బుధవారం 08 ఏప్రిల్ 2020
Jagityal - Jan 27, 2020 ,

నగునూర్‌కు ‘ప్రతిమ’ చేయూత

నగునూర్‌కు ‘ప్రతిమ’ చేయూత

కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: తమ సంస్థను నెలకొల్పిన గ్రామానికి బాసటగా నిలిచింది ప్రతిమ మెడికల్‌ కళాశాల. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి స్ఫూర్తితో నగునూర్‌ గ్రామానికి అవసరమైన ట్రాక్టర్‌తోపాటు ట్రీగార్డులు, తడిపొడి చెత్త బుట్టలు అందించి ఇతర సంస్థలకు ఆదర్శంగా నిలిచింది. ఆదివారం జిల్లా కేంద్రంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో ప్రతిమ కళాశాల సీఈవో బి.రాంచందర్‌రావు కలెక్టర్‌ కె.శశాంక చేతులమీదుగా కరీంనగర్‌ మండలం నగునూర్‌ సర్పంచ్‌ ఉప్పు శ్రీధర్‌కు ట్రాక్టర్‌ ట్రాలీ, వాటర్‌ ట్యాంకర్‌ను అందజేశారు. నగునూర్‌ గ్రామ పంచాయతీకి సరిపడా నిధులు లేకపోవడంతో ఈ విషయాన్ని స్థానిక సర్పంచ్‌ ఉప్పు శ్రీధర్‌, వార్డు సభ్యులు తమ గ్రామంలో ఉన్న ప్రతిమ వైద్య కళాశాల చైర్మన్‌ అండ్‌ ఎండీ బోయినపల్లి శ్రీనివాస్‌రావును సంప్రదించారు. తమ గ్రామానికి అవసరమైన ట్రాక్టర్‌, ట్రాలీ, వాటర్‌ ట్యాంకర్‌ను సమకూర్చాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన శ్రీనివాస్‌రావు ట్రాక్టర్‌తోపాటు ట్రాలీ, వాటర్‌ ట్యాంకర్‌ను గ్రామానికి అందిస్తామని తన సామాజిక స్పృహను చాటుకున్నారు. అందులో భాగంగానే గణతంత్ర వేడుల్లో కలెక్టర్‌ చేతుల మీదుగా సర్పంచ్‌కు అందించారు. అంతే కాకుండా ప్రతిమ ఫౌండేషన్‌ ద్వారా గ్రామంలోని ప్రతి కుటుంబానికి తడి పొడి చెత్త బుట్టలు పంపిణీ చేస్తామని, 3,500 ట్రీగార్డులు కూడా అందిస్తున్నామని ఈ సందర్భంగా సీఈవో బి.రాంచందర్‌రావు తెలిపారు. ట్రాక్టర్‌ సహా తడిపొడి చెత్త బుట్టలు, ట్రీగార్డులకు తమ ఫౌండేషన్‌ ద్వారా రూ.13 లక్షల వరకు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ శశాంక మాట్లాడుతూ.. ప్రతిమ ఫౌండేషన్‌ను అభినందించారు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి కార్పొరేట్‌ సంస్థలు ముందుకు వచ్చి ఇలా చేయూతనందించాలని కలెక్టర్‌ కోరారు. పల్లె ప్రగతి స్ఫూర్తితో ట్రాక్టర్‌తోపాటు ట్రీగార్డులు, తడిపొడి చెత్త బుట్టలను అందించిన ప్రతిమ మెడికల్‌ కళాశాల సీఎండీ శ్రీనివాస్‌రావు, సీఈవో రాంచందర్‌రావు, కళాశాల డీన్‌ డాక్టర్‌ ఆచంట వివేకానందను కలెక్టర్‌ అభినందించారు.


logo