గురువారం 02 ఏప్రిల్ 2020
Jagityal - Jan 27, 2020 ,

గణంగా.. తిరంగా..

గణంగా.. తిరంగా..
  • జిల్లాలో అంబరాన్నంటిన గణతంత్ర దినోత్సవం
  • వాడవాడనా మువ్వన్నెల జెండా రెపరెపలు
  • ఖిల్లాలో ఆకట్టుకున్న వేడుకలు
  • జాతీయ జెండాను ఆవిష్కరించిన కలెక్టర్‌ శరత్‌

జగిత్యాల, నమస్తే తెలంగాణ/జగిత్యాల టౌన్‌ : 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లాలో వేడుకలు కన్నులపండువలా సాగాయి. ఆదివారం ఉదయం విద్యార్థుల ర్యాలీలు, ప్రదర్శనలు, జయ జయ నినాదాలు హోరెత్తాయి. జిల్లా కేంద్రంలోని ఖిల్లాలో సంబురాలు అంబరాన్నంటాయి. కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. వివిధ పాఠశాలల విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఖిల్లాలో వేడుకలను తిలకించేందుకు ప్రజాప్రతినిధులు, పట్టణ నలు మూలల నుంచీ పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. గుస్సాడీ, నృత్యాలు, డోలు డప్పులు, చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాల మధ్య గణతంత్ర దినోత్సవం కన్నుల పండువగా జరిగింది. కలెక్టర్‌ శరత్‌ ఉదయం 9.05 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. వేడుకల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్పీ సింధూశర్మ నేతృత్వంలో పోలీసులు కట్టు దిట్టమైన భద్రత కల్పించారు.  


అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు...

కిడ్జీ స్కూల్‌, చైతన్య టెక్నో స్కూల్‌ కరిక్యూలమ్‌, తాటిపెల్లి గురుకుల పాఠశాల, యూరో కిండర్‌ గార్డెన్‌, పురాణిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల, చంద్రగ్రామర్‌ స్కూల్‌లకు చెందిన విద్యార్థులు దేశ భక్తి, సినీ గేయాలు చేసిన సాంస్కృతిక నృత్యాలు ఆలరించాయి. జిల్లా వ్యాప్తంగా 6 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు గణతంత్ర వేడుకల్లో భాగంగా పాటు చేసిన సాంస్కృతిక నృత్యాలు ఆహుతులను కట్టిపడేశాయి. గణతంత్ర వేడుకల్లో పాల్గొని నృత్యాలు ప్రదర్శించిన అన్ని బృందాలకు జిల్లా కలెక్టర్‌ శరత్‌, జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత, ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి, జెసీ రాజేశం, సబ్‌ కలెక్టర్‌ గౌతం పాత్రో, స్వయంగా విద్యార్థుల వద్దకు వెళ్ళి బహుమతులను అందజేసి, అభినందించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలకు మంత్రముగ్దులైన ప్రజాప్రతినిధులు నాయకులు, వివిధ సంఘాల నాయకులు నగదు బహుమతులను అందజేశారు. జగిత్యాలకు చెందిన పూల వ్యాపారి సాజిద్‌ పూలతో తయారు చేసిన భారత దేశ పటం వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పతాకావిష్కరణ, గౌరవ వందన స్వీకారం అనంతరం కలెక్టర్‌ శరత్‌, జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత స్టాల్స్‌ను పరిశీలించి, ఏర్పాటు చేసిన అధికారులను అభినందించారు. పలువురు లబ్ధిదారులకు ఆస్తులను పంపిణీ చేశారు. వివిధ పథకాల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. 


స్వాతంత్య్ర సమరయోధులకు సన్మానం

 జగిత్యాలకు చెందిన స్వాతంత్య్ర సమరయోధులు గంప లక్ష్మీరాజం, తాండ్ర మీన్‌రావు, వెల్గటూర్‌ మండలం కొత్తపేటకు చెందిన అచ్చ ఆగారెడ్డి, మల్యాల మండలం మానాలకు చెందిన గండ్ర రాఘవేంద్రరావు, పెగడపల్లి మండలం బతికపెల్లికి చెందిన బీ కిషన్‌ రావు, చాలగిరి ముత్యంరెడ్డి, రాయికల్‌ మండలం అల్లీపూర్‌కు చెందిన ఎర్ర శకుంతలను జిల్లా కలెక్టర్‌ శరత్‌, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత, జాయింట్‌ కలెక్టర్‌ రాజేశం శాలువాలతో సత్కరించారు.  


logo