోసం కాదన్నారు. ఎంపీ ఎన్నికల్లో అర్వింద్‌ బాండ్‌ పేపర్‌ రాసిచ్చాడని, ఇప్పుడు రైతులు పెట్టుకున్న ఆశలపై అర్వింద్‌ నీళ్లు చల్లారని మండిపడ్డారు. సుగంధ ద్రవ్యాల బోర్డుతో పసుపు రైతులకు ఎలాంటి లాభం ఉండదన్నారు. ఎంపీ అర్వింద్‌ పసుపుబోర్డు ఏర్పాటు చేయలేనందున నైతిక బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. పసుపు బోర్డుపై రైతుల ఆధ్వర్యంలో త్వరలో ఉద్యమం ప్రారంభిస్తామన్నారు. ఆయన వెంట కాంగ్రెస్‌ నాయకులు గిరినాగభూషణం, బండ శంకర్‌, కొత్త మోహన్‌ ఉన్నారు. 


logo