సోమవారం 06 ఏప్రిల్ 2020
Jagityal - Feb 03, 2020 , 04:00:55

సహకార రణం

సహకార రణం
  • నేడు నోటిఫికేషన్‌
  • ఒక్కో సహకార సంఘంలో 13మంది డైరెక్టర్లు
  • రిజర్వేషన్ల కోసం ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
  • 663 డైరెక్టర్‌ స్థానాలకు ఎన్నికలు
  • జిల్లా వ్యాప్తంగా 51 సంఘాలు

జగిత్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ: సహకార సంఘాల ఎన్నికలకు అధికారులు కసరత్తు ము మ్మరం చేశారు. మున్సిపల్‌ ఎన్నికలు ముగిసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సహకార సంఘాల ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనవరి 30న ఎన్నికల షెడ్యుల్‌ను అధికారులు ప్రకటించారు. ఫిబ్రవరి 3న ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు. జిల్లాలో 51 సహకార సంఘాలు ఉండగా ఒక్కో సంఘానికి 13మంది చొప్పున మొత్తం 663 డైరెక్టర్‌ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎస్టీ ఓటర్లు లేని చోట 12 డైరెక్టర్‌ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 


ఎన్నికలకు అధికారుల ఏర్పాట్లు 

జిల్లాలో 18మండలాలు ఉండగా మొత్తం 51 సహకార సంఘాలున్నాయి. కొత్తగా ఆరు సహకార సంఘాల కోసం అధికారులు ప్రతిపాదనలు పంపగా ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల కావడంతో కొత్త సంఘాల కోసం విడుదలైన నోటిఫికేషన్‌ను రద్దు చేశారు. ప్రస్తుతం 51సహకార సం ఘాలకు ఎన్నికలు జరగనున్నాయి. రాయికల్‌, కోరుట్ల, మెట్‌పెల్లి ప్రాంతాల్లో సంఘాలు ఎక్కువగా ఉన్నాయి. జిల్లాలో 663 డైరెక్టర్‌ పదవులకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం రిజర్వేషన్లను ప్రకటించడంతో పాటు నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు. ఈ నెల 6నుంచి 8వ తేదీ వరకు నామినేషన్లను ఆయా సహకార సంఘాల్లోనే స్వీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. డైరెక్టర్‌ పదవులకు రిజర్వేషన్లు ఉన్నప్పటికీ సహకార సంఘం చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులను మాత్రం జనరల్‌ కేటగిరీలోనే భర్తీ చేసుకునే అవకాశం ఉంది. 


13 డైరెక్టర్‌ పదవులకు రిజర్వేషన్లు 

ఒక్కో సహకార సంఘంలో 13 డైరెక్టర్‌ పదవులుండగా మెజార్టీ సభ్యులు ఎవరి పేరును సూచిస్తే వారు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌గా ఎన్నికవుతారు. ఇం దులో డైరెక్టర్‌ పదవులకు అధికారులు రిజర్వేషన్లను ఖరారు చేస్తున్నారు. ఈ నెల 3న రిజర్వేషన్లు ప్రకటించనున్నారు. ప్రతి సహకార సంఘంలో ఒక స్థానం ఎస్సీ జనరల్‌కు, ఒక స్థానం ఎస్సీ మహిళకు, ఒక స్థానం ఎస్టీ జనరల్‌కు, రెండు స్థానాలు బీసీ జనరల్‌కు, ఏడు జనరల్‌కు, ఒక స్థానం ఓసీ మహిళకు కేటాయిస్తారు. 


చైర్మన్‌ పదవులపై కీలక నాయకుల దృష్టి 

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే గ్రామపంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌, మున్సిపల్‌ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఈ పదవులు దక్కని నాయకులు సంఘాల అధ్యక్ష స్థానాలపై దృష్టి సారించారు. ప్రొటోకాల్‌ ఉన్న నేపథ్యంలో అధ్యక్షస్థానాన్ని దక్కించుకుంటే, భవిష్యత్‌లో రాజకీయ పదవులకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. సాధారణ ఎన్నికలతో పోల్చిచూస్తే, సహకార సంఘాల్లో ఓటర్ల సంఖ్య తక్కువగా ఉండడం, గెలుపు కావాల్సిన ఓటర్లు అయిన వారిని ఒకవద్ద చేర్చేందుకు అవకాశం ఉన్న నేపథ్యంలో సంఘాల అధ్యక్ష స్థానం తమ రాజకీయ పునరావాస కేంద్రంగా కీలక నాయకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే జిల్లాలోని అన్ని పార్టీలకు చెందిన కీలక నాయకులు, సంఘాల ఎన్నికలపై దృష్టి సారించారు. గతంలో ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు జిల్లా సహకార సంఘం డైరెక్టర్లుగా సైతం జిల్లాలోని సంఘాల నాయకులు పనిచేశారు. కాగా ప్రస్తుతం కొత్త జిల్లాలు ఏర్పడడంతో జగిత్యాల జిల్లా సహకార సంఘం సైతం ఏర్పాటయ్యే అవకాశాలుండడం, జిల్లా అధ్యక్ష పదవిని దక్కించుకుంటే, కీలకమైన పదవిని సొంతం చేసుకున్నట్లేనన్న అభిప్రాయంలో కొందరు కీలక నాయకులు ఉన్నారు. ఈ నేపథ్యంలో సహకార సంఘాల అధ్యక్ష స్థానాలను కైవసం చేసుకునేందుకు వారు అప్పుడే రంగంలోకి దిగి తమ ప్రయత్నాలను ప్రారంభించారు.  



logo