శనివారం 04 ఏప్రిల్ 2020
Jagityal - Jan 30, 2020 , 04:05:56

యువతలో మార్పే లక్ష్యం

యువతలో మార్పే లక్ష్యం

జగిత్యాల, నమస్తే తెలంగాణ: జిల్లాలో 31వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలను ఈనెల 27 నుంచి ప్రారంభించారు.  ఫిబ్రవరి 2వరకు నిర్వహించే ఈ కార్యక్రమాల్లో ముఖ్యంగా యువతనే లక్ష్యంగా చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు, సూచనల మేరకు ‘యువశక్తి ద్వారా మార్పు తెద్దాం” అనే నినాదంతో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ, రోడ్డు భద్రత నిబంధనలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు  ప్రచార రథాలు, ఫ్లెక్సీలు, వాల్‌ పోస్టర్లు, కరపత్రాల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో డ్రైవర్లకు, కళాశాలల విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 

యువతే ప్రధానం..

దేశ వ్యాప్తంగా జరుగుతున్న ప్రమాదాల్లో ముఖ్యంగా యువతే మృత్యువాత పడుతున్నది. రోడ్లపై నిత్యం ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదాల్లో గాయాలపాలై ప్రాణాలను కోల్పోతున్నవారి సంఖ్య పెరుగుతున్నది. అతివేగం, నిబంధనలు పాటించకపోవడం, మద్యం తాగి వాహనాలు నడపడం ఇలా కారణాలు ఏవైనా ప్రమాదాల బారిన పడి విలువైన ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ప్రమాదం నుంచి బయటపడేందుకు కనీసం హెల్మెట్‌, సీటు బెల్టు పెట్టుకోకపోవడం వంటి చిన్నపాటి జాగ్రత్తలు కూడా తీసుకోవడం లేదు. జిల్లాలో ప్రమాదాల సంఖ్య పెరగడంతో పాటు, తలకు తీవ్రగాయాలై మృత్యువాత పడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతున్నది. పోలీస్‌ స్టేషన్‌లో కొన్ని కేసులు నమోదవుతున్నా, మరికొన్ని కేసులు కాకుండానే పోతున్నాయి. ప్రమాదాల బారిన ఎక్కువ శాతం యువతే ఉంటున్నట్లు పోలీసు అధికారుల పరిశోధనలో తేలింది. జిల్లాలో ఏటా  200 నుంచి 300 మంది రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్నారు. వెయి మందికిపైగా గాయపడుతున్నారు. ఇవన్నీ మానవ తప్పిదాల వల్లే జరుగుతున్నాయని, వీటిని ఆరికట్టేందుకే అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని పోలీసులు వివరిస్తున్నారు.  


నిబంధనలు పాటించకపోవడం వల్లే..

దేశంలో రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్నవారు 25 ఏళ్లులోపువారే ఎక్కువ ఉంటున్నారని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. దీన్ని నివారించేందుకు ఈ సారి కేవలం యువతను లక్ష్యంగా చేసుకుని వారిలో మార్పుకోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వేగంగా నడపరాదని, తప్పని సరిగా హెల్మెట్‌ ధరించాలని, మద్యం తాగి వాహనాలు నడపవద్దని, లైసెన్సు, ఇన్సూరెన్సు వంటివి తీసుకోవాలని సూచిస్తున్నారు. వాహనచోదకులు నిబంధనలు కచ్చితంగా పాటించాలని, కార్లు నడిపే సమయంలో సీటు బెల్టు పెట్టుకోవాలని, ద్విచక్రవాహనదారులు హెల్మెట్‌ తప్పనిసరిగా ధరించాలని ఉదాహరణలతో వివరిస్తున్నారు. 

ఇవి తప్పనిసరి

 వాహనం నడుపుతూ సెల్‌ఫోన్‌ మాట్లాడొద్దు. 

 మద్యం తాగి వాహనం నడుపవద్దు. 

 వాహనం రోడ్డుకు ఎడమవైపే నడపాలి. 

 ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌ టేక్‌ చేసే సమయంలో సైడ్‌ అద్దాల్లో రెండు పక్కలా వాహనాలు వస్తున్నాయా? గమనించాలి.

 ముందు వెళ్లే వాహనానికి 50 అడుగుల దూరంలో ఉండేలా చూసుకోవాలి.

 అనుమతి లేని వాహణాల్లో ప్రయాణికులు ఎక్కరాదు.

 ఆటోలు, బస్సులు, జీపుల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించరాదు.

 అత్యవసరమైతే తప్ప రాత్రి వేళల్లో ప్రయాణాలు చేయరాదు.

 లైసెన్సు లేని వారికి, మైనర్లకి వాహనాలివ్వద్దు.

 ముందు వెళ్లే వాహనాలకు తగినంత దూరంలో ఉండాలి.

 ప్రధాన రహదారులపై వాహనాలు నిలువవద్దు.

 కారు స్పీడ్‌ 80 కిలోమీటర్ల వేగం మించరాదు. అంతకు మించి నడిపినప్పుడు ప్రమాదాలు జరిగితే బెలూన్‌ ఓపెన్‌ అయినా ప్రాణాలను కాపాడలేకపోవచ్చు.

 మలువుల దగ్గర ముందుగానే స్పీడ్‌ను తగ్గించాలి. 

 ద్విచక్ర వాహనాలపై ఇద్దరే ప్రయాణించాలి.  

 రోజుకు 8 గంటలకు మించి డ్రైవింగ్‌ చేయకూడదు.

 వాహనాలను కుడివైపు నుంచే ఓవర్‌ టేక్‌ చేయాలి. 

 ఆటోల నుంచి స్కూల్‌ బ్యాగులు, టిఫిన్‌ బాక్సు బ్యాగులను బయట వేలాడదీయరాదు.

 స్కూల్‌ బస్సు నడిపే డ్రైవర్‌ వయస్సు 60 ఏళ్లు దాటరాదు. 

 డ్రైవర్‌కు ప్రతి మూడు నెలలకు ఒకసారి వైద్యపరీక్షలు, బస్‌కండిషన్‌ చెక్‌ చేయాలి. 

 బస్సులో ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్సు, మంటలను ఆర్పే సిలిండర్‌ ఉండాలి. 


logo