సోమవారం 06 ఏప్రిల్ 2020
Jagityal - Jan 24, 2020 , 00:55:40

వార్‌ వన్‌సైడే..

 వార్‌ వన్‌సైడే..
  • -బల్దియాల్లో గుబాళించనున్న గులాబీ
  • -ఐదు మున్సిపాలిటీల్లోనూ పాగాకు అవకాశం
  • -సింగిల్‌ డిజిట్లకే కాంగ్రెస్‌, బీజేపీ పరిమితం!?
  • -ఓటింగ్‌ సరళి పరిశీలన తర్వాత టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ఆనందం
  • -ప్రతిపక్ష నేతల్లో నిర్వేదం
  • -అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తూగలేకపోయామనే అభిప్రాయంజిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లోనూ గులాబీ గుబాళించబోతున్నదనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. బల్దియా ఎన్నికల భేరి మోగినప్పటి నుంచీ వార్‌ వన్‌సైడే అన్న మాటలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్షాలు తమ ఉనికి చాటుకునేందుకు తాపత్రయపడ్డా అన్నీ సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బుధవారం జరిగిన పోలింగ్‌ సరళిని పరిశీలించిన అనంతరం టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆనందోత్సాహాల్లో మునిగిపోగా, ప్రతిపక్షాలు మాత్రం తీవ్ర నిర్వేదానికి లోనైనట్లు తెలుస్తున్నది. అధికార పార్టీకి గట్టిపోటీ ఇస్తామని  భావించినా కనీసం దరిదాపులోకి కూడా వెళ్లలేకపోయామని, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తూగలేకపోయామని విపక్ష పార్టీల శ్రేణులే వ్యాఖ్యానిస్తున్నాయి.


జగిత్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ:  జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లోనూ గులాబీ పాగా వేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బల్దియా ఎన్నికల భేరి మోగినప్పటి నుంచే వార్‌ టీఆర్‌ఎస్‌ వైపు  వన్‌సైడే అన్న మాటలు వినిపించినా ప్రతిపక్షాలు తమ ఉనికి చాటుకునేందుకు అనేక ప్రకటనలు గుప్పించాయి. పోలింగ్‌ సరళిని పరిశీలించిన అనంతరం కనీస పోటీని సైతం ఇవ్వలేని స్థితికి వెళ్లినట్లు విపక్ష శ్రేణులే వ్యాఖ్యానిస్తున్నాయి. జిల్లా పరిధిలోని జగిత్యాలలో 48 వార్డులకు, కోరుట్లలో 33, మెట్‌పల్లిలో 26, ధర్మపురిలో 15, రాయికల్‌లో 12వార్డులకు ఎన్నికలు జరిగాయి. కోరు ట్ల మున్సిపాలిటీలో మూడు, మెట్‌పల్లిలో ఒక వార్డు ఏకగ్రీవం కావడంతో 130వార్డులకు బుధవారం ఎన్నికలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా సగటున 72.71 శాతం పోలింగ్‌ నమోదైంది. ఐదు మున్సిపాలిటీల పరిధిలో సగటున 70 శాతానికి పైగా పోలింగ్‌ నమోదైంది. ఓటింగ్‌ ప్రక్రియ ముగిసిన తర్వాత అన్ని పార్టీల కీలక నాయకులు, అభ్యర్థులు, పోలింగ్‌ సరళిని బట్టి గెలుపు ఓటములను బేరీజు వేసుకున్నారు. ఐదు మున్సిపాలిటీల్లోనూ టీఆర్‌ఎస్‌ ఘనవిజయాన్ని సాధించే అవకాశాలున్నాయని అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్షాలు అంచనాకు వచ్చాయి. జగిత్యాల పట్టణంలో 48 వార్డు ల్లో 32కు పైగా వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలిచే అవకాశాలున్నాయని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

మూడు నాలుగు వార్డుల్లో గట్టిపోటీ ఉందని అక్కడ సైతం గెలిచే అవకాశాలున్నాయంటున్నారు. అరవై సంవత్సరాలుగా మున్సిపాలిటీలో అధికార పార్టీగా చక్రం తిప్పిన కాంగ్రెస్‌, ఈ సారి తీవ్రంగా దెబ్బతింటుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. చాలా వార్డుల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు కనీస పోటీని సైతం ఇవ్వలేకపోయారంటున్నారు. 48 వార్డుల్లో అభ్యర్థులను నిలిపిన కాంగ్రెస్‌, సింగిల్‌ డిజిట్‌కే పరిమితమవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీజేపీ సైతం సింగిల్‌ డిజిట్‌కే పరిమితమవుతుందని పేర్కొంటున్నారు. జిల్లా కేంద్రంలో 11 వార్డుల్లో బీజేపీ అభ్యర్థులను నిలబెట్టలేకపోయిందని, ఇక పోటీ చేసిన చోట కూడా సరైన అభ్యర్థులు లేక డిపాజిట్లు సైతం దక్కించుకునే పరిస్థితి లేదంటున్నారు. మూడు నుంచి ఐదు స్థానాల్లోనే బీజేపీ అభ్యర్థులు గెలిచే అవకాశాలున్నాయంటున్నారు. ఇక కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాల్లోనూ కారు దూసుకుపోనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. కోరుట్లలో 33 వార్డులకు మూడు ముందే ఏకగ్రీవమయ్యాయి. దీంతో 30 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించారు. 18 నుంచి 20 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలిచే అవకాశముందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.

కాంగ్రెస్‌ పార్టీ 2 వార్డులకు, బీజేపీ మూడు నాలుగు వార్డులకు పరిమితమవుతుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. మెట్‌పల్లిలో 25 వార్డుల్లో ఎన్నికలు జరగ్గా, 15కు పైగా వార్డుల్లో టీఆర్‌ఎస్‌ విజయం సాధిస్తుందని పార్టీ శ్రేణులు నమ్మకంగా చెబుతున్నాయి. ఇప్పటికే ఒకవార్డును ఏకగ్రీవంగా కైవసం చేసుకున్నామని, మరో పదిహేను వార్డుల్లో విజయం పక్కాగా సాధిస్తామని, రెండు వార్డుల్లో గట్టిపోటీ ఉందని పేర్కొంటున్నాయి. మెట్‌పల్లిలో కాంగ్రెస్‌, ఒకటి, రెండు వార్డులకే పరిమితమవుతుందని, బీజేపీ మూడు నుంచి నాలుగు వార్డుల్లో విజయం సాధించే అవకాశాలున్నాయని, ప్రధాన ప్రతిపక్ష పార్టీల కంటే స్వతంత్రులు ఎక్కువ గెలిచే అవకాశాలున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక 12 వార్డులున్న రాయికల్‌లో టీఆర్‌ఎస్‌ 8 వార్డుల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తుందని చెబుతున్నారు. 15 వార్డులున్న ధర్మపురిలో 10 వార్డులను టీఆర్‌ఎస్‌ గెలుస్తుందని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మొత్తంగా ఇతర పార్టీలు, స్వతంత్రుల మద్దతు లేకుండానే టీఆర్‌ఎస్‌ అన్ని బల్దియాల్లోనూ అధికారాన్ని దక్కించుకొని చైర్మన్‌ పీఠాలను కైవసం చేసుకుంటుందని పార్టీ శ్రేణులు, కీలక నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. అదే సమయంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీల కార్యకర్తలు, నాయకులు, పోలింగ్‌ సరళితో పూర్తిగా నైరాశ్యంలో కూరుకుపోయినట్లు తెలుస్తున్నది.

మున్సిపాలిటీల్లో గులాబీ గెలుపు ఖాయమని ముందే ఊహించినా, కనీసం గట్టిపోటీ ఇస్తామని భావించామని, పోలింగ్‌ సరళిని పరిశీలిస్తే, దరిదాపు పోటీని సైతం ఇవ్వలేకపోయామని వారు వ్యాఖ్యానిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాల నేపథ్యంలో ప్రజలు మరోసారి టీఆర్‌ఎస్‌కే పట్టం గట్టారంటున్నారు. వృద్ధాప్య పింఛన్లు, షాదీముబారక్‌, కల్యాణలక్ష్మి, కేసీఆర్‌ కిట్లు, వికలాంగ పింఛన్లు, ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపాయంటున్నారు. లబ్ధిదారులు, ముఖ్యంగా వృద్ధులు, మహిళలు కారు గుర్తుకే ఓటేశారంటున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇచ్చిన ఓటర్లు, కనీసం అభ్యర్థుల గుణగణాలను, అందుబాటులో ఉండే తత్వాన్ని సైతం పరిగణలోకి తీసుకోకుండా వన్‌సైడ్‌ వెళ్లిపోయారంటున్నారు. మొత్తంగా బుధవారం జరిగిన పోలింగ్‌ సరళి నేపథ్యంలో జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో వార్‌ వన్‌సైడేనని విశ్లేషకులు ప్రకటిస్తుండడం గమనార్హం.
logo