గురువారం 09 ఏప్రిల్ 2020
Jagityal - Jan 27, 2020 ,

నేడే పురాధీశుల ఎన్నిక

నేడే పురాధీశుల ఎన్నిక

మెట్‌పల్లి, నమస్తేతెలంగాణ: జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో కొత్త పాలకవర్గాలు సోమవారం కొలువుదీరనున్నాయి. ఎన్నికైన కౌన్సిలర్లతో ఉదయం 11 గంటల మున్సిపల్‌ సమావేశం గదిలో ప్రమాణస్వీకారం చేయిస్తారు. అనంతరం ఏర్పాటు చేసే ప్రత్యేక సమావేశంలో  అధ్యక్ష, ఉపాధ్యక్షులను కౌన్సిలర్లు ఎన్నుకుంటారు. ఆ తర్వాత  చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్లు బాధ్యతలు స్వీకరిస్తారు. ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం  కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు,  చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నికకు సంబంధించి మున్సిపల్‌ అధికారులు ఏర్పాట్లు చేశారు. జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలో 48వార్డులకు ఎన్నికలు జరగ్గా 30వార్డులను టీఆర్‌ఎస్‌ గెలుచుకుంది. దీంతో ఇక్కడ బల్దియా పీఠం ఆ పార్టీకే దక్కబోతున్నది. కోరుట్లలోనూ 33వార్డులకు 21వార్డులను టీఆర్‌ఎస్‌ గెలుపొందింది. మెట్‌పల్లిలో 26వార్డులకు 16వార్డులను చేజిక్కించుకున్నది. ఇక్కడ ముగ్గురు స్వతంత్రులు టీఆర్‌ఎస్‌లో చేరడంతో ఆ సంఖ్య 19కి చేరింది. రాయికల్‌లో 12వార్డులకు 9వార్డులను గెలిచింది. ధర్మపురిలో 15వార్డులకు 8వార్డులను గెలిచి మెజార్టీ సాధించింది. ఈ ఐదు మున్సిపాలిటీల్లోనూ బల్దియా అధ్యక్ష పీఠాలను అధికార పార్టీ అభ్యర్థులే అధిష్టించబోతున్నారు. జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి బల్దియా అధ్యక్ష స్థానాలు బీసీ మహిళ, రాయికల్‌ బీసీ జనరల్‌కు కేటాయించిన సంగతి తెలిసిందే. అన్నిచోట్లా  మ్యాజిక్‌ ఫిగర్‌ కంటే అధనంగా కౌన్సిలర్లను గెలుపొందిన టీఆర్‌ఎస్‌ మున్సిపల్‌ పాలన పగ్గాలను చేపట్టనున్నది. పూర్తి మెజార్టీ ఉన్న నేపథ్యంలో టీఆర్‌ఎస్‌కు చెందిన వారే   చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌గా ఎన్నిక కావడం ఇక లాంఛనమే. మరో వైపు  మెట్‌పల్లి, కోరుట్లలో స్వతంత్రంగా పోటీ చేసి గెలిచిన పలువురు స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. మెట్‌పల్లి మున్సిపల్‌లో  ఎక్స్‌ ఆఫిషియో సభ్యులుగా  ఎమ్మెల్యే ఉంటారు. కౌన్సిలర్ల ప్రమాణస్వీకారం, చైర్‌ పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక, బాధ్యతల స్వీకరణకు ఎమ్మెల్యే హాజరు కానున్నారు.  కాగా  అధ్యక్ష పదవిని  బీసీ మహిళకు రిజర్వు చేయడంతో  19వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా  ఏకగ్రీవంగా ఎన్నికైన రానవేణి సుజాత, వైస్‌ చైర్మన్‌గా 10వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా గెలుపొందిన బోయినపల్లి చంద్రశేఖర్‌రావు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.  రానవేణి సుజాత భర్త డా. సత్యనారాయణ ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా ఉంటూ టీఆర్‌ఎస్‌లో సుదీర్ఘ కాలంగా పని చేస్తున్నారు. అదే విధంగా చంద్రశేఖర్‌రావు  మెట్‌పల్లి మండల పరిషత్‌కు తొలి అధ్యక్షుడిగా (ఎంపీపీ) పని చేశారు. ఎమ్మెల్యేకు  అత్యంత విశ్వాస పాత్రుల్లో ఒకరిగా  ఉంటూ  టీఆర్‌ఎస్‌లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.  వీరిద్దరికీ  చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులు  వరించడం ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతున్నది. కోరుట్ల అధ్యక్ష అభ్యర్థి సైతం ఖరారయ్యారు. ఒకటి రెండు బల్దియాల్లో ఇంకా చైర్మన్‌ అభ్యర్థి ఎవరనేది తేలలేదు. నేటి మధ్యాహ్నం వరకు తెలియనుంది. 


logo