మంగళవారం 31 మార్చి 2020
Jagityal - Jan 23, 2020 , 01:09:05

ఓటెత్తిన పట్టణం

 ఓటెత్తిన పట్టణం
  • -ప్రశాంతంగా ‘పుర’ ఓటింగ్‌
  • -కదిలిన పట్టణవాసులు
  • -ఉదయం నుంచే కేంద్రాలకు బారులు
  • -కొత్త బల్దియాల్లో ఉత్సాహం చూపిన ఓటర్లు
  • -ఓటు హక్కును వినియోగించుకున్న ప్రముఖులు
  • -మొత్తంగా ఓటు వేసింది 1,24,624 మంది..
  • -ఓటింగ్‌లో మహిళలదే ఆధిక్యం
  • - కేంద్రాలను పర్యవేక్షించిన కలెక్టర్‌, ఎస్పీ


ఐదు మున్సిపాలిటీల్లో 72.71 శాతం పోలింగ్‌

‘పుర’పోరు ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల పరిధిలో బుధవారం పోలింగ్‌ నిర్వహించగా, పట్టణవాసుల్లో ఓటోత్సాహం కనిపించింది. అంతటా ఉదయం నుంచే కేంద్రాలకు బారులు తీరి ఓటు వేయడం కనిపించింది. 1,97,533మంది ఓటర్లకు 1,43,624 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో సగటున 72.71శాతం పోలింగ్‌ నమోదైంది. అత్యధికంగా ధర్మపురిలో 76.36శాతం, రాయికల్‌లో 76.02శాతం, మెట్‌పల్లిలో 72.40శాతం, కోరుట్లలో 72,30శాతం, అల్పంగా జగిత్యాలలో 72.09 శాతం నమోదైనట్లు యంత్రాంగం తెలిపింది. మొత్తంగా 1,00,756 మంది మహిళా ఓటర్లకు గానూ 77,050 (76.47శాతం), 96,772మంది పురుష ఓటర్లకు గానూ 66,573 (68.79శాతం)మంది ఓటు వేయగా, అంతిమంగా ఆడబిడ్డలే ‘గెలుపు’నిర్ణేతలని స్పష్టమవుతున్నది. 
- జగిత్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ

జగిత్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా జరిగాయి. మొత్తం ఓటర్లు 1,97,533మంది ఉండగా  1,43,624 మం ది తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో సగటున 72.71శాతం పోలింగ్‌ నమోదైంది. అత్యధికంగా ధర్మపురిలో 76.36శాతం, రాయికల్‌లో 76.02శాతం, మెట్‌పల్లిలో 72.40శాతం, కోరుట్లలో 72,30శాతం, అల్పంగా జగిత్యాల లో 72.09 శాతం  నమోదవగా కొత్త బల్దియాల పరిధి ఓటర్ల లో చైతన్యం వెల్లివిరిసింది. పలు పోలింగ్‌ కేంద్రాలను కలెక్టర్‌ శరత్‌, ఎస్సీ సింధూశర్మ పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వ విప్‌, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ సతీసమేతంగా, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌ కుటుంబసమేతంగా మెట్‌పల్లిలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పట్టభధ్రుల ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌, ఎస్పీ సింధూశర్మ ఓటే వేసి ఓటర్లకు స్ఫూర్తినిచ్చారు.
జగిత్యాలలో అత్యల్పం, ధర్మపురిలో అత్యధికం
జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలో అతి తక్కువగా 72.09 శాతం పోలింగ్‌ నమోదు కాగా, ధర్మపురి మున్సిపాలిటీలో అత్యధికంగా 76.36 శాతం పోలింగ్‌ నమోదైంది. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో 134వార్డులుండగా కోరుట్లలో 3, మెట్‌పల్లిలో 1వార్డు ఏకగ్రీవమయ్యాయి. బుధవారం 130 వార్డులకు పోలింగ్‌ నిర్వహించారు. కోరుట్లలో 72.30శాతం, మెట్‌పల్లిలో 72.40శాతం, రాయికల్‌లో 76.02 శాతం పోలింగ్‌ నమోదైంది.

మహిళలే నిర్ణేతలు

మున్సిపల్‌ ఎన్నికల్లోనూ మహిళలే గెలుపు నిర్ణేతలని స్పష్టమవుతున్నది. జిల్లాలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓట్లు అధికంగా ఉన్న విషయం తెలిసిందే. ఓట్లు వేసే విషయంలోనూ పురుషుల కంటే మహిళలే ఎక్కువ ఉత్సాహం చూపారు. జిల్లాలో 66,573 మంది పురుషులు, 77050 మంది మహిళలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. పురుషుల కంటే 11వేల మంది మహిళలు ఎక్కువగా ఓటు వేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలను మహిళా ఓటర్లే శాసించనున్నట్లు స్పష్టమవుతున్నది.

బ్యాలెట్‌ విధానంతో కాస్త ఇబ్బంది

ఈవీఎంలపై ఓటేసేందుకు ఓటర్లు అలవాటు పడిన నేపథ్యంలో బుధవారం బ్యాలెట్‌ పద్ధతిలో జరిగిన ఎన్నికల్లో ఓటర్లు కాస్త ఇబ్బంది పడ్డారు. గతంలో ఓటరు, ఎన్నికల సిబ్బంది, బ్యాలెట్‌ పత్రంపై సంతకం చేయడం, తర్వాత బ్యాలెట్‌ పత్రాన్ని నిలువుగా మధ్యలోకి మడత పెట్టడం, తర్వాత దాన్ని అడ్డంగా మడత పెట్టి ఓటరు సిబ్బంది అందించే ప్రక్రియ కొనసాగింది. సిబ్బంది మడత పెట్టి ఇచ్చిన బ్యాలెట్‌ పత్రంలో ముద్రించి ఉన్న గుర్తులపై స్వస్తిక్‌ ముద్ర వేసిన తర్వాత బ్యాలెట్‌ పత్రాన్ని మళ్లీ మడతపెట్టే క్రమంలో ఓటర్లు తికమకపడ్డారు. బ్యాలెట్‌ పత్రాన్ని ముందు నిలువుగా, తర్వాత అడ్డంగా మడత పెట్టాల్సి ఉండగా, చాలా మంది ముందు అడ్డంగా మడత పెట్టి, ఓటు వేయడం కనిపించింది. అడ్డంగా మడత పెట్టిన ఓట్లన్నీ చెల్లకుండా పోయే ప్రమాదముంది. ముఖ్యంగా వృద్ధులు, నిరక్షరాస్యులు ఓటు వేసే క్రమంల్లో అవస్థ పడ్డారు. చెల్లని ఓట్లు అభ్యర్థుల భవితవ్యాన్ని మార్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి.logo
>>>>>>