శుక్రవారం 30 అక్టోబర్ 2020
Jagityal - Feb 02, 2020 , 01:21:27

ఆశ నిరాశే

ఆశ నిరాశే
  • అసంతృప్తి మిగిల్చిన కేంద్ర బడ్జెట్‌
  • తెలంగాణపై చిన్నచూపు : రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మన్‌ వినోద్‌కుమార్‌
  • ఎల్‌ఐసీ వాటాల విక్రయాల నిర్ణయంపై భగ్గుమన్న ఉద్యోగులు
  • కనిపించని కొత్త రైల్వే మార్గాలు
  • ఊసే లేని ‘కాళేశ్వరం’ ప్రాజెక్టు జాతీయ హోదా
  • ఆదాయ పన్ను శ్లాబుల్లో గందరగోళం

కరీంనగర్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ:2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌ అన్ని వర్గాలనూ ఆకట్టుకోలేకపోయింది. ఈ పద్దును నిశితంగా పరిశీలిస్తే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నా.. ఉమ్మడి జిల్లా కోణంలో చూసినా.. ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్ల కోణంలో చూసినా అసంతృప్తే మిగిల్చింది. ఇటు రాష్ట్ర సర్కారు అమలు చేస్తున్న రైతుబంధును కేంద్ర ఆర్థిక సర్వేలో ప్రస్తావించినా, బడ్జెట్‌లో మాత్రం రైతుబంధుకు నిధులు కేటాయించకపోవడం, రైతుల ఆదాయాన్ని డబుల్‌ చేస్తామని చెప్పినా..అది ఎలాగో చెప్పకపోవడంపై నిరాశే వ్యక్తమైంది. రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు కనీసం కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం కల్పించకపోవడంపై జిల్లా ప్రజలు పెదవి విరుస్తున్నారు. దేశానికే ఆదర్శ రాష్ట్రంగా నిలుస్తున్న తెలంగాణకు ఎలాంటి నిధులూ ఇవ్వకపోవడంపై నిరాశ చెందారు. కేంద్రం కావాలనే మొండి చేయి చూపుతోందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


తెలంగాణ రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేసే కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వేగంగా పూర్తి చేసి, తన సత్తాను చాటింది. యావత్‌ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన, నిలుస్తున్న ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని రాష్ట్రం కేంద్రాన్ని చాలాకాలంగా కోరుతున్నది. క్షేత్రస్థాయిలో జరుగుతున్న విజయపరంపరను దృష్టిలో పెట్టుకొని అయినా కేంద్రం జాతీయ హోదా కల్పిస్తుందని ఆశించింది. కానీ, బడ్జెట్‌లో ‘కాళేశ్వరం’ ఊసే ఎత్తలేదు. కనీసం రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లుగా నిధులు కేటాయిస్తున్నట్లుగా చెప్పలేదు. జాతీయ ప్రాజెక్టు హోదా కల్పిస్తే ఎన్నో రకాల ప్రయోజనాలు దక్కేవి. అంతేకాదు, ఉమ్మడి జిల్లాకు ఎక్కువ లాభం చేకూరేది. కేంద్రం ఈ విషయాన్ని ప్రస్తావించకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతాంగానికి ఎంతో ప్రయోజనం చేస్తున్నట్లుగా చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. లక్షలాది ఎకరాలకు నీళ్లందించే కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు విస్మరించిందన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో రాష్ట్ర బీజేపీ నాయకత్వం సమాధానం చెప్పాలన్న డిమాండ్‌ వ్యక్తం అవుతున్నది. 


ఎల్‌ఐసీ లిస్టింగ్‌పై ఆగ్రహం..

భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఆలంబనగా నిలుస్తున్న ఎల్‌ఐసీని లిస్టింగ్‌ చేస్తున్నట్లు ప్రకటించడంపై ఆ సంస్థ వర్గాలు భగ్గుమన్నాయి. అత్యంత లాభాలతో నడుస్తున్న ఎల్‌ఐసీలోని వాటాలను విక్రయించాలని నిర్ణయం తీసుకోవడం అత్యంత చీకటి రోజుగా పరిగణిమస్తున్నామని ఆ సంస్థ ఉద్యోగులు అభివర్ణించారు. 31 లక్షల కోట్లు ఆస్తులు కలిగి 30 కోట్లకు పైగా పాలసీదారులకు భద్రత కల్పిస్తూ, 60 ఏళ్లకుపైగా నమ్మకంగా సేవలందిస్తున్న ఎల్‌ఐసీనీ స్టాక్‌ మార్కెట్‌లో లిస్టింగ్‌ చేయాలని అనడం.. అత్యంత దురదృష్టకరమైన పరిణామంగా పేర్కొన్నారు. క్రమ క్రమంగా.. ఎల్‌ఐసీని బీఎస్‌ఎన్‌ఎల్‌, బీపీసీఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌ లాంటి సంస్థల మాదిరిగానే పెట్టుబడులు ఉపసంహరించి.. ఎల్‌ఐసీ సంస్థను ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించే క్రమంలో ఇది మొదటి అడుగుగా భవిస్తున్నట్లుగా ఉద్యోగులు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలని వారు డిమాండ్‌ చేశారు.


కేంద్రం మొండి చేయి

రెండోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా.. తెలంగాణ రాష్ట్రంపై వివక్ష చూపుతూనే ఉంది. రూ.30 లక్షల కోట్ల బడ్జెట్‌ తెలంగాణకు ఉపయోగపడుతుందని ఆశిస్తే.. నిరాశే ఎదురైంది. రాష్ర్టానికి ఏమాత్రమూ కేటాయించకపోవడం బాధాకరం. ఇంత వివక్ష ఎందుకు చూపుతున్నారో బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి. యువత పుష్కలంగా ఉందని నిర్మాలా సీతారామన్‌ చెప్పినా.. యువత స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు ఎటువంటి నిధులూ కేటాయించక వారిని నిరాశకు గురిచేసింది. విద్య, వైద్యం ఈ రోజుల్లో అత్యంత ఖరీదైంది. ఈ రెండు రంగాలకు కూడా సముచిత ప్రాధాన్య పద్ధతిలో నిధులు కేటాయించడంలో కేంద్రం విఫలమైంది.

- ఈద శంకర్‌రెడ్డి, ఐడీసీ చైర్మన్‌

              

కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ)ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల ఆశలపై నీళ్లు 

2020-21 బడ్జెట్‌పై ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలు చాలా అశలు పెట్టుకున్నాయి. కానీ వాటిపై ఎప్పటి మాదిరిగానే ఈసారి కూడా కేంద్ర బడ్జెట్‌ నీల్లు చల్లింది. ముఖ్యంగా ఆదాయ పన్నుకు సంబంధించి శ్లాబ్‌ రేట్లు తగ్గించినట్లుగా కనిపిస్తున్నా.. కొత్త ప్రతిపాదనను పూర్తిగా గమనిస్తే పన్ను ఎక్కువ చెల్లించాల్సి వస్తున్నది. నిజానికి అర్థిక మాంద్యం నెలకొన్న నేపథ్యంలో దానికి విరుగుడుగా ప్రజల వద్ద డబ్బులు ఉండాలి. కానీ, అందుకు విరుద్ధంగా ఈ బడ్జెట్‌ ఉంది. అంతేకాదు, తాజా పన్ను శ్లాబ్‌ల ప్రకారం  చూస్తే.. 80సీ కింద గతంలో ఉన్న మినహాయింపులు వర్తించవని కేంద్రం స్పష్టం చేసింది. అంతేకాదు.. పాత విధానంలో ఉంటారా? కొత్త విధానంలోకి మారుతారా? తెల్చుకోవాలంటూ కొత్త తిరకాసును పెట్టింది. నిజానికి ఈసారి ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని రూ.ఐదు లక్షలకు పెంచడంతో పాటు గతంలో 80సీ కింద ఇచ్చిన మినహాయింపులు యధావిధిగా కొనసాగిస్తారని ఉద్యోగవర్గాలు అశించాయి. అలాగే గృహ నిర్మాణాల రుణాల వడ్డీ మినహాయింపు ప్రస్తుతం ఉన్న రూ.రెండు లక్షల నుంచి రూ.రెండు లక్షల యాభై వేలకు పెంచుతారని ఆశ పడ్డారు. ఇవేవీ తాజా బడ్జెట్‌లో లేకపోవడం ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలను నిరాశకు గురిచేశాయి. ఒక్క మాటలో చెప్పాలటే.. కొత్త శ్లాబ్‌ల కన్నా.. పాత శ్లాబ్‌ బెటర్‌గా కనిపిస్తున్నది. - ప్రతాప్‌రెడ్డి, రిటైర్డ్‌ ప్రధానోపాధ్యాయులు 


అడుగడుగునా వివక్ష

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణపై అడుగడుగునా వివక్ష కనిపించింది. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ర్టానికి పూర్తి అన్యాయం జరిగింది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకపోవడం అత్యంత బాధాకరం. ఒక వేళ జాతీయహోదా ఇవ్వడం కష్టమని భావిస్తే.. కనీసం నిధులు కూడా కేటాయిస్తున్నట్లుగా ప్రకటన చేయలేదు. ఆశలు ఆ అంశాన్నే పట్టించుకోకపోవడం కేంద్రం తెలంగాణపై వివక్ష చూపుతుందని చెప్పడానికి నిదర్శనం. ఇవేకాదు, కొత్త రైల్వే ప్రాజెక్టులు తెలంగాణకు ఇచ్చిన దాఖలాలు బడ్జెట్‌లో కనిపించలేదు. దక్షిణ భారత దేశంలోనే అత్యధిక ఆదాయాన్ని ఇస్తున్న కరీంనగర్‌ రైల్వే స్టేషన్‌ అభివృద్ధికి, గోదాముల నిర్మాణానికి ఎటువంటి నిధులూ కేటాయించకపోవడం బాధాకరం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అహర్నిషలు కష్టపడుతూ తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడుపుతుంటే దానికి ఊతం ఇవ్వాల్సిన కేంద్రం కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నదని చెప్పడానికి తాజా బడ్జెట్‌ ఒక ఉదాహరణ.            

- గంగుల కమలాకర్‌, రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి