శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Jagityal - Feb 05, 2020 , 01:34:35

జట్టుగా పనిచేయండి

జట్టుగా  పనిచేయండి

జగిత్యాల, ప్రతినిధి, నమస్తే తెలంగాణ: సహకార సంఘాల ఎన్నికల్లో సిబ్బంది కలిసికట్టుగా పనిచేసి సాఫీగా జరిగేలా చూడాలని కలెక్టర్‌ గుగులోతు రవి ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాలులో నిర్వహించిన ఎన్నికల శిక్షణ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. ‘మీరంతా మీ సర్వీసులో ఎన్నో ఎన్నికలు విజయవంతం చేసిన ఆపార అనుభవం కలిగిన వారే.. ప్రతి ఎన్నికకూ వేర్వేరు రూల్స్‌ ఉంటాయి.. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ముందుక సాగండి” అంటూ సూచించారు. ఎలక్షన్‌ మెటీరియల్‌ను, ఇచ్చిన శిక్షణను  సద్వినియోగం చేసుకొని ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. సిబ్బంది అంతా బేధాభిప్రాయాలు లేకుండా కలిసికట్టుగా  పనిచేయాలని ఆదేశించారు. మీకు ఇచ్చిన శిక్షణతో పాటు పుస్తకాల్లో కూడా నామినేషన్‌ను తీసుకునే సమయంలో దానికి సంబంధించిన రూల్స్‌, స్క్రూటీని సమయంలో అమలు చేయాల్సిన రూల్స్‌ ఉన్నాయనీ, ఏమైనా అనుమానాలుంటే సీనియర్లను లేదా సంబంధిత అధికారులను అడిగి తెలుసుకోవాలని సూచించారు. సింబల్‌ అలర్ట్‌ పేమెంట్‌, ఎన్నికల రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎన్నికల లోకేషన్‌, రూట్‌ అధికారి ఎన్నికలు 51 పోలింగ్‌ స్టేషన్లలో జరుగుతున్నందున ముందుగానే వాటని తనిఖీ చేసుకోవాలన్నారు. 


ఎన్నికలకు ఇబ్బంది కలిగితే నిబంధననల ప్రకారం కఠిన చర్యలు తప్పవన్నారు. జేసీ బేతి రాజేశం మాట్లాడుతూ జిల్లాలో ఇంతకుముందు ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించామని, ఎన్నికల సిబ్బందికి నామినేషన్లు, స్క్రూటినీకి సంబంధించి ఎలా నిర్వహించాలనే వాటిపై శిక్షణలో వివరించడంతో పాటు పుస్తకాలు ఇచ్చామని చెప్పారు. బ్యాలెట్‌ పేపర్లు ప్రింటింగ్‌ తప్పులు లేకుండా చూసుకోవాలని, ఈ ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎన్నికల విధంగానే ఉదయం 7గంటల నుంచి, మధ్యాహ్నం 1.00గంట వరకు ఉంటాయని భోజనానంతరం కౌంటింగ్‌ నిర్వహిస్తామన్నారు. సీఈఓలు ఎన్నికల్లో పాల్గొనే సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలన్నారు. నిర్లక్ష్యం, అలసత్వం వహించిన వారిపై ఎన్నికల నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో డీఆర్వో అరుణశ్రీ, డీసీవో రామానుజాచారి పాల్గొన్నారు.


logo