ఆదివారం 29 మార్చి 2020
Jagityal - Feb 04, 2020 , 01:13:01

వన దేవతల జాతరకు వేళాయె

వన దేవతల జాతరకు వేళాయె

ధర్మపురి, నమస్తే తెలంగాణ : ధర్మపురి పట్టణ శివారులోని మోరెళ్ల వాగు సమీపంలో వన దేవతలు సమ్మక్క, సారలమ్మ జాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సహకారంతో రూ.10లక్షలతో జాతర వద్ద భక్తులకు ఇబ్బందులు కలుగకుండా గద్దెల చుట్టూ జాలీలు ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం విశాలమైన షెడ్డును నిర్మించారు. అలాగే జాతర ప్రదేశంలో సీసీ రోడ్డు వేశారు. భక్తులకు ఘన స్వాగతం పలికేలా తోరణాన్ని నిర్మిస్తున్నారు. అలాగే జాతరలో భాగంగా పూజారి బైరబోయిన వెంకటయ్య ఆధ్వర్యంలో సోమవారం ఉదయం గణపతి పూజ, పుణ్యహావచనం, జలాదివాసం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నెల 5న రాత్రి 9గంటలకు సారలమ్మ గద్దెకు చేరుట, 6న ఉదయం 4గంటలకు సమ్మక్క గద్దెకు చేరే కార్యక్రమాలుంటాయనీ ఉత్సవాల నిర్వాహకులు తెలిపారు. 7న భక్తుల మొక్కుల చెల్లింపు, 8న తిరిగి దేవతలు వన ప్రవేశం చేస్తారని తెలిపారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా జాతర ప్రాంగణంలో వైద్య శిబిరం, తాగునీరు, విద్యుత్‌ సౌకర్యం ఏర్పాట్లు చేశామని జాతర నిర్వహణ గౌరవ అధ్యక్షుడు అల్లకొండ నర్సయ్య, అధ్యక్షుడు ఒల్లెపు శంకర్‌రాజు పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. జాతరకు రూ.10లక్షలు కేటాయించిన మంత్రి ఈశ్వర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 

చిల్వాకోడూరులో..

గొల్లపల్లి : మండలం చిల్వాకోడూరు గ్రామంలో సమ్మక్క, సారలమ్మ జాతరకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జాతర కమిటీ అధ్యక్షుడు అల్లాడి వెంకన్న, పూజారి కోరెం హన్మంతు తెలిపారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి చిల్వాకోడూరు గ్రామంలోని ఎక్కల్దేవి గుట్టపై సమ్మక్క, సారలమ్మ జాతరకు ఏర్పాట్లు పూర్తి చేశారు. 5న బుధవారం సారలమ్మ గద్దెకు వచ్చుట, 6న గురువారం సమ్మక్క గద్దెకు వచ్చుట, 7న మొక్కుబడులు చెల్లింపు, 8న దేవతల వన ప్రవేశం నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. 


logo