శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Jagityal - Jan 28, 2020 , 02:17:20

బల్దియాలో నవశకం

బల్దియాలో నవశకం

జగిత్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జగిత్యాల జిల్లా గులాబివశమైంది. అసెంబ్లీ ఎన్నికలతో ప్రారంభమైన టీఆర్‌ఎస్‌ విజయ ప్రస్థానం పురపాలనతో ఉచ్ఛస్థాయికి చేరింది. ఎన్నికలు ఏవైనా గెలుపు గులాబిదళందే అన్న సీఎం కేసీఆర్‌ మాటలు జగిత్యాల జిల్లాలో అక్షరసత్యాలుగా నిలిచిపోయాయి. జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి, రాయికల్‌ ఐదు మున్సిపాలిటీలను ఏకపక్షంగా టీఆర్‌ఎస్‌ గెలుచుకుంది. సోమవారం నిర్వహించిన అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో ఐదు మున్సిపాలిటీల్లోను పూర్తిస్థాయి మెజార్టీతో విజయాన్ని అందుకుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఐదు మున్సిపాలిటీల్లోను నూతనంగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారంతో పాటు, అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక నేపథ్యంలో క్యాంపుకు తరలిన టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులందరూ సోమవారం ఉదయం పట్టణాల్లోని మున్సిపల్‌ కార్యాలయాలకు చేరుకున్నారు. ధర్మపురి మున్సిపాలిటీలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌ నేతకానిలు, ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా నమోదు చేసుకున్న నేపథ్యంలో వారు ఉదయం 11 గంటలకు ధర్మపురి మున్సిపల్‌ కార్యాలయానికి చేరుకున్నారు. జగిత్యాల మున్సిపాలిటీలో, మెట్‌పల్లి మున్సిపాలిటీలో ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా నమోదు చేసుకున్న ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌,  విద్యాసాగర్‌రావు మున్సిపల్‌ కార్యాలయాలకు చేరుకున్నారు. ఉదయం 11 గంటలకు ఐదు మున్సిపాలిటీల్లోను అధికారులు ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. తర్వాత అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికను నిర్వహించారు. జగిత్యాల మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన 37వ వార్డు కౌన్సిలర్‌ డాక్టర్‌ బోగ శ్రావణిని చైర్‌పర్సన్‌గా ప్రతిపాదించగా, 39 మంది సభ్యులు బోగ శ్రావణిని బలపర్చడంతో ఆమె చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. వైస్‌ చైర్మన్‌గా గోలి శ్రీనివాస్‌ను ప్రతిపాదించగా, ఆయనకు సైతం 39 మంది బలపర్చడంతో ఆయన ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. ధర్మపురి మున్సిపాలిటీలో చైర్‌పర్సన్‌గా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సంగి సత్తెమ్మ, వైస్‌చైర్మన్‌గా ఇందారపు రామన్న ఎంపికయ్యారు. కోరుట్ల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా అన్నం లావణ్య ఎన్నిక కాగా, వైస్‌ చైర్మన్‌గా గడ్డమీది వపన్‌ ఎన్నికయ్యారు. మెట్‌పల్లి చైర్‌పర్సన్‌గా రాణవేని సుజాత ఎంపిక కాగా, వైస్‌ చైర్మన్‌గా బోయినిపెల్లి చంద్రశేఖర్‌రావు ఎన్నికయ్యారు. రాయికల్‌ చైర్మన్‌గా మోర హన్మాండ్లు, ఎన్నిక కాగా, వైస్‌ చైర్‌పర్సన్‌గా గండ్ర రమాదేవి ఎన్నికయ్యారు. 

గులాబీ కోటగా జగిత్యాల  

ఉద్యమాల ఖిల్లాగా గుర్తింపు పొందిన జగిత్యాల జిల్లా నేడు గులాబీకోటగా మారిపోయింది. ఎన్నికలు ఏవైనా జగిత్యాలలో గెలుపు గులాబిదళందే అవుతోంది. అసెంబ్లీ నుంచి మొదలు కొని మున్సిపాలిటీ వరకు ప్రతి ఎన్నికలోను టీఆర్‌ఎస్‌ స్పష్టమైన విజయాన్ని సాధిస్తూ వస్తోంది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఘన విజయాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. అలాగే సర్పంచ్‌ల ఎన్నికల్లోను జగిత్యాల జిల్లాలోని 380 గ్రామ పంచాయితీల్లో 327 గ్రామ పంచాయితీలను టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులే గెలుచుకున్నారు. ఇక ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల ఎన్నికల్లోను టీఆర్‌ఎస్‌ ఘన విజయాన్ని దక్కించుకుంది. జిల్లాలోని 18 మండలాల్లో 17 మండలాలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. 17 మండలాల్లోను టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన వారే జడ్పీటీసీ సభ్యులుగా విజయం సాధించారు. 16 మండలాల్లో (ఎస్సీ రిజర్వేషన్‌ నేపథ్యంలో జగిత్యాల అర్బన్‌ మండలం మినహాయించబడింది) ఎంపీపీలుగా బాధ్యతలు స్వీకరించారు. ఇక తాజాగా మున్సిపల్‌ ఎన్నికల్లోను టీఆర్‌ఎస్‌ ఘన విజయాన్ని దక్కించుకుంది. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో 134 వార్డులు ఉండగా, 84 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయం సాధించడంతో ఐదు మున్సిపాలిటీలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. పుర పోరులో దక్కిన విజయంతో జగిత్యాల జిల్లా సంపూర్ణంగా టీఆర్‌ఎస్‌ ఖిల్లాగా మారిపోయింది. 


logo