మంగళవారం 31 మార్చి 2020
Jagityal - Jan 30, 2020 , 03:55:16

అవినీతికి తావులేకుండా పాలన

అవినీతికి తావులేకుండా పాలన

మెట్‌పల్లి, నమస్తే తెలంగాణ/మెట్‌పల్లిటౌన్‌: అవినీతికి తావులేకుండా పట్టణ ప్రజలకు పురపాలక సేవలందిస్తామని నూతనంగా ఎన్నికైన చైర్‌పర్సన్‌ రానవేణి సుజాత అన్నారు. బుధవారం చైర్‌పర్సన్‌గా పదవీ బాధ్యతలను స్వీకరించారు. బయోమెట్రిక్‌ పరికరం కొనుగోలు ఫైలుపై తొలి సంతకం చేశారు. అనంతరం కౌన్సిలర్లు, ఉద్యోగులతో ఏ ర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉద్యోగులు సమయపాలన పాటించాలని, విధి నిర్వహణలో అలసత్వం వహించకూడదన్నారు. పారదర్శకమైన సేవలందించడమే లక్ష్యమని, ప్రజా ఫిర్యాదుల స్వీకరణకు కార్యాలయంలో ప్రత్యేక బాక్సు ఏర్పాటు చేస్తామన్నారు. అభివృద్ధి పనుల వివరాలను కమిషనర్‌ను అడిగి తెలుసుకున్నారు. పట్టణ సమగ్రాభివృద్ధి కోసం ఎమ్మెల్యేతో సీఎం వద్దకు వెళ్లి ప్రత్యేక నిధులు తీసుకువస్తామన్నారు. తాగునీటి సరఫరా, వీధి దీపాలు, పారిశుధ్యం తదితర మౌలిక వసతులకు సంబంధించి ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ కమిషనర్‌ను ఆదేశించారు. భవన నిర్మాణాల అనుమతితోపాటు ఇతర  పనుల కోసం మున్సిపల్‌లో సిబ్బంది చేతివాటం ప్రదర్శించకుండా చూస్తామన్నారు. అభివృద్ధితో పాటు అవినీతి రహిత మున్సిపాలిటీగా మెట్‌పల్లిని తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా తనకు అవకాశం కల్పించిన ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావుకు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టిన ఆమెకు మున్సిపల్‌ కమిషనర్‌ జగదీశ్వర్‌గౌడ్‌, సిబ్బంది పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్‌ కార్యాలయంలోని అన్ని విభాగాల గదులను పరిశీలించారు. సమావేశ మందిరంలో మరమ్మతులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ బోయినపల్లి చంద్రశేఖర్‌రావు, టీఆర్‌ఎస్‌ నాయకులు డాక్టర్‌ సత్యనారాయణ, కోటపాటి నర్సింహనాయుడు, కౌన్సిలర్లు, ఉద్యోగులు, నాయకులు పాల్గొన్నారు.   

బాల్క ముత్తమ్మ దంపతులకు సన్మానం 

మెట్‌పల్లిటౌన్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో 13వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా గెలుపొందిన చెన్నూర్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ తల్లి ముత్తమ్మ-సురేశ్‌ దంపతులను బుధవారం పట్టణ అనుబంధ గ్రామం రేగుంట అభివృద్ధి కమిటీ సభ్యులు సన్మానించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్‌ ముత్తమ్మ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రానవేణి సుజాత, తన కొడుకు ఎమ్మెల్యే సుమన్‌ సహకారంతో రేగుంటను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.  కార్యక్రమంలో  గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. 


logo
>>>>>>